ఆదిల్ శెట్టి, CEO, BANKBAZAAR.com
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్య విధానంలో కీలకమైన రెపో రేటును(Repo Rate) ఆర్బీఐ పెంచింది. సాధారణంగా ద్రవ్యోల్బణం(Inflation) పెరుగుతూ పోతున్న తరుణంలో వడ్డీ రేట్లు(Interest Rates) పెరుగుతాయి. దేశంలో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేట్ల పెంపుపై దృష్టి సారించింది. అయితే బుధవారం RBI కీలక పాలసీ రేట్లను 40 బేసిస్ పాయింట్లు (bps) పెంచడం ఊహించని పరిణామం అని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. సెంట్రల్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (MPC) అత్యవసర సమావేశం తర్వాత కీలక రేట్ల పెంపునకు ఆర్బీఐ ఏకగ్రీవంగా ఓటు వేసింది. వ్యవస్థలో అధిక లిక్విడిటీ, ఇంధనం, ముడి పదార్థాల ధరలు పెరగడం, ప్రభుత్వ రుణాలు పెరగడం వంటి కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. భారతదేశంలో సెక్యూర్డ్, అన్ సెక్యూర్డ్ లోన్లు వంటి అన్ని రకాల లోన్లపై(Loans) తాజా రేట్ల పెంపు ప్రభావం పడనుంది.
హోమ్ లోన్ తీసుకున్న వారిపై పడే ప్రభావం..
చాలా బ్యాంకులు తమ రుణ రేట్లను RBI రెపో రేటుకు బెంచ్‌మార్క్ చేశాయి. నివేదికల ప్రకారం, దాదాపు 40% గృహ రుణాలు రెపో రేటు వంటి ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్‌లతో ముడిపడి ఉన్నాయి. అందువల్ల ఈ రెపో రేటు పెరుగుదల కారణంగా చాలా తక్కువ సమయంలోనే కొత్త, ఇప్పటికే ఉన్న రుణగ్రహీతల లోన్లపై వడ్డీ రేట్లు, ఈఎంఐ ఖర్చులు పెరగనున్నాయి. రెపో రేటులో వచ్చే మార్పు, రుణగ్రహీతల లోన్ రేట్లలో మార్పులకు కారణమవుతుంది. దీంతోపాటు లోన్ కాలవ్యవధిపై (లోన్ టెన్యూర్) కూడా ప్రభావం చూపుతుంది. ఫలితంగా మీ లోన్‌ను తిరిగి చెల్లించేందుకు ఎక్కువ కాలవ్యవధి మిగిలి ఉంటే, మీరు ఎక్కువ కాలం పాటు పెరిగిన రేట్లతో లోన్లు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
ఉదాహరణకు మీరు 7% వడ్డీతో 20 సంవత్సరాల కాలవ్యవధికి రూ. 50 లక్షల గృహ రుణం తీసుకున్నారని భావిద్దాం. మీ EMI రూ. 38,765, వడ్డీ చెల్లింపులు రూ. 43.03 లక్షలు అవుతుంది. ఇప్పుడు పెరిగిన రేట్లతో వడ్డీ 7.4%కి మారిందని అనుకుందాం. ఈ సందర్భంలో మీ సవరించిన EMI రూ. 39,974, వడ్డీ రూ. 45.93 లక్షలకు పెరుగుతుంది. ఈ ఉదాహరణ ప్రకారం.. మీ లోన్ టెన్యూర్ 18 నెలలు పెరగడం గమనించవచ్చు.
MCLR-లింక్డ్ లోన్‌లను రీపేమెంట్ చేస్తున్న రుణగ్రహీతలు కూడా రేట్ల పెంపు ఒత్తిడికి గురికావచ్చు. అనేక ప్రముఖ బ్యాంకులు ఇటీవల MCLR రేట్లు పెంచాయి. దీంతో రుణాలు మరింత ఖరీదైనవిగా మారాయి.
రుణగ్రహీత ఏం చేయగలరు?
ప్రస్తుత పరిస్థితుల్లో EMI భారాన్ని తగ్గించుకోవడానికి లోన్ల ముందస్తు చెల్లింపు (prepayments) ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ప్రతి సంవత్సరం మీ బకాయిలో 5% ప్రీపే చేయడంపై దృష్టి పెట్టాలి. ఈ మొత్తాన్ని మీరు భరించలేకపోతే.. కొద్ది మొత్తంలో ప్రీ-పేమెంట్ చేస్తూ సంవత్సరానికి ఒక EMIని ముందస్తుగా చెల్లించే ఏర్పాట్లు చేసుకోండి. మీ హోమ్ లోన్‌ను పూర్తిగా తిరిగి చెల్లించడానికి ఎక్కువ సమయం మిగిలి ఉంటే.. ఇప్పటికీ తక్కువ లోన్ రేట్లను అందిస్తున్న రుణదాతల కోసం అన్వేషించవచ్చు. తక్కువ వడ్డీతో లోన్లు ఇచ్చే సంస్థకు మారడం ద్వారా వడ్డీ భారాన్ని ఆదా చేయడంపై దృష్టిపెట్టాలి. ఇందుకు వడ్డీ లెక్కలు, ఈఎంఐ భారం, కొత్త రుణదాతకు మారడం వల్ల ఆదా అయ్యే మొత్తం.. వంటి గణాంకాలను విశ్లేషించి ఒక నిర్ణయానికి రావాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Monitory policy, Rbi, Repo rate