భారత మార్కెట్లో లభిస్తున్న ఉత్తమమైన ఎస్‌యూవీల్లో ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనాల్డ్ డస్టర్ కూడా ఒకటి. ఈ కారు విడుదలైన కొద్ది రోజుల్లోనే ఎస్యూవీ విభాగంలో ట్రెండ్ సెట్ చేసింది. అలాంటి కారు ఇప్పుడు భారత మార్కెట్లో కనుమరుగవ్వనున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, రెనో ఇండియా తమ డస్టర్ కార్లను నిలిపివేయనుంది. ఖర్చులను తగ్గించుకొని, లాభాలను పెంచుకునే లక్ష్యంతో రెనాల్ట్ ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు ఎకనామిక్ టైమ్స్ నివేదిక పేర్కొంది. అయితే, కంపెనీ ఈ ఎస్‌యూవీని పూర్తిగా మార్కెట్ నుంచి తొలగిస్తుందా? లేక దాని స్థానంలో కొత్త తరం మోడల్‌ను ప్రవేశపెడుతుందా? అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.
కాగా, గతేడాది అక్టోబర్ నెలలో రెనో ఇండియా తన డస్టర్ చివరి వేరియంట్‌ను లాంచ్ చేసింది. దీనిలో 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను చేర్చింది. ఈ టర్బో పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 156 బిహెచ్పి పవర్, 254 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక, దీనితో పాటు 1.5 లీటర్ న్యాచురల్ పెట్రోల్ ఇంజిన్ వేరియంట్‌ను కూడా లాంచ్ చేసింది. ఈ ఇంజిన్ గరిష్టంగా 106 బిహెచ్పి పవర్, 142 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మార్కెట్లో రెనో డస్టర్ ఎస్యూవీ రూ.9.86 లక్షల నుంచి రూ. 14.25 లక్షల మధ్య లభిస్తుంది. ఈ వేరియంట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
లాభాలు పెంచుకునే లక్ష్యంతో..
కాగా, భారత మార్కెట్లో రెనో ఇండియా తన మొదటి తరం డస్టర్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ మోడల్లో కొత్త అప్‌గ్రేడ్స్ ఏవీ తీసుకురాలేదు. చిన్నపాటి మార్పులు మినహా కొత్త తరం మోడల్లో పెద్దగా మార్పులు చేయలేదు. ప్రస్తుతం, భారత ఎస్యూవీ మార్కెట్లో పోటీ ఎక్కువగా ఉంది. దీంతో మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా లేటెస్ట్ టెక్నాలజీ, డిజైన్ ఫీచర్లతో కంపెనీ తన కొత్త తరం డస్టర్‌ను భారత్‌లోకి విడుదల చేయవచ్చని భావిస్తున్నారు.
అయితే, దీనికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. రెనో ఇటీవలే గ్లోబల్ మార్కెట్లో 2022 మోడల్ డస్టర్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ఈ కొత్త మోడల్‌నే వచ్చే ఏడాది భారత మార్కెట్లోకి తీసుకురావచ్చని భావిస్తున్నారు. కొత్త డస్టర్ ఎస్‌యూవీలో వై ఆకారపు హెడ్‌లైట్స్, సరికొత్త క్రోమ్ గ్రిల్, ఎల్ఈడీ ఫ్రంట్ ఇండికేటర్స్, ఏరో ఆప్టిమైజ్ 15 ఇంచ్, 16 ఇంచ్ అలాయ్ వీల్స్ వంటి ఫీచర్లను చేర్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.