Yes Bank | సంక్షోభంలో ఉన్న ప్రైవేట్ రంగ బ్యాంక్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. యెస్ బ్యాంక్ బోర్డులోకి ఆర్. గాంధీని తీసుకుంది. బోర్డులోకి ఆర్.గాంధీ రావడం ఇది రెండోసారి. ఆర్.గాంధీని అడిషనల్ డైరెక్టర్‌గా యెస్ బ్యాంక్ బోర్డులో నియమిస్తున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఆర్. గాంధీతోపాటు అనంత్ నారాయణ గోపాలకృష్ణన్‌ను కూడా బోర్డులో నియిమించింది. వారు రెండు సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగుతారని ఆర్బీఐ తెలిపింది.
ఆర్. గాంధీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ డిప్యూటీ గవర్నర్. ఆయన కరెన్సీ మేనేజ్మెంట్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ అండ్ డెవలప్మెంట్, నాన్ బ్యాంకింగ్ సూపర్విజన్ రిస్క్ మానిటరింగ్ విధులు నిర్వర్తించేవారు. యెస్ బ్యాంక్ బోర్డులో ఆర్.గాంధీ చేరడం ఇది రెండోసారి. 2019లో తొలిసారి ఆయన్ను యెస్ బ్యాంక్ బోర్డులో సభ్యుడిగా నియమించింది. యెస్ బ్యాంక్ సహ వ్యవస్థాపకుడు మాజీ ఎండీ, మాజీ సీఈవో రానా కపూర్ హయాంలో తీసుకున్న రుణాలు అడ్డదారి పట్టినట్టు గుర్తించిన వెంటనే ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. యెస్ బ్యాంక్ కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించి, వ్యవస్థను గాడిన పెడతారని ఆర్బీఐ భావించింది.
1949 బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ సెక్షన్ 36 (బీ)లోని సబ్ సెక్షన్ 1 కింద ఆర్. గాంధీని నియమించింది. ఈ నిబంధన ప్రకారం ఏదైనా బ్యాంక్ బోర్డులో ఆర్బీఐ అడిషనల్ డైరెక్టర్లను నియమించడానికి అధికారం ఉంది. ఆయన్ను నియమించిన 10 నెలల తర్వాత యెస్ బ్యాంక్ పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. అయితే, యెస్ బ్యాంక్‌లో పెట్టుబడులు పెట్టేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు మరో ఏడు ఆర్థిక సంస్థలు ముందుకొచ్చాయి.
ఆర్.గాంధీని రెండోసారి యెస్ బ్యాంక్ బోర్డులో అడిషనల్ మెంబర్‌గా చేయడం ద్వారా ఆర్బీఐ ఏం చెప్పాలనుకుంటుందనే ప్రశ్న సహజంగా బ్యాంకర్స్‌లో వినిపిస్తోంది. ఏడాది క్రితం ఆయన్ను (ఆర్.గాంధీ) నియమించిన తర్వాత యెస్ బ్యాంక్ మరింత దిగజారిపోయిందని, ఇప్పుడు ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి వచ్చిందని ఓ బ్యాంకర్ మనీ కంట్రోల్ వెబ్‌సైట్‌తో అన్నారు. ‘గాంధీ అనే ఆయన సహజంగా ఆర్బీఐ మనిషే. అలాంటప్పుడు ఏడాది క్రితమే బ్యాంక్‌లో ఏం జరుగుతుందో తెలుసుకుని, ఆర్బీఐని అలర్ట్ చేయాలి కదా. ఆ పని చేయకపోతే ఇక బోర్డులో ఎందుకు?’ అని ఆ బ్యాంకర్ ప్రశ్నించినట్టు మనీ కంట్రోల్ తెలిపింది.
యెస్ బ్యాంక్ బోర్డులో గాంధీ ఉన్నప్పుడు సంక్షోభం రాకుండా నివారించలేకపోయారని పలువురు అభిప్రాయపడుతున్నారు. చివరకు బెయిల్ అవుట్ వరకు తీసుకొచ్చారని పెదవి విరుస్తున్నారు. మరోవైపు యెస్ బ్యాంక్‌ను నడపడంలో విఫలమయ్యారని తెలిసినప్పుడు రానా కపూర్‌ను ఆర్బీఐ ఎండీ & సీఈవోగా ఎందుకు కొనసాగించిందనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతోంది. రానా కపూర్ ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నారు.