దేశవ్యాప్తంగా రైల్వే లైన్లు, నెట్వర్క్ ఉన్న ఇండియన్ రైల్వేస్ (Indian Railways), ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీ (New Technology) ని పరిచయం చేస్తోంది. కొత్త రైళ్లను ప్రవేశపెట్టడంతో పాటు ఇప్పటికే ఉన్న రైళ్ల వేగాన్ని పెంచుతోంది. అయితే ఇటీవల రైల్వే శాఖకు ఒక కొత్త తలనొప్పి ఎదురవుతోంది. ట్రాక్ దాటుతున్న పశువులను రైళ్లు ఢీకొడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. దీంతో ఇలాంటి పశువుల ప్రమాదాలకు చెక్ పెట్టడానికి పెద్ద ఎత్తున బౌండరీ వాల్స్ కట్టేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది. ఈ విషయంపై తాజాగా మాట్లాడారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్.
సరిహద్దు గోడలను నిర్మించడంపై దృష్టి పెట్టామని, ఇందుకోసం రెండు వేర్వేరు డిజైన్లను పరిశీలించినట్లు తెలిపారు. వీటిలో ఒక బలమైన గోడ డిజైన్ని అప్రూవ్ చేసినట్లు చెప్పారు. వచ్చే ఐదు, ఆరు నెలల్లో అవసరమైన చోట్ల వెయ్యి కిలోమీటర్ల పొడవునా ఈ గోడల్ని కట్టనున్నట్లు తెలిపారు.
రైల్వే ట్రాక్‌లపై రైళ్లకు పశువులు అడ్డంగా వస్తున్న ఘటనలు అంతకంతకూ పెరుగుతన్నాయి. ఇటీవల కొత్తగా ప్రారంభమైన ముంబై- అహ్మదాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు తొమ్మిది రోజులలోనే ట్రాక్‌పై పశువులను ఢీకొనడంతో దెబ్బతింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ ఏడాది ఇప్పటి ఇలాంటి కేసులు 4,000 వరకు నమోదయ్యాయి.
అక్టోబర్ మొదటి తొమ్మిది రోజుల్లో 200 రైళ్లు ఈ ఘటనల వల్ల ఎఫెక్ట్ అయ్యాయి. 2020-21లో 26,000 రైలు ప్రమాదాల కేసులు నమోదు కాగా, వాటిలో 6,500 కంటే ఎక్కువ ఈ కేటిల్ రన్‌ఓవర్ కేసులే ఉన్నాయి. 2022లో ఉత్తర రైల్వే జోన్ పరిధిలో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్, లక్నో; పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్, హర్యానాలోని అంబాలా, ఢిల్లీ డివిజన్లలో దాదాపు 6,800 కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం ఉన్న సరిహద్దు గోడలు ఈ సమస్యలను పరిష్కరించలేక పోతున్నాయి. ఈ ఘటనలు ట్రాక్‌ల చుట్టుపక్కల నివసించే గ్రామస్థులనూ ప్రభావితం చేస్తున్నాయని రైల్వే మంత్రి తెలిపారు. పట్టాలపై పశువులు పరుగులు తీయడం వల్ల ప్రమాదాలు జరగడంతో పాటు చాలా రైళ్లు పాడవుతున్నాయని, సమయానికి గమ్యానికి చేరుకోలేకపోతున్నాయని చెప్పారు. అయితే సరిహద్దు గోడల నిర్మాణానికి ఉపయోగించే మెటీరియల్‌పై మాత్రం మంత్రి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.
ఇది కూడా చదవండి : సికింద్రాబాద్, విజయవాడ , తిరుపతి నుంచి శబరిమలకు 40 పైగా ప్రత్యేక రైళ్లు ... టైమింగ్స్ ఇవే
* ఆ జోన్లో ఎక్కువ ప్రమాదాలు
ముఖ్యంగా నార్త్ సెంట్రల్ రైల్వే(North Central Railway) జోన్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. జోన్ పరిధిలో దాదాపు 3,000 కి.మీ ట్రాక్‌లు ఉన్నాయి. ఢిల్లీ-ముంబై , ఢిల్లీ-హౌరా కారిడార్లు, ఆగ్రా, ఝాన్సీ, ప్రయాగ్‌రాజ్ లాంటి డివిజన్లు ఈ జోన్లోనే ఉన్నాయి. తూర్పు నుంచి భారతదేశంలోని ఉత్తర ప్రాంతాలకు దీనిగుండానే రైళ్లు చేరుకుంటాయి.
* స్పాట్స్ గుర్తింపు
ఉత్తర మధ్య రైల్వే, ఉత్తర రైల్వేలలో సరిహద్దు గోడలను నిర్మించడానికి కొన్ని స్ట్రెచ్‌లను గుర్తించారు. ఝాన్సీ డివిజన్లో విరంగన లక్ష్మీబాయి-గ్వాలియర్ సెక్షన్ మధ్య, ప్రయాగ్‌రాజ్ డివిజన్ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్-ప్రయాగ్‌రాజ్ సెక్షన్ల మధ్య, మొరాదాబాద్ డివిజన్ ఆలం నగర్ - షాజెహాన్పూర్ మధ్య, లక్నో డివిజన్లోని ఆలం నగర్ - లక్నో మధ్య ముందుగా గోడల్ని నిర్మించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.