Say No to Swiggy | విజయవాడ హోటల్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం..

Swiggy | సోమవారం ఉదయం 6 గంటల నుంచి ఆన్ లైన్ లో స్విగ్గీ యాప్ నుంచి హోటళ్లన్నీ లాగ్ అవుట్ కావాలని నిర్ణయించింది.

news18-telugu
Updated: November 10, 2019, 7:58 PM IST
Say No to Swiggy | విజయవాడ హోటల్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: November 10, 2019, 7:58 PM IST
ఆన్ లైన్ ఫుడ్ యాప్ స్విగ్గీకి షాక్ ఇవ్వాలని విజయవాడ హోటల్ యాజమాన్యాలు నిర్ణయించాయి. ఫుడ్ ఆర్డర్లపై కమిషన్ ను నానాటికీ పెంచుకుంటూ పోవడం, వినియోగదారులకు చేసే కాల్ ఛార్జీలను తమపైనే రుద్దడం, ఇవన్నీ చాలవన్నట్లుగా రహస్య ఛార్జీల విధింపుపై హోటల్ ఓనర్స్ భగ్గు మంటున్నారు. ఇవాళ స్విగ్గీ యాప్ ప్రతినిధులతో జరిగిన చర్చలు విఫలం కావడంతో రేపటి నుంచి " సే నో టూ స్విగ్గీ" నినాదంతో యాప్ నుంచి లాగ్ ఆఫ్ కావాలని విజయవాడ హోటల్స్ అసోసియేషన్ నిర్ణయించింది.

ఏడాదిన్నర క్రితం రాజధాని అమరావతిలో భాగమైన విజయవాడ నగరంలో ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్ యాప్ లైన స్విగ్గీ, జొమాటో, ఉబర్ ఈట్స్ ఒక్కొక్కటిగా ప్రవేశించాయి. తొలుత జీరో కమిషన్ పద్దతిలో ఫుడ్ వినియోగదారుల నుంచి ఆర్డర్లు తీసుకోవడం ప్రారంభించిన ఈ యాప్ లు … తర్వాత కస్టమర్ల నుంచి మంచి స్పందన రావడంతో ఒక్కో రూపాయి కమిషన్ పెంచుకుంటూ పోయాయి. తాజాగా ఒక్కో ఫుడ్ ఆర్డర్ విలువపై కమిషన్ ను 10 శాతం నుంచి 25శాతానికి పెంచుతూ ఫుడ్ ఆర్డర్ యాప్ లైన స్విగ్గీ, ఉబర్ ఈట్స్ నిర్ణయం తీసుకున్నాయి. దీనికి కస్టమర్ కాల్ ఛార్జీలు, కస్టమర్లకు ఇచ్చే ఆఫర్లలో కమిషన్ అదనం. స్విగ్గీ అయితే మిగతా యాప్ ల కంటే మరింత ముందుకెళ్లి హిడెన్ ఛార్జీలను కూడా వేధిస్తోందని వివిధ హోటళ్ల యజమానులు ఆరోపిస్తున్నారు. దీనిపై తదుపరి కార్యాచరణకు సిద్ధమైన విజయవాడ హోటల్స్ అసోసియేషన్... సోమవారం ఉదయం 6 గంటల నుంచి ఆన్ లైన్ లో స్విగ్గీ యాప్ నుంచి హోటళ్లన్నీ లాగ్ అవుట్ కావాలని నిర్ణయించింది. దీనిపై ఇవాళ స్విగ్గీ యాజమాన్యంతో విజయవాడలో జరిగిన తుది చర్చలు విఫలం కావడంతో రేపటి నుంచి విజయవాడలో స్విగ్గీ ఆర్డర్లు నిలిచిపోనున్నాయి.

స్విగ్గీతో పాటు ఇతర ఫుడ్ డెలివరీ యాప్ లు హోటళ్లపై మోయలేని భారాన్ని మోపుతున్నాయి. హిడెన్ ఛార్జీల రూపంలో ఆర్డర్ల విలువపై భారీ మొత్తాన్ని ఛార్జ్ చేస్తున్నాయి. ఇవాళ స్విగ్గీ యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో రేపటి నుంచి స్విగ్గీ యాప్ నుంచి లాగ్ అవుట్ కావాలని నగరంలోని అన్ని హోటళ్లు నిర్ణయించాయి. కస్టమర్లు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరుతున్నాం.

సంజయ్ జైన్, విజయవాడ హోటల్స్ అసోసియేషన్ కార్యదర్శి




విజయవాడలో మారుతున్న పరిస్ధితుల నేపథ్యంలో హోటళ్లు ఒక్కొక్కటిగా దివాళా తీస్తున్నాయి. దశాబ్దాలుగా నగరంలో వ్యాపారం నిర్వహిస్తున్న హోటళ్లన్నీ ఆన్ లైన్ ఆర్డర్ల దెబ్బకు తమ రూపురేఖలు మార్చుకుంటున్నాయి. ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్ ల రాకతో వాటి స్వరూపమే మారిపోయింది. జీఎస్టీ అమల్లోకి వచ్చాక హోటళ్లకు నేరుగా వచ్చే వారితో పోలిస్తే ఆన్ లైన్ లో ఆర్డర్ చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఎప్పటికప్పుడు ఆఫర్లతో ఆకట్టుకుంటున్న ఆన్ లైన ఫుడ్ డెలివరీ యాప్ లు దానికి తగినట్లుగానే హోటళ్లపై ఒత్తిడి పెంచుతున్నాయి. దీనిపై కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న హోటల్ యాజమాన్యాలు తాజాగా తమ నిరసన తెలిపాయి. దీనిపై యాప్ ల యాజమాన్యాల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తొలి దశలో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న స్విగ్గీకి షాక్ ఇవ్వాలని నిర్ణయించాయి. నగరంలో పరిస్దితులను దృష్టిలో ఉంచుకుని హోటల్ యాజమాన్యాలను విభజించు పాలించు పద్దతిలో శాసిస్తున్న యాప్ లకు అదే బాటలో షాక్ ఇవ్వాలని నిర్ణయించిన హోటళ్లు తొలుత స్విగ్గీ నుంచి బహిష్కరిస్తున్నాయి. పరిస్దితిలో ఎలాంటి మార్పు లేకపోతే మిగతా యాప్ ల పైనా త్వరలో నిర్ణయం తీసుకుంటామని హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు.

(సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్‌18)
First published: November 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...