RBI Monetary Policy: వడ్డీ రేట్లను మార్చని రిజర్వ్ బ్యాంక్.. వరుసగా మూడోసారి సేమ్

RBI Monetary Policy: ఆర్బీఐ చివరసారిగా మే 22న వడ్డీ రేట్లలో మార్పులు చేసింది. కరోనా కారణంగా ఆర్థికరంగం కుదేలయిన కారణంగా.. రెపో రేటును అత్యంత కనిష్ఠంగా 4 శాతానికి పరిమితం చేసింది.

news18-telugu
Updated: December 4, 2020, 11:30 AM IST
RBI Monetary Policy: వడ్డీ రేట్లను మార్చని రిజర్వ్ బ్యాంక్.. వరుసగా మూడోసారి సేమ్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వడ్డీ రేట్లలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఎలాంటి మార్పులు చేయలేదు. రెపో రేట్ (Repo rate), రివర్స్ రెపో రేట్‌ (Reverse repo rate)ను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. ద్రవ్యోల్పణం పెరగడం, జీడీపీ ఇంకా అంతంత మాత్రంగానే ఉన్న నేపథ్యంలో వడ్డీ రేట్లను మార్చలేదు. ఈ నేపథ్యంలో రెపో రేటు 4 శాతం, రివర్స్‌ రెపో రేటు 3.35 శాతం, బ్యాంక్‌ రేటు 4.25 శాతంగా యథావిధిగా కొనసాగనున్నాయి. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భాగంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన ఎంపీసీ (Monetary Policy Committee) మూడు రోజులు పాటు సమావేశాలు నిర్వహించింది. ఈ సమావేశ నిర్ణయాలను ఆర్బీఐ శుక్రవారం వెల్లడించింది. యథాతథ పాలిసీ అమలుకే కట్టుబడి ఉంటున్నామని ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు.

'' ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధ భాగంలో భారత ఆర్థిక వ్యవస్థ కోలుకునేలా కన్పిస్తోంది. వ్యవస్థలో తగినంత ద్రవ్యత అందుబాటులో ఉంచేందుకు సరైన సమయంలో చర్యలు తీసుకుంటున్నాం. కోవిడ్ సంక్షోభం నుంచి అనేక రంగాలు కోలుకుంటున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటోంది. ఆర్థిక వృద్ధి బలోపేతం కోసం అకామడేటివ్‌ మోనిటరీ పాలసీ విధానాన్ని కొనసాగిస్తాం. వృద్ధిని పెంచేందుకు గాను ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఇదే విధానాన్ని కొనసాగించాలని భావిస్తున్నాం.'' అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అని పేర్కొన్నారు.

ఇక 2020-21 ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలను భారతీయ రిజర్వ్ బ్యాంక్ సవరించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో GDP (స్థూల జాతీయోత్పత్తి) వృద్ధిరేటు -7.5 శాతంగా ఉండొచ్చని RBI అంచనా వేసింది. అక్టోబరులో జరిగిన పరపతి విధాన ప్రకటనలో జీడీపీ వృద్ధిని -9.5 శాతంగా అంచనా వేసిన ఆర్బీఐ.. తాజాగా దానిని సవరించింది. మూడో త్రైమాసికంలో జీడీపీ పాజిటివ్‌లోకి వచ్చే అకాశముందని అభిప్రాయపడింది. నాలుగో త్రైమాసికంలో 0.7 శాతంగా నమోదు కావొచ్చని అంచనా వేసింది.

కాగా, ఆర్బీఐ చివరసారిగా మే 22న వడ్డీ రేట్లలో మార్పులు చేసింది. కరోనా మహమ్మారి ప్రభావంతో ఆర్థికరంగం కుదేలయిన కారణంగా.. రెపో రేటును అత్యంత కనిష్ఠంగా 4 శాతానికి పరిమితం చేసింది. అనంతరం ద్రవ్యోల్బణం నానాటికి పెరుగుతుండటంతో.. మే తర్వాత నుంచి ఆర్‌బీఐ వడ్డీరేట్లను యథావిధిగా కొనసాగిస్తూ వస్తోంది. జీడీపీ మెరుగయ్యే వరకు ఇదే పరిస్థితి ఉండవచ్చని ఆర్థికరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: December 4, 2020, 11:24 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading