ఇటీవల కాలంలో లోన్ రికవరీ ఏజెంట్ల (Loan Recovery Agents) ఆగడాలు పెరిగాయి. చాలా రాష్ట్రాల్లో రికవరీ ఏజెంట్ల ప్రవర్తనతో కలత చెందిన రుణ గ్రహీతలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ క్రమంలోనే రికవరీ ఏజెంట్లకు సంబంధించి ఆర్బీఐ (RBI) స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. అయినా కొన్ని ప్రాంతాల్లో వీరి తీరు మారలేదు. అందుకు ఉదాహరణకే హజారీబాగ్ (Hazaribagh) ఘటన. ఆ ఘటన ఏంటి. ఆర్బీఐ తీసుకున్న చర్యలు ఏంటో చూద్దాం.
జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీకి చెందిన రికవరీ ఏజెంట్ బలవంతంగా ట్రాక్టర్‌ను తీసుకెళ్తున్న సమయంలో.. ట్రాక్టర్ చక్రాల కింద పడి 27 ఏళ్ల గర్భిణి చనిపోయిందని సెప్టెంబర్ 16న వార్తా సంస్థ PTI పేర్కొంది. ఈ ఘటన సెప్టెంబర్ 15న జరిగినట్లు సమాచారం. తదనంతర మీడియా నివేదికలు, మహీంద్రా గ్రూప్ నిర్ధారణ తర్వాత ట్రాక్టర్ కొనుగోలుకు మహీంద్రా ఫైనాన్స్ సంస్థలో ఫైనాన్స్ తీసుకున్నట్లు తేలింది.
మీడియా కథనాల ప్రకారం బాధితురాలి వికలాంగ తండ్రి పేరుతో రుణం జారీ అయింది. లోన్ రికవరీ ఏజెంట్ల రిక్రూట్మెంట్పై నిబంధనలను ఉల్లంఘించినందుకు మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు సెంట్రల్ బ్యాంక్ శిక్షార్హమైన జరిమానాలు విధించే అవకాశం ఉందని సెప్టెంబర్ 19న మనీకంట్రోల్ నివేదించింది.
* ఆర్బీఐ చర్యలు
మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) చర్యలు తీసుకుంది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ ఔట్సోర్సింగ్ ఏర్పాట్ల ద్వారా లోన్ రికవరీ లేదా రీపొసెషన్ కార్యకలాపాలను నిర్వహించకూడదని గురువారం ఆర్బీఐ స్పష్టం చేసింది.
ఈ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(NBFC) తన సొంత ఉద్యోగుల ద్వారా రికవరీ లేదా రీపసెషన్ కార్యకలాపాలను కొనసాగించవచ్చని సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ అవుట్సోర్సింగ్ కార్యకలాపాల నిర్వహణకు సంబంధించి, గమనించిన కొన్ని మెటీరియల్ సూపర్వైజరీ అంశాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది.
* కఠినంగా రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలు
ఆస్తుల ప్రామాణీకరణపై నవంబర్ 12 ఆర్బీఐ విడుదల చేసిన సర్క్యులర్‌తో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు కఠిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఎన్‌బిఎఫ్‌సిలు ప్రతిరోజూ నిరర్థక ఆస్తులను(NPA) స్టాంప్ చేయాల్సిన అవసరం లేదని సర్క్యులర్ పేర్కొంది. రుణాలపై వడ్డీ రేటుతో సహా అన్ని బకాయిలు ముందుగా చెల్లించే వరకు ఎన్పీఏ ఖాతాను ప్రామాణిక ఆస్తి వర్గానికి అప్‌గ్రేడ్ చేయడం సాధ్యం కాదని సర్క్యులర్ స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి : టెలికామ్ లైసెన్స్ పరిధిలోకి వాట్సప్ , ఫేస్బుక్, ఇతర యాప్స్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1934లోని సెక్షన్ 45L(1)(b) కింద తన అధికారాలను అమలు చేస్తూ.. మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్(MMFSL), ముంబైని వెంటనే రికవరీ నిలిపివేయాలని ఆదేశించింది. రుణదాతలు మితిమీరిన వేధింపులకు పాల్పడకూడదని, రుణగ్రహీతలను నిరంతరం ఇబ్బంది పెట్టకూడదని లేదా రుణాల రికవరీ కోసం బల ప్రయోగం చేయకూడదని ఆర్బీఐ నిబంధనలు సూచిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నియమాలలో.. రుణ గ్రహీలతో ఎలా ప్రవర్తించాలో స్పష్టంగా పేర్కొంది. కస్టమర్లతో సక్రమంగా నడుచుకొనేలా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు రికవరీ సిబ్బందికి తగిన శిక్షణ కూడా ఇవ్వాలని సూచించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Loan lenders, Rbi