RELIEF FOR MASTERCARD AS RBI LIFTS RESTRICTIONS AND AT THE SAME TIME NO CHANGE FOR AMERICAN EXPRESS AND DINERS CLUB UMG GH
Mastercard: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మాస్టర్ కార్డ్‌పై ఆంక్షల ఎత్తివేత.. త్వరలోనే కొత్త క్రెడిట్ కార్డులు
కొత్త క్రెడిట్, డెబిట్ కార్డులకు ఆర్బీఐ అనుమతి. (Shutterstock)
మాస్టర్ కార్డ్ (Master Card)పై విధించిన ఆంక్షలను రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) ఎత్తేసింది. ఇకపై డెబిట్ (Debit), క్రెడిట్ (Credit) లేదా ప్రీపెయిడ్ నెట్‌వర్క్‌లోకి కొత్త వినియోగదారులను చేర్చుకోవడానికి అనుమతి ఇచ్చింది.
మాస్టర్ కార్డ్‌పై విధించిన ఆంక్షలను రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఎత్తేసింది. ఇకపై డెబిట్, క్రెడిట్ లేదా ప్రీపెయిడ్ నెట్‌వర్క్‌లోకి కొత్త వినియోగదారులను చేర్చుకోవడానికి అనుమతి ఇచ్చింది. డేటా స్టోరేజ్ నిబంధనలను పాటించకపోవడంతో గతేడాది మాస్టర్ కార్డ్‌పై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తున్నామని, ఈ అంశంపై మాస్టర్ కార్డ్ ఇచ్చిన వివరణ ఆమోదయోగ్యంగా ఉందని, కొత్తగా కార్డులను జారీ చేయడానికి అనుమతి ఇచ్చామని ఆర్బీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది.
విదేశీ పేమెంట్ కంపెనీలు తమ కస్టమర్లకు చెందిన పేమెంట్ డేటాను తప్పనిసరిగా భారత్‌లోనే స్టోర్ చేయాలంటూ 2018 ఏప్రిల్‌లో కొత్త నిబంధనను తీసుకొస్తూ ఆర్బీఐ ఓ సర్క్యులర్ జారీ చేసింది. ఈ నిబంధనల ప్రకారం.. ఆరు నెలల లోపల పేమెంట్స్ సిస్టమ్స్ మొత్తం డేటాను కేవలం భారత్‌లోనే స్టోర్ చేయాలని ఆదేశించింది. అయితే ఈ నిబంధనలను పాటించకపోవడంతో గత సంవత్సరం నిరవధికంగా క్లయింట్లకు కొత్త డెబిట్, క్రెడిట్ లేదా ప్రీపెయిడ్ కార్డ్‌లను జారీ చేయకుండా మాస్టర్‌కార్డ్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, డైనర్స్ క్లబ్‌లపై ఆర్బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతానికి మాస్టర్ కార్డుపై ఆంక్షలు ఎత్తేసినా.. అమెరికన్ ఎక్స్‌ప్రెస్, డైనర్స్ క్లబ్‌పై ఇప్పటికీ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. అయితే ఈ కంపెనీలకు ఇప్పటికే ఉన్న కస్టమర్లకు సేవలు అందించడానికి ఆర్బీఐ అనుమతి ఇచ్చింది.
అతిపెద్ద మార్కెట్‌గా ఎదిగేందుకు ఇండియాపై దృష్టి
నిషేధానికి ముందు భారతదేశంలో దాదాపు 33% మార్కెట్ వాటా ఉన్న మాస్టర్‌కార్డ్, గత దశాబ్దంలో దేశంలో 2 బిలియన్ల డాలర్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టింది. దీంతో ప్రపంచంలో రెండవ అతిపెద్ద మార్కెట్‌గా వృద్ధి చెందాలని భారత్‌ను ఎంపిక చేసుకుంది.
ఆర్బీఐ నిర్ణయంపై మాస్టర్ కార్డ్ స్పందించింది. ‘RBI తీసుకున్న తాజా నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం. భారత్‌లో మా కార్డ్ నెట్వర్క్(డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్)లోకి కొత్త దేశీయ కస్టమర్లను చేర్చుకోవడానికి ఈ నిర్ణయం మాకు వీలు కల్పిస్తుంది. ఇండియన్ సిటిజన్స్ డిజిటల్ వ్యాపారాల అవసరాలకు మద్దతు ఇవ్వడానికి తాము నిబద్ధతతో ఉన్నాం.’ అని మాస్టర్‌కార్డ్ తెలిపింది.
కస్టమర్లు, భాగస్వాముల పరంగా భారతదేశం తమకు కీలకమైన మార్కెట్ అని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డిజిటల్ ఇండియాకు తమ వంతు తోడ్పాటు అందించడం పట్ల గర్వంగా ఉందని పేర్కొంది. తాము ఎప్పటిలాగే అదే తరహా అంకితభావంతో దేశ భవిష్యత్తుపై పెట్టుబడిని కొనసాగిస్తామని మాస్టర్‌కార్డ్ ప్రకటించింది.
మాస్టర్‌కార్డ్‌కు తొలగిన అడ్డంకులు
ఆర్బీఐ తాజా నిర్ణయంతో దేశంలో మాస్టర్‌కార్డ్ వ్యాపార పునరుద్ధరణ ఇక లాంచనమే. దీంతో స్థానిక బ్యాంకులు, ఫిన్-టెక్‌లకు ప్రయోజనం చేకూరనుంది. గడిచిన సంవత్సర కాలంలో ఇవి వీసా, రూపే ఆధారితమైన డెబిట్, క్రెడిట్ కార్డ్‌లను మాత్రమే కస్టమర్లకు అందించాయి. రూపే అనేది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా రూపొందించిన స్వదేశీ కార్డ్ నెట్వర్క్.
కాగా, గత సంవత్సరం, గ్లోబల్ కార్డ్ దిగ్గజాలపై విధించిన వ్యాపార పరిమితుల కారణంగా అనేక బ్యాంకులు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఆయా బ్యాంకులు జారీ చేసిన వాటిలో ఎక్కువ భాగం మాస్టర్ కార్డ్ నెట్‌వర్క్‌కు సంబంధించినవే. దీంతో యెస్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లపై నిషేధ ప్రభావం అధికంగా చూపింది. మాస్టర్ కార్డ్-జారీ చేసిన బ్యాంకులు ప్రత్యామ్నాయ నెట్‌వర్క్‌లకు మారవలసి వచ్చింది. అయితే ఇందుకు ఎక్కువ కాలం వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.