RUPEE SINKS TO ALL TIME LOW VS US DOLLAR BREACHES 69 MARK
ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయికి రూపాయి...!
ప్రతీకాత్మక చిత్రం
దిగుమతి దారులు, బ్యాంకులతో పాటు ఆయిల్ రిఫైనరీల నుంచి డాలర్‌కు డిమాండ్ పెరుగుతోంది. దీనికి తోడు క్రూడాయిల్ ధరలు కూడా పెరగడంతో రూపాయి విలువ ఆల్‌టైం కనిష్ఠానికి పడిపోయింది.
అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి పతనం కొనసాగుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ తొలిసారి 69 మార్కుని అందుకొని ఆల్‌టైం కనిష్ఠ స్థాయికి క్షీణించింది. గురువారం ట్రేడింగ్ ప్రారంభంలోనే 49 పైసల మేర పడిపోయి...ప్రస్తుతం 69.10 వద్ద ట్రేడవుతోంది. త్వరలోనే 70కి కూడా చేరుకోవచ్చని మార్కెట్ నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
బుధవారం కూడా డాలర్‌తో రూపాయి మారకం విలువ 37 పైసల మేర పడిపోయింది. 19 నెలల కనిష్ఠ స్థాయికి క్షీణించి 68.61 వద్ద ముగిసింది. ఇక ఇవాళ ట్రేడింగ్ ఆరంభంలోనే ఆల్ టైం కనిష్టానికి దిగజారింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతుండడం, ద్రవ్యోల్పణ భయాలు రూపాయి విలువపై ప్రతికూల పరిస్థితులు చూపిస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
అమెరికా, చైనా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం కారణంగా రూపాయిపై తీవ్రంగా ఒత్తిడి పెరుగుతోంది. అటు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. నవంబర్ లోపు ఇరాన్ నుంచి చమురు దిగుమతులను నిలిపివేయాలని తమ మిత్రదేశాలను అమెరికా కోరడంతో... చమురు ధరలు పైకి ఎగబాకుతున్నాయి. దీనికి తోడు దిగుమతి దారులు, బ్యాంకుల నుంచి డాలర్‌కు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రూపాయి విలువ పాతాళానికి పడిపోతోంది.
సామాన్యుడిపై ఎలా ప్రభావం చూపుతుంది?
మన దేశం పెట్రోల్ ఉత్పత్తుల్లో 80 శాతం మేర విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది.
రూపాయి క్షీణించడంతో పెట్రోలియం దిగుమతుల ఖర్చు భారీగా పెరుగుతుంది
దిగుమతుల ఖర్చు పెరడగడంతో చమురు సంస్థలు పెట్రోల్, డీజీల్ ధరలను పెంచుతాయి
పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగిత సాధారణంగానే రవాణా చార్జీలు పెరుగుతాయి ఈ పరిస్థితులు ద్రవ్యోల్పణానికి దారితీస్తాయి.
అటు వంట నూనెలు, పప్పు దినుసులను కూడా భారత్ పెద్ద మొత్తంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది.
రూపాయి పతనమవడంతో నూనె, పప్పు దినుసల ధరలు పెరిగే అవకాశముంది. ఫలితంగా సామాన్యుడి ఖర్చులు మరింత పెరగనున్నాయి.
విపక్షాల విసుర్లు:
రూపాయి పతనంపై విపక్షాలు కేంద్రాన్నిటార్గెట్ చేశాయి. 2014 ఎన్నికల ప్రచారంలో డాలర్‌తో రూపాయి మారకం విలువను మోడీ 48 రూపాయలకు తీసుకొస్తామని గొప్పలు చెప్పారని.. ఇప్పుడేం సమాధానం చెబుతారని కాంగ్రెస్ నేతలు నిలదీస్తున్నారు.
Rupee at all time low Modiji :
Rs 68 .89 to a $
In your pre-poll rhetoric you promised to bring it down to :
Rs 48 to a $