ఇటీవల వరుస పెట్టుబడులతో దూసుకెళ్తున్న రిలయన్స్ జియో ప్లాట్ ఫాంలో ఇన్వెస్ట్ చేయడానికి మరో కంపెనీ ముందుకొచ్చింది. క్వాల్కమ్ సంస్థ జియో ప్లాట్ ఫాంలో రూ.730 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. జియోలో 0.15 శాతం వాటా కోసం క్వాల్కమ్ సంస్థ ఈ మొత్తం చెల్లించనుంది. ఏప్రిల్ 22వ తేదీ నుంచి ఇప్పటి వరకు జియోలో ఇది 13వ పెట్టుబడి. టెక్నాలజీ కొత్త ఆవిష్కరణలకు క్వాల్కమ్ సంస్థ పేరుగాంచింది. తాజా పెట్టుబడితో కలిపి రిలయన్స్ జియో ఇప్పటి వరకు రూ.1,18,318.45 పెట్టుబడి సాధించింది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ కంపెనీ కూడా ఇంత భారీ స్థాయి పెట్టుబడిని పొందలేదు. కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తూ, కంపెనీలు మూతపడుతున్న నేపథ్యంలో ఈ ఘనతను సాధించడం మరో విశేషం. భారతీయ డిజిటల్ సామర్థ్యానికి, జియో బిజినెస్ స్ట్రాటజీకి ఇదో నిదర్శనం అని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. జియో ప్లాట్ ఫాంల్లో ఫేస్ బుక్, సిల్వర్ లేక్ పార్టనర్స్ (రెండు పెట్టుబడులు), విస్టా ఈక్విటీ పార్టనర్స్, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్, ముబదాలా, ఏడీఐఏ, టీపీజీ. ఎల్ కాటర్టన్, పీఐఎఫ్, ఇంటెల్ క్యాపిటల్ పెట్టుబడి పెట్టాయి. ఇప్పుడు క్వాల్కమ్ వెంచర్స్ 0.15 శాతం వాటాను కొనుగోలు చేసింది.

రిలయన్స్ జియోలో ఇప్పటి వరకు వచ్చిన పెట్టుబడుల జాబితా
రిలయన్స్‌ను అప్పులు లేని కంపెనీగా మార్చాలని టార్గెట్ గా పెట్టుకున్నారు ముఖేష్ అంబానీ. 2021 మార్చి నాటికి రుణరహిత కంపెనీగా మార్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అయితే, తాము అనుకున్న టార్గెట్‌కు ముందే లక్ష్యాన్ని చేరుకోనుంది. ఈ నెల 15న రిలయన్స్ ఇండస్ట్రీస్ తన లక్షలాది షేర్ హోల్డర్లతో ఏజీఎం సమావేశం జరపనుంది. RIL వార్షిక సర్వసభ్య సమావేశాల్లో ప్రస్తుత సమావేశం నలభై మూడవది కావడం విశేషం. కాగా ముంబైలో లాక్డౌన్ అలాగే కరోనా పరిమితుల దృష్ట్యా మొదటిసారిగా వర్చువల్ గా నిర్వహించనున్నారు. ఆగష్టు 2019 లో చివరి సారిగా జరిగిన AGMలో, RIL నాలుగు కార్యాచరణ ప్రణాళికలను ప్రకటించగా అందులో చాలా వరకూ లక్ష్యాలను చేరుకున్నాయి.

ముఖేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ (File)
ఇటీవల బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకటించిన ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ 8 స్థానాన్ని దక్కించుకున్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్ట్ ముఖేష్ అంబానీ. వారెన్ బఫెట్‌ను దాటడం ద్వారా ముఖేష్ అంబానీ ఈ ఘనతను సాధించారు. ముఖేష్ అంబానీ సంపద 68.3 బిలియన్ డాలర్లుగా ఉంది. వారెన్ బఫెట్ సంపద 67.9 బిలియన్ డాలర్లు (జూలై 9 నాటికి) అని బ్లూంబర్గ్ ప్రకటించింది. 2020లో ప్రపంచం మొత్తం కరోనా వైరస్ కారణంగా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంది. కానీ, ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు మాత్రం 21.63 శాతం వృద్ధి చెందాయి.