రూపాయి పతనంతో మీ జేబుకు చిల్లేనా?

రూపాయి నేలచూపులు చూస్తోంది. డాలర్‌తో పోలిస్తే 70.26 కనిష్టానికి చేరింది. మరి రూపాయి పతనంతో సామాన్యులకు నష్టమేంటో తెలుసుకోండి.

news18-telugu
Updated: August 16, 2018, 11:29 AM IST
రూపాయి పతనంతో మీ జేబుకు చిల్లేనా?
Illustration by Mir Suhail/News18
  • Share this:
రూపాయి పతనం... ఈ మాట వింటే చాలు మార్కెట్ వర్గాల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. 72వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు చేసుకున్న మరుసటి రోజే డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.70.26 పైసలకు చేరింది. ఇది జీవితకాల కనిష్టం. కొన్ని రోజులుగా రూపాయి నేలచూపులు చూస్తూనే ఉంది. ఇప్పుడు ఇంత కనిష్టస్థాయికి పడిపోవడానికి కారణం టర్కిష్ లిరా దెబ్బేనంటున్నాయి మార్కెట్ వర్గాలు. టర్కీలో ఆర్థిక సంక్షోభం మన రూపాయిపైనే కాదు ప్రపంచంలోని మిగతా ఆర్థిక వ్యవస్థలపైనా ప్రభావం చూపిస్తోంది. ఆర్బీఐ రెపో రేట్ పెంచడం కూడా రూపాయి పతనానికి కారణమంటున్నారు నిపుణులు.

Rupee Slips to Lifetime Low of 70.26 Against the Dollar. Here’s How It Affects You
(Illustration by Mir Suhail)


రూపాయి పతనంతో మనకేంటి నష్టం?




  • రూపాయి విలువ పడిపోతే దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం మాత్రమే కాదు పౌరులపైనా ఆ ప్రభావం ఉంటుంది. ఇంటి బడ్జెట్‌తో పాటు వ్యక్తిగత ఖర్చులూ పెరుగుతాయి.

  • రూపాయి బలహీన పడితే భారతదేశం దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్, ఫర్టిలైజర్స్, మందులు, ఐరన్ ఓర్ లాంటి వస్తువుల ధరలన్నీ పెరుగుతాయి. ఇవి సామాన్యుల రోజూ వాడకపోయినా... మీ నెలవారీ బడ్జెట్‌పై ఆ ధరల పెరుగుదల ప్రభావం ఉంటుంది.

  • భారతదేశం వినియోగించే చమురులో 70 శాతం దిగుమతి చేసుకుంటోంది. రూపాయి బలహీనపడ్డప్పుడు ఎక్కువ చెల్లించి చమురు కొనాల్సి వస్తుంది. ఆ ప్రభావం పెట్రోల్, డీజిల్‌పై ఉంటుంది. వాటి ధరలు పెరగడం సామాన్యులకు భారమే.
  • ఇక ముడి పామాయిల్‌ను భారతదేశం భారీ స్థాయిలో దిగుమతి చేసుకుంటుంది. క్రూడ్ పామాయిల్ ధర పెరిగితే నిత్యావసరాలకు వాడే ఆయిల్ ధరలు కూడా పెరుగుతాయి.
    నిత్యం వినియోగించే ఎఫ్ఎంసీజీ వస్తువులైన సబ్బులు, డిటర్జెంట్, డియోడ్రెంట్, షాంపూ లాంటి ధరలూ పెరుగుతాయి.

  • భారతదేశం దిగుమతి చేసుకునే ఆయిల్, ధాన్యాలపై రూపాయి పతనం ప్రభావం ఉంటుంది.

  • ఫారిన్ డిగ్రీల కోసం రుణాలు తీసుకున్న విద్యార్థులకూ రూపాయి పతనంతో చిక్కులే. విద్యారుణాలన్నీ రూపాయిల్లో ఉంటాయి. కానీ వారు చెల్లించేది మాత్రం ఫారిన్ కరెన్సీలోనే. దీంతో వారి విద్యాఖర్చులు పెరుగుతుంటాయి. ఉదాహరణకు విదేశాల్లో ఏదైనా కోర్సుకు ప్రతీ నెల 100 డాలర్లు ఫీజు చెల్లిస్తున్నారనుకోండి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 65 ఉన్నప్పుడు రూ.6,500 చెల్లిస్తారు. ఆ విలువ 70కి చేరితే రూ.7,000 చెల్లించాలి. ఇలా రూపాయి విలువ పడిపోతున్నప్పుడల్లా విదేశాల్లో చెల్లించే ఫీజులు పెరుగుతుంటాయి. టూర్లు, వైద్య ఖర్చులు, ఇతర దిగుమతులన్నింటికీ ఇదే వర్తిస్తుంది.

  • విదేశాల్లో టూర్లకు వెళ్లాలనుకునేవారికీ రూపాయి పతనం చేదు వార్తే. ఫ్యూయెల్ సర్‌ఛార్జ్ పెరగడం వల్ల విమాన టికెట్ల ధరలూ పెరుగుతాయి. దీంతో పాటు హోటళ్లలో బస చేసినా, షాపింగ్ చేసినా జేబుకు చిల్లే.

  • విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆరోగ్య పరికరాల ధరలు పెరుగుతాయి. ఫలితంగా ఆ ప్రభావం ఇక్కడి పేషెంట్లపై ఉంటుంది. దాంతో పాటు చికిత్స కోసం విదేశాలకు వెళ్లేవారి వైద్య ఖర్చులు కూడా పెరుగుతాయి.

  • ఆటో మొబైల్ రంగంపై రూపాయి పతనం మూడు రకాలుగా ప్రభావం చూపిస్తుంది. ఒకటి: విదేశాల నుంచి విడిభాగాలు దిగుమతి చేసుకుంటే తయారీ ఖర్చులు పెరుగుతాయి. రెండు: కొన్ని కంపెనీలు విదేశీ మాతృ సంస్థలకు ఎక్కువగా రాయల్టీ చెల్లించాల్సి వస్తుంది. మూడు: విదేశాల నుంచి రుణాలు తీసుకున్నట్టైతే ఎక్కువ డబ్బులు చెల్లించాలి. ఈ ప్రభావంతో ఆటోమొబైల్ కంపెనీలు ధరలు పెంచక తప్పదు.

  • ఇవే కాదు మీ ఫేవరెట్ పిజ్జా దగ్గర్నుంచి లేటెస్ట్ ల్యాప్‌టాప్ వరకు అన్నీ భారమౌతాయి. కంప్యూటర్లు, టీవీలు, మొబైల్ ఫోన్స్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఖరీదౌతాయి.

  • ఇంటర్నేషనల్ ఫుడ్ చెయిన్స్‌పైనా రూపాయి పతనం ప్రభావం ఉంటుంది.

  • చాలావరకు ఉద్యోగాల్లో వేతనాలపై ప్రభావం కనిపిస్తుంది. ఎక్కువగా దిగుమతులపై ఆధారపడ్డ పరిశ్రమల్లో నిర్వహణా ఖర్చులు పెరుగుతాయి. ఇది కాస్తా ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంపై ప్రభావం చూపిస్తుంది.


ఇది కూడా చదవండి:

టర్కీ భయం..దేశీయ స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు
First published: August 16, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>