రూపాయి క్రాష్ కొనసాగుతోంది. ఆల్ టైమ్ హై రికార్డుల్ని రోజురోజుకీ అధిగమించేస్తోంది. వరుసగా ఏడో సెషన్లో కూడా రూపాయి విలువ కిందకు దిగజారింది. గురువారం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.72.12కు చేరింది. రూపాయి విలువ రూ.72 దాటడం ఇదే తొలిసారి. ప్రస్తుతం రూపాయి మారకం విలువ రూ.72.01. క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, విదేశీ పెట్టుబడులు తగ్గిపోవడం, అంతర్జాతీయ పరిణామాలు రూపాయి విలువ పతనానికి కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు రూపాయి పతనంపై ఆందోళన చెందొద్దని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెబుతున్నారు. ప్రపంచంలోని మిగతా దేశాల కరెన్సీలతో పోలిస్తే రూపాయి పరిస్థితి బాగానే ఉందన్నారాయన. రూపాయి విలువ పడిపోవడానికి అంతర్జాతీయ పరిణామాలే కారణం తప్ప దేశీయంగా ఎలాంటి సంక్షోభాలు కారణంగా కాదని జైట్లీ చెప్పారు. రూపాయి పతనం కారణంగా తలెత్తే ఇబ్బందులను అధిగమించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు చేపట్టిందని... దీని గురించి అతిగా ఆందోళన చెందాల్సిన పని లేదని జైట్లీ స్పష్టం చేశారు.