Andhra Pradesh Reliance Retail Agreement | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రముఖ దిగ్గజ సంస్థ రిలయన్స్ రిటైల్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఈ ఒప్పందం కుదిరింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు చేయూత అందించేందుకు ఈ పథకాన్ని ఇటీవల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించింది. ఈ అవగాహన ఒప్పందం ద్వారా ఏపీలోని చిన్న చిన్న దుకాణాలు నిర్వహించే మహిళలు, మహిళా రైతులకు జియో మార్ట్ కిరాణా ప్రోగ్రామ్, రిలయన్స్ ఫ్రెష్ ఫ్రూట్స్, కూరగాయల దుకాణాల సహకారం అందుతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి, సిదిరి అప్పలరాజు, పలువురు అధికారులు పాల్గొనగా, రిలయన్స్ రిటైల్ ప్రతినిధులు ముంబై నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వి.సుబ్రమణియం మాట్లాడుతూ.. ‘చిన్న వ్యాపారుల ప్రయోజనాలను కాంక్షిస్తూ మేం సమగ్రాభివృద్ది దిశగా అడుగులు వేస్తున్నాం. స్థానికంగా ఉన్న చిన్న వ్యాపారులు కూడా లబ్ధి పొందాలన్నది మా విధానం. ఏపీలో అరటి లాంటి ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా మార్కెట్ చేస్తున్నాం. దీని వల్ల మహిళలకు, మాకు పరస్పర ప్రయోజనం కలుగుతుంది. గోడౌన్లు, కోల్డు స్టోరేజీల వల్ల రైతులకు మంచి ధరలు లభిస్తాయి. దీనిపై ప్రభుత్వ అధికారులతో కూర్చుని ప్రణాళికలు వేసుకుంటాం.’ అని అన్నారు.
సుబ్రమణియంతో పాటు రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ సీఈవో దామోదర్ మాల్ కూడా ముంబై నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దామోదర్ లాల్ మాట్లాడుతూ ‘చేయూత ద్వారా మహిళలకు జీవనోపాధి మార్గాలను చూపెట్టే పద్ధతి బాగుంది. ఇది లబ్ధిదారుల కుటుంబాల్లో జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది. పంట చేతికి వచ్చిన తర్వాత సంరక్షించుకునే విధానాలపై దృష్టి మరింత మేలు చేస్తుంది. ఉత్పత్తులకు విలువను జోడిస్తుంది. వ్యవసాయం, ఉద్యానవన, ఆక్వా రంగాల్లో ఏపీకి అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తోంది.’ అని ఆకాంక్షించారు.
అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోమన్ రెడ్డి మాట్లాడుతూ ఏపీలో రైతు భరోసా కేంద్రాలను కూడా ప్రారంభించినట్టు చెప్పారు. గ్రామ సచివాలయాల పక్కనే వాటిని ఏర్పాటు చేశామన్నారు. అక్కడే కియోస్క్‌లు కూడా పెడుతున్నట్టు తెలిపారు. రైతులు ఆర్డర్ చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను క్వాలిటీ టెస్ట్ చేసి 48 గంటల్లో వారికి అందజేస్తున్నామని వివరించారు. అలాగే ఇ క్రాపింగ్ కూడా చేస్తున్నామని చెప్పారు. కనీస గిట్టుబాటు ధరలను కూడా ఆర్బీకేల ద్వారా కల్పించే ప్రక్రియ ప్రారంభిస్తున్నాని జగన్ వివరించారు. ‘ప్రతి గ్రామంలో గోడౌన్, మండలాల వారీగా కోల్డు స్టోరేజీలు ప్రారంభిస్తున్నాం. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పార్కులను నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తున్నాం. అంతిమంగా ఇవన్నీ జనతా బజార్ వంటి వ్యవస్థలకు దారి తీస్తాయి.’ అని జగన్ అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Reliance, Reliance JioMart