కేంద్ర ప్రభుత్వం రైల్వేలను మెరుగుపరిచేందుకు ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్టులను అమలు చేస్తోంది. అందులో భాగంగా సెమీ హై స్పీడ్ రైళ్లు అయిన వందే భారత్ రైళ్ల(Vande Bharat Trains)ను వచ్చే బడ్జెట్లో అధిక సంఖ్యలో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అత్యాధునిక సౌకర్యాలు, హై స్పీడ్‌తో తిరిగే ఈ రైళ్లు రానున్న సంవత్సరాలలో పెద్ద ఎత్తున పట్టాలపై పరుగులు తీయనున్నాయి. 2023-2024 బడ్జెట్లో 200 నుంచి 300 వరకు ఈ కొత్త రైళ్లను ప్రకటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న రాజధాని, శతాబ్ది, ఇతర సూపర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను దశలవారీగా తొలగించి వాటి స్థానంలో వందే భారత్ (VB) రైళ్లను తీసుకురావాలనే విజన్‌తో కేంద్రం పని చేస్తోంది. ఈ ప్లాన్‌ను ప్రణాళిక ప్రకారం అమలు చేయడానికి కేంద్ర రైల్వే శాఖ(Railway Ministry) పని చేస్తోంది. వీటి ఉత్పత్తిని భారీగా పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది.
ప్రస్తుత సేవలు ఇలా..
ప్రస్తుతం ఐదు వందే భారత్ రైళ్లు మాత్రమే మన దేశంలో సేవలు అందిస్తున్నాయి. ఢిల్లీ-వారణాసి, ఢిల్లీ-జమ్మూ, గాంధీనగర్-ముంబై, అంబ్-అందౌరా -ఢిల్లీ, బెంగళూరు -చెన్నై మార్గాలలో ఈ రైళ్లు తిరుగుతున్నాయి. ఇన్ని సౌకర్యాలతో ఉన్న ఈ రైలుకు సంబంధించి టికెట్ రేట్లు మాత్రం అధికంగా ఉన్నాయని ప్రయాణికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇండియన్ రైల్వేస్ 2023 ఆగస్టు నాటికి 75 వందే భారత్ రైళ్లు, 2023-24లో 100 వందే భారత్ రైళ్ల తయారీని లక్ష్యంగా పెట్టుకుంది. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ- చెన్నై; మోడ్రన్ కోచ్ ఫ్యాక్టరీ - రాయ్‌బరేలి; లాతూర్, సోన్పట్లలోని రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్లలో ఈ సెమీ హై స్పీడ్ రైళ్లను నిర్మిస్తారు. తొలుత వందే భారత్ రైళ్లను 500 కిలోమీటర్ల పరిధి ఉన్న విభాగాలలో నడపాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత మాత్రమే అంతకంటే ఎక్కువ దూరం ఉన్న రూట్లలో స్లీపర్ వెర్షన్ రైళ్లను తిప్పనున్నారు.
వందే భారత్ రైలు ప్రత్యేకతలివే..
వందే భారత్ రైళ్లు.. బుల్లెట్ ట్రైన్ లుక్‌తో కనిపిస్తాయి. ఈ సెమీ హై స్పీడ్ రైలులో అత్యాధునిక సదుపాయాలు ఉంటాయి. విమానం ప్రయాణం లాంటి ఫీలింగ్ కలుగుతుంది. ఇవి గంటకు 180 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించగలవు. అత్యాధునిక భద్రతా ప్రమాణాలు దీనిలో ఉన్నాయి. పొరపాటున సాంకేతిక కారణాల వల్ల ఒకే ట్రాక్‌పైకి రెండు ట్రైన్లు వస్తే రెండు ట్రైన్లలోనూ హెచ్చరికలు జారీ అవుతాయి. కిలో మీటరు దూరం ఉండగానే వేగం ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. పరస్పరం రెండు రైళ్లు ఢీకొట్టుకోకుండా దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన కవచ్ (Kavach)టెక్నాలజీ దీనిలో ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.