ఎలాంటి నష్టభయం లేకుండా, నిర్ణీత మొత్తం రాబడికి హామీ ఇచ్చే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు చాలామందికి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్‌గా మారాయి. అయితే గత నెలలో ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (MPC) రెపో రేట్లను పెంచింది. ఫలితంగా అప్పటి నుంచి అన్ని బ్యాంకులు లోన్లు, డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. దీంతో సురక్షితమైన రాబడిని అందించే బ్యాంక్ FDలతో ఇప్పుడు మరింత ఎక్కువ లబ్ధి పొందవచ్చు. మీరు కూడా ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటే.. మంచి వడ్డీరేటుతో మెరుగైన రాబడిని అందించే బ్యాంకులను పరిశీలించండి.
* పంజాబ్ నేషనల్ బ్యాంక్
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) జులై 4 నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు గతంలో ప్రకటించింది. ఒక సంవత్సరం, రెండు సంవత్సరాల వరకు ఉన్న డిపాజిట్లపై FD రేట్లను బ్యాంకు 10 bps మేరకు పెంచింది. దీంతో అంతకుముందు 5.20 శాతంగా ఉన్న వడ్డీ రేటు 5.30 శాతానికి పెరిగింది. 2 సంవత్సరాలు, మూడు సంవత్సరాల్లో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై PNB FD వడ్డీ రేట్లు 20 bps పెరిగి 5.50 శాతానికి చేరుకున్నాయి. సీనియర్ సిటిజన్లకు 50 bps వరకు అదనంగా వడ్డీ లభిస్తుంది.
* యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు చేసే ఫిక్స్డ్ డిపాజిట్లపై 5.45 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 2 సంవత్సరాల నుంచి మూడేళ్ల వరకు చేసే ఎఫ్డీలపై ఈ బ్యాంకులో 5.50 శాతం వడ్డీ రేటు ఉంది. 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల ఎఫ్డీ వడ్డీ రేటు 5.75 శాతంగా ఉంది.
* UCO బ్యాంక్
మరో ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన UCO బ్యాంక్.. ఒక సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ కాలవ్యవధికి 5.30 శాతం ఎఫ్డీ వడ్డీ రేటును అందిస్తుంది. అయితే 2 సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల వరకు ఇదే వడ్డీ రేటు ఉంటుంది. మూడు నుంచి ఐదేళ్ల ఎఫ్డీలపై UCO బ్యాంక్ FD వడ్డీ రేటు 5.60 శాతంగా ఉంది. 5 సంవత్సరాల కంటే ఎక్కువ గడువుతో చేసే ఎఫ్డీలపై ఈ బ్యాంక్ 5.30 శాతం వడ్డీ ఇస్తుంది. సీనియర్ సిటిజన్లు ఈ రేట్లపై 50 బేసిస్ పాయింట్ల వరకు అదనంగా రాబడి పొందవచ్చు. అయితే డిపాజిట్ విలువ రూ. 2 కోట్ల కంటే తక్కువ ఉండాలి.
* పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌లో ఒక సంవత్సరం నుంచి రెండేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 5.35 శాతంగా ఉంది. రెండు నుంచి మూడేళ్ల ఎఫ్డీలపై వడ్డీరేటు 5.40 శాతం కాగా, మూడు సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు ఎఫ్డీలపై వడ్డీ 5.60 శాతంగా ఉంది. 5 నుంచి 10 సంవత్సరాల ఎఫ్డీలకు ఇదే వడ్డీ రేటు వర్తిస్తుంది. రూ.2 కోట్ల లోపు డిపాజిట్లకు ఈ రేట్లు వర్తిస్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banks, BUSINESS NEWS, Interest rates, Punjab National Bank