Reliance Industries: భారత కుబేరుడు ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్ పార్ట్నర్స్ నుంచి రూ.7500 కోట్ల నిధులను పొందినట్టు తెలిపింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన రిలయన్స్ రిటైల్‌లో సిల్వర్ లేక్ పార్ట్నర్స్ సంస్థ 1.75 శాతం వాటాలను కొనుగోలు చేసింది. దానికి సంబంధించి పెట్టుబడిని రిలయన్స్‌కు బదిలీ చేసింది. సెప్టెంబర్ 9న సిల్వర్ లేక్ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌లో రూ.7500 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రకటించింది.
‘రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ సంస్థ ఎస్ఎల్పీ రెయిన్బో హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (సిల్వర్ లేక్) నుంచి సబ్స్క్రిప్షన్ మొత్తం రూ.7500 కోట్లు రిసీవ్ చేసుకుంది.’ అని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. దీనికి ప్రతిగా ఎస్ఎల్పీ రెయిన్బో హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (సిల్వర్ లేక్) సంస్థ 1.75 శాతం ఈక్విటీ షేర్ కలిగి ఉంటుందని పేర్కొంది. ఈ పెట్టుబడి ద్వారా రిలయన్స్ రిటైల్ వెచర్స్ ప్రీ మనీ ఈక్విటీ వాల్యూ రూ.4.21 లక్షల కోట్లుగా లెక్కించారు. ఇది సిల్వర్ లేక్ సంస్థ నుంచి రిలయన్స్ సంస్థలో రెండో బిలియన్ డాలర్ల పెట్టుబడి. గతంలో సిల్వర్ లేక్ సంస్థ రిలయన్స్‌కే చెందిన జియో ప్లాట్‌ఫామ్స్‌లో 1.35 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టింది.

మే 3న ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్, జియో మధ్య ఒప్పందం కుదిరింది. సిల్వర్ లేక్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. మొదటి డీల్‌తో రూ.5,655.75 కోట్లు, రెండో డీల్‌తో రూ.4,546.80 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. ఈ రెండు డీల్స్ ద్వారా 2.08 శాతం ఈక్విటీ వాటా పొందనుంది సిల్వర్ లేక్.
సిల్వర్ లేక్ సంస్థకు 60 బిలియన్ డాలర్ల ఆస్తులు ఉన్నాయి. ప్రపంచంలోని దిగ్గజ టెక్, టెక్ ఆధారిత సంస్థల్లో ఆ సంస్థ పెట్టుబడులు పెట్టింది. భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడంలో సిల్వర్ లేక్ సంస్థ గ్లోబల్ లీడర్. సిల్వర్ లేక్‌తో సంస్థ ఎయిర్‌బీఎన్‌బీ, అలీబాబా, అల్ఫాబెట్ వైమో యూనిట్స్, డెల్ టెక్నాలజీస్, ట్విటర్‌తో పాటు మరికొన్ని ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది.

మే 8న అమెరికాకు చెందిన మరో ప్రైవేట్ ఈక్విటీ సంస్థ విస్టా ఈక్విటీ పార్ట్నర్స్, జియో మధ్య డీల్ కుదిరింది. విస్టా ఈక్విటీ పార్ట్నర్స్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో రూ.11,367 కోట్లు ఇన్వెస్ట్ చేస్తోంది. ఈ డీల్ ద్వారా జియో ప్లాట్‌ఫామ్స్‌లో 2.32 శాతం వాటాలు పొందింది.
జియో ప్లాట్‌ఫాంల్లో మొదట ఫేస్ బుక్ పెట్టుబడి పెట్టింది. రూ.43,573 కోట్లు పెట్టుబడి పెట్టి జియోలో 9.99 శాతం వాటాను ఫేస్ బుక్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత వెంటనే అమెరికాకు చెందిన సిల్వర్ లేక్ సంస్థ జియోలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. రెండు విడుతల్లో 2.08 శాతం వాటాను కొనుగోలు చేసింది. అందుకోసం రూ.10,202.55 కోట్లను రిలయన్స్‌కు చెల్లించింది సిల్వర్ లేక్. జియోలో సిల్వర్ లేక్ పెట్టుబడులు పెట్టిన తర్వాత దానికి పోటీగా ఉండే ఈక్విటీ సంస్థలు కేకేఆర్, విస్టా, జనరల్ అట్లాంటిక్ లాంటి కంపెనీలు కూడా జియోలో ఇన్వెస్ట్మెంట్ చేశాయి. ఆయా సంస్థలతో పాటు ప్రముఖ టెక్ దిగ్గజాలైన గూగుల్ కూడా జియోలో వాటాలను కొనుగోలు చేసింది. అలాగే, అబుదాబికి చెందిన ముబదాలా కూడా జియోలో ఇన్వెస్ట్ చేసిది.
గడిచిన 9 నెలల్లో రిలయన్స్ సంస్థ రిటైల్, లాజిస్టిక్స్ రంగంలో భారీ డీల్ చేసింది. ఫ్యూచర్ గ్రూప్‌లో ఆయా విభాగాలను రూ.24,713 కోట్లకు కొనుగోలు చేసింది. రిటైల్ రంగంలో ఇదో పెద్ద వ్యాపార ఒప్పందం.