డాలర్@రూ.72.91..మరింత క్షీణించిన రూపాయి

క్రూడాయిల్ ధరలు పెరగడం, అమెరికా-చైనా మధ్య ట్రేడ్ వార్ భయాలు రూపాయి మారకం విలువపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.

news18-telugu
Updated: September 12, 2018, 11:06 AM IST
డాలర్@రూ.72.91..మరింత క్షీణించిన రూపాయి
మరింత క్షీణించిన రూపాయి విలువ(Illustration by Mir Suhail/News18)
  • Share this:
రూపాయి మారకం విలువ మరింత క్షీణించింది. ఫోరెక్స్‌లో అమెరికా డాలర్‌తో పోల్చితే జీవనకాల కనిష్ఠ స్థాయిలో రూపాయి విలువ 72.91గా నమోదయ్యింది. బుధవారం ఉదయం ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి విలువ మరో 22 పైసలు క్షీణించింది. అమెరికా-చైనా మధ్య ట్రేడ్ వార్ ముదరడం, క్రూడాయిల్ ధరలు పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, అమెరికా డాలర్‌కు గిరాకీ పెరగడం వంటి కారణాలతో రూపాయి విలువ మరింత బక్కచిక్కిపోతోంది.

మంగళవారంనాడు కూడా రూపాయి విలువ రికార్డు కనిష్ఠ స్థాయిలో 72.74కు పడిపోయి..చివరకు క్రితం ముగింపుతో పోల్చితే 24 పైసలు(0.33శాతం) క్షీణించి 72.69 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు 0.35 శాతం మేర పెరిగి ఒక బ్యారల్ 79.34 డాలర్లుగా నమోదయ్యింది.

అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల ప్రభావంతో ముందు ముందు రూపాయి విలువ మరింత క్షీణించే అవకాశముందని ఆర్థిక నిపుణులు అంచనావేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు ముగింపునాటికి రూపాయి మారకం విలువ డాలర్‌తో పోల్చితే 75కి పతనమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.


స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు


అటు సోమ, మంగళవారాల్లో 1000 పాయింట్ల మేర నష్టపోయిన బీఎస్ఈ సెన్సెక్స్...బుధవారం ఉదయం లాభాల్లో కొనసాగుతోంది. ఉదయం ప్రారంభ ట్రేడింగ్‌లో బీఎస్ఈ సెన్సెక్స్ 133 పాయింట్ల లాభంతో 37,546 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఆ తర్వాత సెన్సెక్స్ లాభాలను కొంత మేర కోల్పోయింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 77 పాయింట్ల లాభంతో 37,490 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుండగా..నిఫ్టీ 14 పాయింట్ల లాభంతో 11301 పాయింట్ల వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మా, ఐటీసీ, తదితర షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. యాక్సిస్ బ్యాంక్, యస్ బ్యాంక్, ఎస్బీఐ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

సెన్సెక్స్ లాభాల జోరును కొనసాగిస్తూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు ముగింపునాటికి 40 వేల పాయింట్లకు చేరుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనావేస్తున్నారు.
First published: September 12, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు