కరోనా వైరస్ మహమ్మారి ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించింది. లక్షలాది మంది ఉద్యోగాలకు ముప్పు తీసుకొచ్చింది. ఆర్థిక సమస్యలు తప్పట్లేదు. ఈ సంక్షోభం ఎన్నాళ్లు ఉంటుందో తెలియదు. జీవితం గడవాలంటే డబ్బు కావాలి. చేతిలో ఉన్న డబ్బులు ఖర్చయిపోతే ఇక సేవింగ్స్ నుంచి బయటకు తీయాల్సిందే. ఇప్పటికే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO పాండమిక్ అడ్వాన్స్ ఫెసిలిటీని ఉద్యోగులకు కల్పించింది. అంటే ఉద్యోగులు తమ ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఈపీఎఫ్లోనే కాదు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో కూడా సేవింగ్స్ చేయడం చాలామందికి అలవాటే. మరి మీరు కూడా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్-PPF అకౌంట్లో సేవింగ్స్ చేస్తున్నారా? పీపీఎఫ్ నుంచి మీ డబ్బుల్నే లోన్‌గా తీసుకోవచ్చు. ఇందుకోసం మీరు చెల్లించాల్సిన వడ్డీ 1% మాత్రమే. అంటే రూపాయి వడ్డీకే లోన్ తీసుకోవచ్చు. చాలామందికి ఈ విషయం తెలియదు.
పీపీఎఫ్ అకౌంట్ నుంచి రూపాయి వడ్డీకే లోన్ తీసుకునే సదుపాయం అవసరాలను తీరుస్తుంది. కానీ ఇందులో మీరు కొంత నష్టపోకతప్పదు. మీరు తీసుకున్న డబ్బుకు పీపీఎఫ్ వడ్డీని కోల్పోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీ పీపీఎఫ్ అకౌంట్లో రూ.3,00,000 సేవింగ్స్ ఉన్నాయనుకుందాం. 2020 జూన్ త్రైమాసికానికి పీపీఎఫ్ వడ్డీ రేటు 7.1% ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మీరు మీ పీపీఎఫ్ సేవింగ్స్ నుంచి లోన్ తీసుకుంటే మీకు వచ్చే వడ్డీ కన్నా 1% ఎక్కువగా చెల్లించాలి. అంటే మీరు మీ రూ.3,00,000 సేవింగ్స్‌లో రూ.75,000 లోన్ తీసుకుంటే మీరు చెల్లించాల్సిన వడ్డీ 7.1%+1%= 8.1%. అంటే మీకు 8.1% వడ్డీకి లోన్ వస్తుంది. కానీ మీకు 7.1% వడ్డీ వస్తుంది కాబట్టి మీరు అదనంగా చెల్లించేది 1% వడ్డీ మాత్రమే. 8.1% వడ్డీ అనుకున్నా బ్యాంకుల్లో పర్సనల్ లోన్ వడ్డీ రేట్ల కన్నా చాలా తక్కువ. బ్యాంకుల్లో పర్సనల్ లోన్‌కు 11% నుంచి 18% వరకు వార్షిక వడ్డీ చెల్లించాలి.
అయితే పీపీఎఫ్ సేవింగ్స్‌లో ఎంత మొత్తం లోన్ తీసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. మీ సేవింగ్స్ మొదలు పెట్టిన మూడో ఏడాది నుంచి ఆరేళ్ల వరకు లోన్ లభిస్తుంది. రెండో ఏడాది చివరి నాటికి మీ సేవింగ్స్ ఎంత ఉంటే అందులో 25% మాత్రమే లోన్ తీసుకోవచ్చు. ఉదాహరణకు మీ సేవింగ్స్ రూ.2,00,000 అయితే మీరు రూ.50,000 లోన్ మాత్రమే తీసుకోవచ్చు. మీరు తీసుకున్న రుణాన్ని 36 నెలల్లో చెల్లించాల్సి ఉంటుంది. అయితే రిటైర్మెంట్ కోసం పీపీఎఫ్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తుంటారు. కాబట్టి ఇందులోంచి లోన్ తీసుకోకపోవడమే మంచిది. అత్యవసరమైతే తప్ప పీపీఎఫ్ అకౌంట్ డబ్బులపై ఆధారపడకూడదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.