news18-telugu
Updated: December 3, 2020, 12:37 PM IST
ప్రతీకాత్మకచిత్రం
దేవుడి పేరుతో వ్యాపారం అంటే లాభాల పంట పండాల్సిందే. పండుగలు, ఇతర పర్వదినాల్లో పూజాసామాగ్రికి, దేవుడి ప్రతిమలు, ఇతర వస్తువులకు ఎక్కడాలేని గిరాకీ వస్తుంది. ఇదే అదునుగా కొన్ని ప్రైవేట్ సంస్థలు భక్తుల నమ్మకాన్ని క్యాష్ చేసుకుంటున్నాయి. ఇదే దారిలో నడిచింది ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్. ఎలాంటి అనుమతులు లేకుండానే దేవుడి ప్రసాదాలని విక్రయిస్తోంది. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే పూరీ జగన్నాథ స్వామి మహాపప్రసాదాన్ని ఆన్ లైన్లో సేల్ కి పెట్టింది. ‘నిర్మాలయ మహాప్రసాద్’గా పిలిచే స్వామివారి ప్రసాదాన్ని ఆన్ లైన్లో విక్రయించడంపై ఒడిశాకు చెందిన లాయర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అమెజాన్ ఇండియాకు పూరీ న్యాయవాదుల సంఘం లీగల్ నోటీసులు జారీ చేసింది. మహాప్రసాదం ఆన్ లైన్ విక్రయాలపై 20 రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.
ఇదే అంశంపై పూరీ జగన్నాథస్వామి ఆలయంలో ప్రసాదం తయారీదారుల సంఘం అయిన సూర్ మహాసుర్ నిజోగ్.. సింగద్వార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎలాంటి అనుమతులు లేకుండానే అమెజాన్ సంస్థ ఆన్ లైన్లో స్వామివారి ప్రసాదాన్ని విక్రయిస్తోందని నిజోగ్ ఆరోపించింది. ప్రసాదం ఆన్ లైన్ విక్రయాలపై పోలీసులతో పాటు పూరీ జగన్నాథ స్వామి పాలకమండలి కూడా దర్యాప్తు జరిపించాలని ఫిర్యాదులో పేర్కొంది.
ఈ మొత్తం వ్యవహారంపై ‘సూర్ మహాసుర్ నిజోగ్’ కార్యదర్శి కృష్ణ చంద్ర ప్రతిహరి స్పందించారు. కొవిడ్ కారణంగా 9 నెలలుగా పూరీ జగన్నాథ ఆలయం మూసిఉందని.. ప్రసాదం తయారీ కూడా నిలిచిపోయిందని పేర్కొన్నారు. ప్రసాదాన్ని ఇళ్లలోనే తయారు చేసి ఆన్ లైన్లో విక్రయిస్తున్నట్లు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. స్వామివారి ప్రసాదం ప్రైవేట్ సంస్థలు విక్రయించడం వల్ల ఆలయప్రతిష్టకు భంగం వాటిల్లుతోందని.. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కొంతకాలంగా అమెజాన్ సంస్థ నిర్మాలయ మహాప్రసాదాన్ని రూ.290కి ఆన్ లైన్లో విక్రయిస్తోంది. దీనిపై అదనంగా డెలివరీ ఛార్జీలు కూడా వసూలు చేస్తోంది.
Published by:
Sumanth Kanukula
First published:
December 3, 2020, 12:27 PM IST