హోమ్ /వార్తలు /బిజినెస్ /

Reliance Retail - KKR Deal: రిలయన్స్ రిటైల్‌లో కేకేఆర్ రూ.5,550 కోట్ల పెట్టుబడులు

Reliance Retail - KKR Deal: రిలయన్స్ రిటైల్‌లో కేకేఆర్ రూ.5,550 కోట్ల పెట్టుబడులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రిలయన్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌లో కేకేఆర్ పెట్టుబడి పెట్టడం ఇది రెండోసారి. ఈ ఏడాది మేలో రిలయన్స్ డిజిటల్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ జియోలో రూ.11,367 కోట్ల పెట్టబడులు పెట్టింది కేకేఆర్.

  మొన్నటి వరకు రిలయన్స్ డిజిటల్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ జియోలోకి పెట్టుబడుల వరద పారింది. ఇప్పుడు రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లోకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే సిల్వర్ లేక్ సంస్థ రూ.7500 కోట్ల పెట్టుబడులు పెట్టగా.. తాజాగా ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేకేఆర్ పెట్టుబడులు పెట్టింది. రిలయన్స్ రిటైల్‌లో 1.28 శాతం వాటాను రూ.5550 కోట్లకు కొనుగోలు చేసింది. తద్వారా రిలయన్స్ రిటైల్‌లో పెట్టుబడుల విలువ రూ.4.21 లక్షల కోట్లకు చేరింది. ఈ నెలలో రిలయన్స్ రిటైల్‌లోకి పెట్టుబడులు రావడం ఇది రెండోసారి. సెప్టెంబర్ 9న సిల్వర్ లేక్ సంస్థ రూ.7.500 కోట్ల పెట్టబడులతో రిలయన్స్ రిటైల్‌లో 1.75 శాతం వాటాను కొనుగోలు చేసింది.

  కేకేఆర్‌తో తమ వ్యాపార సంబంధాలు మరింత పెరగడం సంతోషంగా ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ అన్నారు. రిటైల్ రంగంలోకి సాంకేతిక పరిజ్ఞానం ఎన్నో సంస్కరణలు తెచ్చింది.. ఇండియన్ రిటైల్‌ రంగంలో తమ దార్శనికతను అమలు చేయడంలో కేకేఆర్ విలువైన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. భారతీయులందరికీ లబ్ధి జరిగేలా ఇండియన్ రిటైల్ ఎకో సిస్టమ్‌లో సంస్కరణలు తెస్తామని తెలిపారు. రిలయన్స్‌తో తమ వ్యాపార సంబంధాలు మరింత ముందుకెళ్లడం సంతోషంగా ఉందని కేకేఆర్ కోఫౌండర్, కో సీఈవో హెన్నీ క్రావిస్ తెలిపారు. వర్తకులను ప్రోత్సహించడంతో పాటు వినియోగదారులకు కొత్త తరహా రిటైల్ అనుభూతిని కలిగిస్తామని పేర్కొన్నారు.

  రిలయన్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌లో కేకేఆర్ పెట్టుబడి పెట్టడం ఇది రెండోసారి. ఈ ఏడాది మేలో రిలయన్స్ డిజిటల్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ జియోలో రూ.11,367 కోట్ల పెట్టబడులు పెట్టింది కేకేఆర్.

  గత నెలలో ఫ్యూచర్ గ్రూప్‌ను రిలయన్స్ రిటైల్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. రూ.24,713 కోట్లు చెల్లించి ఫ్యూచర్ గ్రూప్‌ను కొనుగోలు చేసింది. ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్‌లో రిటైల్ అండ్ హోల్ సేల్ వ్యాపారాలను రిలయన్స్ రిటైల్ అండ్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ లిమిటెడ్‌ (ఆర్ ఆర్ ఎఫ్ ఎల్ ఎల్)కు బదిలీ చేయనున్నట్లు తెలిపింది. కాగా, రిలయన్స్ రిటైల్.. భారత్‌లో అతిపెద్ద రిటైల్ సంస్థ. దేశవ్యాప్తంగా 7వేల నగరాల్లో 12వేల స్టోర్‌లు నిర్వహిస్తోంది. తద్వారా 64 కోట్ల మందికి సేవలందిస్తోంది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Mukesh Ambani, Reliance, Reliance Industries

  ఉత్తమ కథలు