భారతీయ రైల్వే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) రైళ్లను ప్రతిష్టాత్మకంగా నడుపుతున్న సంగతి తెలిసిందే. దక్షిణ భారతదేశానికి తొలి వందే భారత్ రైలు అందుబాటులోకి వచ్చింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) మైసూర్-చెన్నై రూట్లో ఐదో వందే భారత్ రైలును (Vande Bharat Train) జెండా ఊపి ప్రారంభించారు. కర్నాటక పర్యటనలో ఉన్న నరేంద్ర మోదీ కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించారు. అంతకన్నా ముందు ఆయన వందే భారత్ ట్రైన్‌ను పరిశీలించారు. ప్రయాణికులకు ఈ వందే భారత్ రైలు నవంబర్ 12 నుంచి అందుబాటులోకి వస్తుంది. ఈ రైలు మైసూర్ నుంచి బెంగళూరు మీదుగా చెన్నైకి ప్రయాణిస్తుంది.
చెన్నై-మైసూర్ రూట్లో వందే భారత్ రైలు బుధవారం తప్ప వారానికి ఆరు రోజులు అందుబాటులో ఉంటుంది. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. అందులో 14 చైర్ కార్స్, 2 ఎగ్జిక్యూటీవ్ చైర్ కార్స్ ఉంటాయి. ఏసీ చైర్ కార్లో చెన్నై నుంచి మైసూరుకు రూ.1200, ఎగ్జిక్యూటీవ్ చైర్ కార్కు రూ.2295 ఛార్జీ చెల్లించాలి. మైసూర్ నుంచి చెన్నైకి ఏసీ చైర్ కార్లో రూ.1365, ఎగ్జిక్యూటీవ్ చైర్ కార్ ప్రయాణానికి రూ.2485 ఛార్జీ చెల్లించాలి.
Hon’ble PM Shri @narendramodi flagged off Vande Bharat Express between Mysuru & Puratchi Thalaivar Dr. MGR Central, Chennai from KSR Bengaluru Station in Karnataka, today. pic.twitter.com/qn9DihjGeB
— Ministry of Railways (@RailMinIndia) November 11, 2022
చెన్నై నుంచి మైసూర్ మధ్య 500 కిలోమీటర్ల దూరం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణిస్తుంది. బెంగళూరు, కాట్పాడి స్టేషన్లలో మాత్రమే ఈ రైలు ఆగుతుంది. మైసూర్ నుంచి చెన్నైకి 6 గంటల 25 నిమిషాలు, చెన్నై నుంచి మైసూరుకు 6 గంటల 30 నిమిషాలు వందే భారత్ రైలు ప్రయాణిస్తుంది. చెన్నై నుంచి బెంగళూరుకు కేవలం మూడు గంటల్లో చేరుకోవచ్చు. ఈ వందే భారత్ రైళ్లల్లో కన్సెషన్, చైల్డ్ ఫేర్ ఉండవు. కేవలం అడల్ట్ టికెట్స్‌కి పూర్తి ఛార్జీ చెల్లించాలి. బుకింగ్, క్యాన్సలేషన్, రీఫండ్ నియమనిబంధనలన్నీ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఉన్నట్టుగా ఉంటాయి.
భారతీయ రైల్వే తొలి సెమీ హైస్పీడ్ ట్రైన్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును 2019 లో ప్రారంభించింది. తాజాగా ఐదో వందే భారత్ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. న్యూ ఢిల్లీ-వారణాసి, న్యూ ఢిల్లీ-శ్రీ మాతా వైష్ణో దేవి కాట్రా, న్యూ ఢిల్లీ-అంబ్ అందౌరా, ముంబై సెంట్రల్-గాంధీ నగర్ రూట్లలో ఇప్పటికే వందే భారత్ రైళ్లు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. వచ్చే ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం నాటికి 75 వందే భారత్ రైళ్లను నడపాలని భారతీయ రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది.
వందే భారత్ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కేవలం 52 సెకండ్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం వందే భారత్ రైలు ప్రత్యేకత. ఇతర రైళ్లతో పోలిస్తే వందే భారత్ రైళ్లల్లో ప్రయాణించడం ద్వారా ప్రయాణ సమయం 25 శాతం నుంచి 45 శాతం వరకు తగ్గుతుంది. వందే భారత్ రైళ్ల ప్రత్యేకతలు చూస్తే ఇందులో ఆటోమెటిక్ డోర్స్ ఉంటాయి. జీపీఎస్ బేస్డ్ ఆడియో విజువల్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ కోసం వైఫై హాట్‌స్పాట్ ఉపయోగించుకోవచ్చు.
వందే భారత్ రైళ్లల్లో సీట్లు సౌకర్యవంతంగా ఉంటాయి. ఎగ్జిక్యూటీవ్ క్లాస్ బోగీల్లో రొటేటింగ్ చైర్లు ఉంటాయి. బయోవ్యాక్యూమ్ టైప్ టాయిలెట్స్ ఉంటాయి. దివ్యాంగులకు అనుకూలంగా వాష్‌రూమ్స్ ఉంటాయి. సీట్ హ్యాండిల్‌కు, సీట్ నెంబర్స్‌కు బ్రెయిలీ లెటర్స్ ఉంటాయి. ప్రతీ కోచ్‌కు ప్యాంట్రీ సదుపాయం ఉంటుంది. వేడివేడి కాఫీ, భోజనం, కూల్ డ్రింక్స్ అందుబాటులో ఉంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian Railways, IRCTC, Pm modi, PM Narendra Modi, Railways, Vande Bharat Train