రిలయన్స్ జియో మరో సంచలనం సృష్టించింది. ప్రభుత్వానికి చెల్లించిన డబ్బుల్ని గడువు కన్నా ముందే చెల్లించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్‌కు చెల్లించాల్సిన రూ.30,791 కోట్లను ముందుగానే చెల్లించినట్టు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ (RJIL) ప్రకటించింది. 2014, 2015, 2016 వేలం ద్వారా 2021 లో ట్రేడింగ్ ద్వారా చేజిక్కించుకున్న స్పెక్ట్రమ్‌కు సంబంధించిన మొత్తం ఇది. ఎయిర్‌టెల్‌తో (Airtel) కలిసి ఈ స్పెక్ట్రమ్‌ను వాడుకునే హక్కు పొందింది. వాయిదా వేసిన ఈ చెల్లింపుల్ని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్‌కు ప్రీపేమెంట్ చేసినట్టు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ తెలిపింది. వేలం ద్వారా, ట్రేడింగ్ ద్వారా రిలయన్స్ జియో మొత్తం 585.3 MHz స్పెక్ట్రమ్‌ను దక్కించుకున్నట్టు కంపెనీ తెలిపింది.
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ 2016 సంవత్సరంలో వేలం ద్వారా పొందిన స్పెక్ట్రమ్‌కు సంబంధించిన మొదటి విడత చెల్లింపును 2021 అక్టోబర్‌లో వార్షికోత్సవం రోజున జరపడం విశేషం. ఆ తర్వాత టెలికామ్ కంపెనీలు బకాయిపడ్డ స్పెక్ట్రమ్ చెల్లింపుల్ని ముందస్తుగా చెల్లించే సౌలభ్యాన్ని కల్పిస్తున్నట్టు 2021 డిసెంబర్లో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2014, 2015 సంవత్సరాల్లో పొందిన స్పెక్ట్రమ్‌కు సంబంధించిన బకాయిల్ని 2022 జనవరిలో RJIL చెల్లించేసింది.
రిలయన్స్ జియో చెల్లించిన బకాయిలు 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి 2034-2035 ఆర్థిక సంవత్సవరం వరకు చెల్లించాల్సినవి. దీనిపై 9.30% నుంచి 10% శాతం వార్షిక వడ్డీ చెల్లించాలని ముందుగానే నిర్ణయించారు. అయితే RJIL అంతకన్నా ముందుగానే ఈ బకాయిల్ని చెల్లించేసింది. బకాయిల్ని ముందే చెల్లించడం కారణంగా ప్రస్తుత వడ్డీ రేట్ల ప్రకారం లెక్కిస్తే వార్షికంగా రూ.1,200 కోట్లు ఆదా అయినట్టు కంపెనీ ప్రకటించింది.
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ సబ్సిడరీ ప్లాట్‌ఫామ్. తాజా 4G LTE టెక్నాలజీతో ప్రపంచ స్థాయి ఆల్ ఐపీ డేటాతో ఫ్యూచర్ ప్రూఫ్ నెట్‌వర్క్‌ను నిర్మించింది. మొబైల్ వీడియో నెట్‌వర్క్‌గా ప్రారంభమై వాయిస్ ఓవర్ ఎల్టీఈ టెక్నాలజీని సపోర్ట్ చేస్తోంది. మరింత ఎక్కువ డేటా, టెక్నాలజీతో 5జీ, 6జీ సేవల కోసం కూడా సిద్ధంగా ఉంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.