మనీ ట్రాన్స్ఫర్ చేసేవారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI శుభవార్త చెబ్బింది. సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్ నుంచి నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్-NEFT ఛార్జీలు వసూలు చేయొద్దని బ్యాంకుల్ని ఆర్బీఐ ఆదేశించింది. 2020 జనవరి నుంచే ఈ నిబంధనలు అమలులోకి రావాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం రూ.10,000 వరకు నెఫ్ట్ ట్రాన్స్‌ఫర్‌పై రూ.2+జీఎస్టీ, రూ.2 లక్షల కన్నా ఎక్కువ నెఫ్ట్ ట్రాన్సాక్షన్‌పై రూ.20+జీఎస్టీ వసూలు చేస్తున్నాయి బ్యాంకులు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఆర్టీజీఎస్, నెఫ్ట్ పద్ధతుల ద్వారా జరిపే లావాదేవీలపై ఛార్జీలు ఎత్తేయాలని ఆర్బీఐ చాలాకాలంగా చెబుతోంది. ఛార్జీలను ఎత్తేసి కస్టమర్లకు లాభం చేకూర్చాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన సూచనలు మరో వారంలో జారీ చేయనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఆర్బీఐ అనేక చర్యలను తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే నెఫ్ట్ పేమెంట్ సిస్టమ్ 24 గంటలు పనిచేసేలా ఆదేశించింది ఆర్బీఐ. డిసెంబర్ నుంచి ఈ కొత్త విధానం అమలులోకి రానుంది. ఇది అమలులోకి వస్తే కస్టమర్లు 24 గంటల్లో ఎప్పుడైనా నెఫ్ట్ ద్వారా డబ్బులు పంపొచ్చు.
భారతదేశంలో ఆన్లైన్ ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేందుకు మూడు పద్ధతులన్నాయి. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్-NEFT సిస్టమ్‌ను ఆర్బీఐ నిర్వహిస్తోంది. నెఫ్ట్ ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే సెటిల్మెంట్ పద్ధతిలో డబ్బులు బదిలీ అవుతాయి. నెఫ్ట్‌తో పాటు రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్-RTGS సిస్టమ్‌ను కూడా ఆర్బీఐ మెయింటైన్ చేస్తుంది. రూ.2 లక్షల కన్నా ఎక్కువ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేందుకు ఆర్టీజీఎస్ ఉపయోగపడుతుంది. నెఫ్ట్, ఆర్టీజీఎస్ కాకుండా ఐఎంపీఎస్ కూడా ఉంది. దీన్నే ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్-IMPS అంటారు. కొంత ఛార్జీలు చెల్లించి ఏ సమయంలోనైనా వెంటనే డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేందుకు ఐఎంపీఎస్ ఉపయోగపడుతుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-NPCI ఐఎంపీఎస్‌ను మెయింటైన్ చేస్తుంది.
2018 అక్టోబర్ నుంచి 2019 సెప్టెంబర్ వరకు నాన్-క్యాష్ రీటైల్ పేమెంట్స్‌లో డిజిటల్ పేమెంట్స్ 96% ఉండటం విశేషం. అదే కాలంలో నెఫ్ట్ పేమెంట్స్ రూ.252 కోట్లు, యూపీఐ ట్రాన్స్ఫర్ రూ.874 కోట్లు జరిగాయి. ఒక్క ఏడాదిలో నెఫ్ట్ 20% పెరిగితే, యూపీఐ ట్రాన్స్ఫర్స్ 263% పెరిగాయి.
Gold Toilet: బంగారంతో టాయిలెట్... ధర రూ.9 కోట్లు... చూస్తే షాకే
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.