భవిష్యత్ ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని చాలామంది బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్‌లు(Fixed Deposits) చేస్తుంటారు. ఎఫ్‌డీల్లో పొదుపు చేసి కొంత కాలం తర్వాత వడ్డీని ఆదాయంగా పొందుతుంటారు. అయితే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఇటీవల ఫిక్స్‌డ్ డిపాజిట్‌లపై వడ్డీ రేట్లను సవరించింది. రూ.2 కోట్ల లోపు ఎఫ్‌డీలకు సవరించిన వడ్డీ రేట్లను ఫిబ్రవరి 15 నుంచి అమలు చేస్తోంది. ఈ డిపాజిట్ల ద్వారా వచ్చే వడ్డీని లెక్కించడానికి ఎఫ్‌డీ క్యాలిక్యులేటర్‌లను ఉపయోగించాల్సి ఉంటుంది.
* ఎస్బీఐ ఎఫ్‌డీ క్యాలిక్యులేటర్
ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీని లెక్కించడం కాస్త క్లిష్టమైన ప్రక్రియ. కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎఫ్‌డీ క్యాలిక్యులేటర్ సౌలభ్యాన్ని కల్పిస్తోంది. ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఎఫ్‌డీ క్యాలిక్యులేటర్ సేవలను ఉపయోగించుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎంత మొత్తంలో పెట్టుబడి చేస్తే మెచ్యూరిటీ సమయంలో ఎంత వస్తుందో క్యాలిక్యులేటర్ ద్వారా తెలుసుకుందాం.
ఏడాది కాలానికి..
ఎస్బీఐ ఎఫ్‌డీల్లో ఏడాది కాలానికి రూ.లక్ష పొదుపు చేశామని అనుకుందాం. ఏడాది టర్మ్ ఉన్న ఎఫ్‌డీలకు ప్రస్తుతం ఎస్బీఐ 6.80శాతం వడ్డీ రేటును కల్పిస్తోంది. దీంతో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే వడ్డీగా రూ.6,975 లభిస్తుంది. మెచ్యూరిటీ పూర్తయ్యాక మొత్తంగా రూ.1,06.975 చేతికి అందుతుంది.
రెండేళ్లు పొదుపు చేస్తే..
లక్ష రూపాయలను రెండేళ్ల కాలానికి ఎస్బీఐ ఎఫ్‌డీల్లో పొదుపు చేస్తే రూ.14,888 రిటర్న్స్ లభిస్తాయి. ఈ టర్మ్ ఎఫ్‌డీలకు ఎస్బీఐ ప్రస్తుతం 7శాతం వడ్డీరేటును అమలు చేస్తోంది. దీంతో రెండేళ్ల తర్వాత మీ ఖాతాలో రూ.1,14,888 జమవుతాయి.
ఇది కూడా చదవండి : EPFO అధిక పెన్షన్ కోసం అప్లై చేస్తున్నారా..? మీరు ఫాలో అవ్వాల్సిన ప్రాసెస్ ఇదే..
మూడేళ్లలో..
మూడేళ్ల గడువుపై చేసే ఎఫ్‌డీలపై ఎస్బీఐ వడ్డీరేటును 6.25 నుంచి 6.50కి పెంచింది. లక్ష రూపాయలను మూడేళ్ల పాటు పొదుపు చేస్తే వడ్డీ రూపంలో రూ.21,341 అందుతాయి. మెచ్యూరిటీ పూర్తయ్యాక మొత్తంగా రూ.1,21,341 పొందవచ్చు.
నాలుగేళ్లకు..
నాలుగేళ్ల కాల పరిమితితో చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎస్బీఐ 6.5శాతం వడ్డీ రేటును కల్పిస్తోంది. ఈ లెక్క ప్రకారం ఇన్వెస్టర్ తన లక్ష రూపాయలను నాలుగేళ్ల పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే రూ.29,422 రిటర్న్స్ వస్తాయి.
ఐదేళ్లకు చేస్తే..
ఎస్బీఐ ఐదేళ్ల గడువు కలిగిన ఎఫ్‌డీలకు కూడా 6.5శాతం వడ్డీ రేటును కల్పిస్తోంది. ఈ మేరకు రూ.1,00,000 ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ పూర్తయ్యాక రూ.1,38,042 మొత్తాన్ని పొందవచ్చు. రూ.38,042 వడ్డీ లభిస్తుంది.
ఎందుకు సవరించింది?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పెంచిన కారణంగా ఎస్బీఐ ఎఫ్‌డీ వడ్డీ రేట్లను సవరించింది. దీంతో ఖాతాదారులను ఆకట్టుకుని వారి నుంచి పెద్దమొత్తంలో పెట్టుబడులను స్వీకరించవచ్చు. ఫలితంగా బ్యాంకుకి ఆర్బీఐ నుంచి అప్పు తీసుకోవాల్సిన అవసరం ఉండబోదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: FD rates, Fixed deposits, Personal Finance, Sbi, State bank of india