SBI Term Deposits: ఎస్​బీఐ ‘ప్లాటినం డిపాజిట్ స్కీమ్’​ ప్రారంభం.. టర్మ్ డిపాజిట్లపై అధిక వడ్డీ, నో ప్రాసెసింగ్​ ఫీజు

(ప్రతీకాత్మక చిత్రం)

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సవంత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్​ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ) ‘ప్లాటినం డిపాజిట్​ స్కీమ్​’ను ప్రారంభించింది. ఈ స్కీమ్​ కింద కస్టమర్లు తీసుకునే రుణాలపై వడ్డీ రాయితీ, ప్రాసెసింగ్ ఛార్జీల మాఫీ వంటి అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది.

  • Share this:
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సవంత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్​ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ) ‘ప్లాటినం డిపాజిట్​ స్కీమ్​’ను ప్రారంభించింది. ఈ స్కీమ్​ కింద కస్టమర్లు తీసుకునే రుణాలపై వడ్డీ రాయితీ, ప్రాసెసింగ్ ఛార్జీల మాఫీ వంటి అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లు​ సెప్టెంబర్​ 14వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఆఫర్​లో భాగంగా బ్యాంక్ తన కార్ లోన్ కస్టమర్లకు ప్రాసెసింగ్ ఫీజులను మినహాయిస్తున్నట్లు పేర్కొంది. దీంతోపాటు కారు మొత్తం రేటులో 90 శాతం రుణం మంజూరు చేస్తామని తెలిపింది.

యోనో యాప్‌తో కారు లోన్​ తీసుకునే కస్టమర్లకు అదనంగా 25 బేసిస్ పాయింట్ల (బిపిఎస్) వడ్డీ రాయితీ అందిస్తామని ఎస్​బీఐ తెలిపింది. ఈ లెక్కన యోనో యాప్​ ద్వారా కారు లోన్​ తీసుకునే కస్టమర్లు కేవలం 7.5 శాతం వడ్డీ రేటుతో రుణాలు పొందవచ్చు. ఇక, గోల్డ్​ లోన్​ తీసుకునే కస్టమర్లకు 75 బేసిస్ పాయింట్ల వడ్డీ రాయితీ లభిస్తుంది. ఎస్​బీఐలో గోల్డ్​ లోన్​ 7.50 శాతం వడ్డీతో తీసుకోవచ్చు. యోనో యాప్ ద్వారా గోల్డ్ లోన్ల కోసం దరఖాస్తు చేసుకునే కస్టమర్లకు ప్రాసెసింగ్ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఇక, గృహ రుణాల విషయానికి వస్తే.. కేవలం 6.70% వడ్డీ రేటుకే రుణాలు ప్రారంభమవుతాయి.

సెప్టెంబర్​ 14 వరకే ఆఫర్లు..

కరోనా కట్టడికి ముందుండి పనిచేసిన ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్ కార్మికులు తీసుకునే వ్యక్తిగత రుణాలపై 50 బేసిస్ పాయింట్ల రాయితీ అందిస్తామని ఎస్​బీఐ తెలిపింది. భవిష్యత్తులో వారు తీసుకునే కారు, బంగారు రుణాలపై కూడా రాయితీలను వర్తింపజేస్తామని పేర్కొంది. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రారంభమైన ఈ స్కీమ్​ సెప్టెంబర్​14 వరకు అందుబాటులో ఉంటుంది. కస్టమర్లు 75 రోజులు, 75 వారాలు, 75 నెలల గడువుతో ఈ ప్లాటినం డిపాజిట్లలో పెట్టుబడి పెట్టవచ్చు. వీరికి 15 బీపీఎస్​ వరకు అదనపు వడ్డీ లభిస్తుంది. అయితే, ఈ స్కీమ్​ కింద రూ. 2 కోట్లలోపు డిపాజిట్లను మాత్రమే అనుమతిస్తారు. కస్టమర్లకు తాము తీసుకునే రుణాలపై మరింత డబ్బు ఆదా చేసుకునేందుకు ఉపయోగపడుతుందని ఎస్​బీఐ రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్ మేనేజింగ్ డైరెక్టర్ సిఎస్ శెట్టి ఒక ప్రకటనలో తెలిపారు.
Published by:Krishna Adithya
First published: