ఇటీవలి కాలంలో లోన్ యాప్స్(Loan Apps) వేధింపులు పెరిగాయి. కస్లమర్ల(Customers)కు సులభంగా లోన్లు ఇచ్చి రికవరీ కోసం వేధింపులకు పాల్పడటంతో వీటిపై అధికారులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో డిజిటల్ లెండింగ్ విధానాల్లో మార్పులు తీసుకురానున్నట్లు ఆర్‌బీఐ (RBI) పేర్కొంది. ఆన్‌లైన్‌లో లోన్లు ఇచ్చే లోన్ యాప్స్‌ను ఆర్బీఐ మూడు కేటగిరీలుగా విభజించింది. ఆర్‌బీఐ లేదా ఇతర ప్రభుత్వ సంస్థ అనుమతి లేకుండా లోన్ యాప్‌లు నిర్వహించడం కుదరదని పేర్కొంది. రెగ్యులేటరీ ఆందోళనలను తగ్గించేందుకు మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు తెలిపింది.
డిజిటల్ లెండింగ్ పద్ధతుల ద్వారా క్రెడిట్ డెలివరీ క్రమమైన వృద్ధికి సపోర్ట్ చేసే రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ను బలోపేతం చేసినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ బుధవారం తెలిపింది. ఈ మేరకు ఆర్‌బీఐ విడుదల చేసిన ఓ నోటిఫికేషన్(Notification)లో..‘రిజర్వ్ బ్యాంక్ నియంత్రణలో ఉన్న సంస్థలు లేదా మరేదైనా ఇతర చట్టం ప్రకారం అనుమతి పొందిన సంస్థలు మాత్రమే రుణ వ్యాపారాన్ని నిర్వహించగలవు అనే సూత్రంపై ఈ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ ఆధారపడింది.’ అని పేర్కొంది.
డిజిటల్ రుణదాతలను ఆర్‌బీఐ మూడు గ్రూపులుగా విభజించింది. అవేంటంటే..
i) ఆర్‌బీఐ నియంత్రణలోని సంస్థలు, రుణ వ్యాపారాన్ని నిర్వహించడానికి అనుమతి పొందినవి.
ii) ఇతర చట్టబద్ధమైన/నియంత్రణ నిబంధనల ప్రకారం రుణాలు ఇవ్వడానికి అధికారం పొందిన సంస్థలు, కానీ ఆర్‌డీఐ పరిధిలోకి రావు.
iii) చట్టబద్ధమైన/నియంత్రణ నిబంధనల పరిధిలోకి రాకుండా రుణాలు ఇచ్చే సంస్థలు.
ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు, మొబైల్ యాప్‌ల ద్వారా రుణాలు ఇవ్వడం సహా డిజిటల్ రుణాలు(WGDL)పై RBI-ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్ నుంచి అందుకున్న ఇన్‌పుట్‌లపై ఫ్రేమ్‌వర్క్ ఆధారపడి ఉంటుంది.
కొత్త నిబంధనల ప్రకారం.. ఎల్‌ఎస్‌పీ(లెండింగ్ సర్వీస్ ప్రొవైజర్) లేదా ఏదైనా థర్డ్ పార్టీ పాస్-త్రూ లేకుండా రుణగ్రహీత, నియంత్రిత సంస్థ(RE) బ్యాంక్ ఖాతాల మధ్య మాత్రమే అన్ని రుణ పంపిణీలు, తిరిగి చెల్లింపులు జరగాలి. క్రెడిట్ ఇంటర్మీడియటరీ ప్రక్రియలో రుణ సేవలు అందిస్తున్న వారికి చెల్లించాల్సిన ఏవైనా రుసుములు, ఛార్జీలు నేరుగా RE చెల్లిస్తుంది. వీటికి రుణ గ్రహీతకు సంబంధం లేదు.
