దేశంలో వివిధ ఆర్థిక సంస్థలు కార్యకలాపాలను సక్రమంగా నిర్వహించేలా, ప్రజలకు ప్రయోజనాలు అందేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పర్యవేక్షిస్తుంది. ఆయా ఆర్థిక సంస్థలు సంబంధిత చట్టాల పరిధిలో పని చేసేలా చర్యలు తీసుకుంటుంది. నిబంధనలు అతిక్రమించిన సంస్థల లైసెన్స్‌లు రద్దు చేస్తుంది, లేదా జరిమానా విధిస్తుంది. ఇప్పటి వరకు చాలా సందర్బాల్లో వివిధ బ్యాంక్‌లు, ఇతర కంపెనీలపై ఆర్బీఐ కొరడా ఝళిపించింది. తాజాగా మార్చి 3వ తేదీన అమెజాన్ పే ఇండియా(Amazon Pay India Pvt Ltd)కి రూ.3.06 కోట్ల పెనాల్టీని విధించింది. ఈ జరిమానా విధించడానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా షోకాజ్ నోటీసు జారీ చేసిన ఆర్బీఐ
నో యువర్ కస్టమర్(KYC) నిబంధనలను పాటించని కారణంగా అమెజాన్ పే జరిమానా చెల్లించాల్సి వచ్చింది. అంతే కాకుండా నిబంధనల మేరకు ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్(PPI) వివరాలను కూడా అమెజాన్ పే అందజేయలేదని ఆర్బీఐ పేర్కొంది.
కేవైసీ నిబంధనలను పాటించడం లేదని తెలిసిన తర్వాత ముందుగా అమెజాన్ పే ఇండియాకి షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు ఆర్బీఐ చెప్పింది. ఆ నోటీసుకు అమెజాన్ పే ప్రతిస్పందనను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, RBI ఆదేశాలను పాటించని కారణంగా జరిమానా విధించినట్లు స్పష్టం చేసింది. మొత్తం మానిటరీ పెనాల్టీ రూ.3,06,66,000 విధించింది.
నియమాలు ఉల్లంఘించినందుకే చర్యలు
పేమెంట్, సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007లోని సెక్షన్ 30 ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఉన్న అధికారాలను ఉపయోగించి జరిమానా విధించింది. రెగ్యులేటరీ నియమాలను ఉల్లంఘించిన కారణంగానే చర్యలు తీసుకున్నామని, అమెజాన్ పే ఇండియా తన కస్టమర్లతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందాల ప్రభావం లేదని పేర్కొంది.
ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ అంటే ఏంటి?
ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ అనేవి పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్. వీటిల్లోని విలువ ఆధారంగా వస్తువులు, సేవలు కొనుగోలు చేయవచ్చు. ఈ ఇన్‌స్ట్రుమెంట్స్ చెల్లింపులను సులభతరం చేస్తాయి. అటువంటి ఇన్‌స్ట్రుమెంట్స్ హోల్డర్, నగదు, బ్యాంక్ అకౌంట్ డెబిట్ , క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించిన విలువను సూచిస్తుంది. స్మార్ట్ కార్డ్‌లు, మాగ్నెటిక్ స్ట్రిప్ కార్డ్‌లు, ఇంటర్నెట్ అకౌంట్స్, ఇంటర్నెట్ వాలెట్‌లు, మొబైల్ అకౌంట్‌లు, మొబైల్ వాలెట్‌లు, పేపర్ వోచర్‌లు, ప్రీపెయిడ్ అమౌంట్‌ను యాక్సెస్ చేయడానికి ఉపయోగించే ఏదైనా ఇన్‌స్ట్రుమెంట్‌లు ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ అవుతాయి.
KYC అంటే ఏంటి?
ఆర్థిక సంస్థలకు నమ్మకమైన వినియోగదారులన అందించడమే నో యువర్ కస్టమర్(కేవైసీ) లక్ష్యం. ఆర్థిక సంస్థలను వినియోగదారులు మోసం చేయకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేవైసీ ప్రమాణాలను తీసుకొచ్చింది. కేవైసీ ద్వారా కస్టమర్లను గుర్తించవచ్చు, అనుమానాస్పద ట్రాన్సాక్షన్‌లను తెలుసుకోవచ్చు. మోసం, అవినీతి, మనీలాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్ నుంచి ఆర్థిక సంస్థలను రక్షించడానికి ఈ ప్రమాణాలు ఉపయోగపడతాయి. ప్రస్తుతం అన్ని రకాల ఆర్థిక సేవలు పొందడానికి కేవైసీ ప్రాసెస్ తప్పనిసరి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amazon, AMAZON PAY, Amazon sale, Rbi