భారత దేశంలోనే అతిపెద్ద సంస్థ అయిన రిలయన్స్ మరోసారి మంచి మనసును చాటుకుంది. రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించేందుకు ముందుకొచ్చింది. రిలయన్స్ ఫౌండేషన్, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సంయుక్తంగా ముంబైలోని 50 మురికివాడల్లో నివసిస్తున్న ప్రజలకు ఉచితంగా దాదాపు 3లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులను అందించనున్నాయి. ఈ విషయాన్ని రిలయన్స్ ఫౌండేషన్ సోమవారం ప్రకటించింది. సర్ హెచ్.ఎన్.రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రి (హెచ్ఎన్ఆర్ఎఫ్హెచ్) ద్వారా మూడు నెలల పాటు ప్రత్యేకమైన వ్యాక్సిన్ డ్రైవ్‌ను నిర్వహించనుంది. నగరంలోని ధారావి, వోర్లీ, కొలాబా, వాడాలా, ప్రతీక్షానగర్, కమాటిపురా, మన్ఖుర్డ్, చెంబూర్, గొవాండీ, బండప్ లాంటి మురికి వాడలకు చెందిన వారి కోసం ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం జరగనుంది. ఇందుకోసం హెచ్ఎన్ఆర్ఎఫ్హెచ్… స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ వాహనాలను వినియోగించుకోనుంది. బీఎంసీ, బెస్ట్.. వ్యాక్సినేషన్ కోసం మౌళిక సదుపాయాలు, రవాణాలో సాయం చేయనున్నాయి.
e-RUPIని విడుదల చేసిన ప్రధాని మోదీ.. డిజిటల్ పేమెంట్స్ లో మరో కొత్త శకం
సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం హెచ్ఎన్ఆర్ఎఫ్హెచ్ ఇప్పటికే మొబైల్ వ్యాన్లు, స్టాటిక్ మెడికల్ యూనిట్లను ఏర్పాటు చేసి, వైద్యసాయం చేస్తోంది. ఇందులో భాగంగానే కరోనాను అంతం చేసే దిశగా పేదలకు వేగంగా కరోనా వ్యాక్సిన్లను అందించే కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్ధమైంది. తాజా డ్రైవ్‌ను ఆర్ఎఫ్ మిషన్ వ్యాక్సిన్ సురక్ష (ఎంవీఎస్) కింద రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. అలాగే పేద కుటుంబాలకు చెందిన వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు కూడా రిలయన్స్ ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టనుంది.
“వీలైనంత త్వరగా భారతీయులందరికీ వ్యాక్సిన్ అందాలన్నదే మా ఆకాంక్ష. అందుకోసం ఏ సాయం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నాం. అందరం ఐక్యంగా ఈ క్లిష్ట సమయాన్ని ఎదుర్కొని ఎదుగుదాం. మళ్లీ మంచి రోజులు త్వరలోనే వస్తాయి” అని రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, చైర్ పర్సన్ నీతా ఎం.అంబానీ అన్నారు.
గత 16 నెలలుగా కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రిలయన్స్ ఫౌండేషన్ అనేక కార్యక్రమాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా టెస్టింగ్, లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ సరఫరాను ఉచితంగా చేసింది. అలాగే దాదాపు కోటి మాస్కులు, ఏడున్నర కోట్ల భోజనాలు, కొవిడ్ రోగుల చికిత్స కోసం 2వేలకు పైగా బెడ్స్ పంపిణీ చేసింది. కరోనా నియంత్రణ కోసం ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దేశమంతా అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది.
మిషన్ వ్యాక్సిన్ సురక్ష (ఎంవీఎస్) కార్యక్రమం కింద రిలయన్స్ గ్రూప్స్‌లో పని చేస్తున్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, డిపెండెంట్స్ కోసం సంస్థ ఇప్పటికే దాదాపు 10లక్షల వ్యాక్సిన్ డోసులను కేటాయించింది. దాదాపు రిలయన్స్ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులు, వారి కుటుంబాలకు ఇప్పటికే 98 శాతం వ్యాక్సినేషన్ పూర్తయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.