దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారుల భద్రత కోసం సరికొత్త చర్యలు తీసుకుంది. ఇకపై యోనో యాప్‌ను వినియోగించే ఖాతాదారులు భద్రతా నియమాలు పాటించకపోతే వారి అకౌంట్లను స్తంభింపచేస్తామని స్పష్టం చేసింది. ఇటీవల కాలంలో ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో బ్యాంకు ఈ చర్యలకు దిగింది.
బ్యాంకు గుమ్మం ఎక్కకుండా ఉన్న చోటునుంచే నగదు లావాదేవీలు నిర్వహించేందుకు వీలుగా ఎస్బీఐ తన ఖాతాదారుల కోసం యోనో యాప్‌ను ప్రవేశపెట్టింది. దాదాపు ఎస్బీఐ ఖాతాదారులందరూ దీనిని వినియోగిస్తుంటారు. ఇప్పుడీ యోనో యాప్ వినియోగానికి సంబంధించి ఎస్బీఐ కీలక ప్రకటన చేసింది. ఇకపై యోనో యాప్‌లోకి లాగిన్ అవడానికి ఏ మొబైల్ నెంబర్ అయితే బ్యాంకులో రిజిస్టర్ చేశారో.. ఆ నెంబర్‌తోనే లాగిన్ అవ్వాలి. మరో నెంబర్ ద్వారా ఈ ప్రయత్నం చేస్తే అది ఫలించకుండా బ్యాంకు యోనో యాప్‌లో మార్పులు చేసింది. ఈ నియమాన్ని కస్టమర్లు కచ్చితంగా పాటించాల్సిందేనని ఎస్బీఐ పేర్కొంది.
ఈ నిర్ణయాన్ని ఎస్బిఐ ఒక ట్వీట్ ద్వారా వెల్లడించింది. "యోనో యాప్‌తో సురక్షితంగా బ్యాంకింగ్ సదుపాయాలు వినియోగించుకోండి. యోనో యాప్ భద్రతా ప్రమాణాలను మరింత పెంచాం. ఇకపై బ్యాంకులో నమోదుచేసుకున్న ఫోన్ నెంబర్‌తో మాత్రమే యోనో యాప్‌లోకి లాగిన్ అవ్వగలరు" అని ఆ ట్వీట్లో వెల్లడించారు.
ఎందుకీ నియమం?
కోవిడ్ కారణంగా ప్రజలు ఇళ్ళకే పరిమితమయ్యారు. బ్యాంకులు తమ పనివేళలనూ తగ్గించాయి. మరోవైపు భౌతిక దూరం పాటించడం తప్పనిసరైంది. ఈ నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకు ఆన్‌లైన్‌పై ఆధారపడటం పెరిగింది. ఫలితంగా ఆయా బ్యాంకులు తమ కస్టమర్ల కోసం ఎన్నో యాప్‌లు తీసుకువచ్చాయి. ఈ యాప్‌లు ఎప్పటి నుంచో ఉన్నా కోవిడ్ కారణంగా వీటిని వినియోగం పెరిగింది. అదే సమయంలో సైబర్ కేటుగాళ్ళకు ఆన్లైన్ కార్యకలాపాలు వరంగానూ మారాయి. వీరు సులభంగా కస్టమర్ల పేరు, పాస్వర్డ్ కనుక్కోవడం ద్వారా యాప్‌లలోకి చొరబడి ఎంచక్కగా తమ పనికానిచ్చేస్తున్నారు. తమకు తెలియకుండానే తమ డబ్బు పోతోందంటూ కస్టమర్లు గగ్గోలు పెడుతున్నారు.
దీనిపై దృష్టిసారించిన ఎస్బీఐ తన యోనోయాప్లో సెక్యూరిటీ ఫీచర్‌ను మరింత బలోపేతం చేసింది. ఇకపై మోసగాళ్ళు ఖాతాదారుల పేరు, పాస్వర్డ్ ఆధారంగా యోనో యాప్‌లోకి చొరబడలేరు. ఎందుకంటే కేవలం రిజిస్టర్డ్ మొబైల్ ద్వారా మాత్రమే లాగిన్ అవ్వగలరు. మరో నెంబరు ఉపయోగించడాన్ని యోనో యాప్ అనుమతించదు. ఈ విషయాన్ని ఖాతాదారులు సీరియస్‌గా తీసుకోవాలని, కేవలం వారు నమోదు చేసుకున్న నెంబర్ నుంచి మాత్రమే లాగిన్ అవ్వాలని, అలాకాక వేరే నెంబరు నుంచి ప్రయత్నిస్తే వారి ఖాతాలు స్తంభించిపోతాయని ఎస్బీఐ స్పష్టం చేసింది.
ఇది క్లిక్ చేసి చూడండి.
ఇది క్లిక్ చేసి చూడండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sbi