ఆటోమేటిక్‌గా క్రెడిట్ లిమిట్ పెంచకూడదు
ఆర్‌బీఐ నోటిఫికేషన్ ప్రకారం.. రుణ గ్రహీతల స్పష్టమైన అనుమతి లేకుండా క్రెడిట్ పరిమితిని ఆటేమేటిక్‌గా పెంచడాన్ని కూడా ఆర్‌బీఐ నిషేధించింది. రుణ ఒప్పందాన్ని అమలు చేయడానికి ముందు రుణగ్రహీతకు కీ ఫ్యాక్ట్ స్టేట్‌మెంట్(KFS) అందించాలి. రుణగ్రహీతలకు డిజిటల్ లోన్ కాస్ట్‌ను యాన్యువల్ పర్సంటేజ్ రేట్(APR) కలుపుకొని తెలియజేయాలి. APR కూడా KFSలో భాగంగా ఉంటుంది. రుణగ్రహీతలు ఎలాంటి పెనాల్టీ లేకుండా ప్రిన్సిపల్, ప్రపోర్షనేట్ APR చెల్లించడం ద్వారా డిజిటల్ లోన్‌ల నుంచి బయటపడే అవకాశం కూడా రుణ ఒప్పందంలో భాగంగా అందుతుంది.
ఫిన్‌టెక్/డిజిటల్ లెండింగ్-సంబంధిత ఫిర్యాదులను పరిష్కరించడానికి, LSPలు తగిన నోడల్ ఫిర్యాదుల పరిష్కార అధికారిని కలిగి ఉండేలా REలు చర్యలు తీసుకుంటాయి. అటువంటి ఫిర్యాదుల పరిష్కార అధికారి వారి సంబంధిత DLAలపై (డిజిటల్ లెండింగ్ యాప్‌లు) ఫిర్యాదులను కూడా పరిష్కరిస్తారు. ఫిర్యాదుల పరిష్కార అధికారి వివరాలు ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం RE, దాని LSPలు, DLAల వెబ్‌సైట్‌లో ప్రముఖంగా పేర్కొంటాయి. ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాల ప్రకారం, రుణగ్రహీత దాఖలు చేసిన ఏదైనా ఫిర్యాదు నిర్ణీత వ్యవధిలో (ప్రస్తుతం 30 రోజులు) RE ద్వారా పరిష్కారమవ్వాలి. లేదా అతను/ఆమె రిజర్వ్ బ్యాంక్ - ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ (RB-IOS) కింద ఫిర్యాదు చేయవచ్చు.
డిజిటల్ లెండింగ్ యాప్‌ల ద్వారా సేకరించిన డేటా అవసరాలకు అనుగుణంగా ఉండాలి. స్పష్టమైన ఆడిట్ ట్రయల్స్ చేయాలి. రుణగ్రహీత ముందస్తు స్పష్టమైన అనుమతి లేకుండా సమాచారం తీసుకోకూడదని ఆర్‌బీఐ తెలిపింది. DLAలు/LSPలు రుణగ్రహీతల నుంచి సేకరించిన డేటాను తొలగించే ఆప్షన్‌తో పాటు.. గతంలో మంజూరు చేసిన అనుమతిని రద్దు చేసుకొనే అవకాశం కల్పించాలని ఆర్‌బీఐ తెలిపింది. అదే విధంగా నిర్దిష్ట డేటాను ఉపయోగించడం కోసం అనుమతి ఇవ్వడం లేదా తిరస్కరించే సదుపాయాన్ని రుణ గ్రహీతలకు కల్పించాలని పేర్కొంది.
ఆర్‌బీఐ మార్గదర్శకాలు స్వాగతిస్తున్నాం
ఈవీ ఫైనాన్సింగ్ కంపెనీ Revfin సీఈవో, వ్యవస్థాపకుడు సమీర్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘డిజిటల్ లెండింగ్‌పై ఆర్‌బీఐ వర్కింగ్ గ్రూప్ సిఫార్సులను మేము స్వాగతిస్తున్నాం. ఈ సిఫార్సులు వినియోగదారుల ప్రయోజనాలను కాపాడుతూ డిజిటల్ రుణాలకు పారదర్శకత, విశ్వసనీయతను తెస్తాయి. అన్ని సిఫార్సుల అమలుకు ఆర్‌బీఐ తగిన సమయాన్ని ఇస్తుందని, SROల (స్వీయ-నియంత్రణ సంస్థలు) సపోర్ట్‌తో డిజిటల్ లెండింగ్ ఎకో సిస్టమ్ పనితీరు కోసం ఒక మృదువైన ప్రక్రియను రూపొందిస్తుందని ఆశిస్తున్నాం.’ అని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.