భారత్‌లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. భారత్‌లోని వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించిన ప్రధాని మోదీ, ఇండియాకు ఉన్న సామర్థ్యాల గురించి ప్రధానంగా హైలైట్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘ఈ రోజుల్లో ఇన్వెస్టర్లు అత్యధిక పర్యావరణ, సామాజిక, పరిపాలన సామర్థ్య ఉన్న కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్నారు. భారత్‌లో అలాంటి కంపెనీలు, వ్యవస్థ ఇప్పటికే ఉంది.’ అని ప్రధాని మోదీ అన్నారు.
ప్రధాని ప్రసంగంలో కొన్ని ముఖ్యమైన అంశాలు
ఇటీవల వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు దేశంలో రైతులతో జట్టు కట్టడానికి మంచి అవకాశాలను కల్పిస్తోంది. ప్రాసెసింగ్‌లో వచ్చిన అత్యాధునిక, సాంకేతిక సహకారంతో రాబోయే రోజుల్లో భారత్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ హబ్‌గా నిలుస్తుంది.
ఆత్మనిర్భర్ భారత్ అనేది కేవలం ఒక విజన్ మాత్రమే కాదు. అత్యంత పకడ్బందీగా ప్లాన్ చేసిన ఆర్థిక వ్యూహం. అది ఎలాంటి వ్యూహం అంటే భారత్ వ్యాపారాలు, నైపుణ్యం, వర్కర్ల ద్వారా మేకిన్ ఇండియాను గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ హౌస్‌గా మార్చే వ్యూహం.
కరోనా మహమ్మారి సమయంలో భారత్ త్వరగా తేరుకుంది. కరోనా వైరస్‌తో పోరాటం కావొచ్చు. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే అంశంలో కావొచ్చు. వ్యవస్థలో సామర్థ్యం, పాలసీలు, ప్రజల సహకారం వల్లే పుంజుకోవడం సాధ్యమైంది.
మన వ్యవస్థకు సామర్థ్యం ద్వారానే 800 మిలియన్ల మందికి ఆహారధాన్యాలు అందించగలిగాం. 420 మిలియన్ల మందికి డబ్బు అందేలా చేశాం. 80 మిలియన్ల మందికి ఉచిత వంట గ్యాస్ అందించాం.
దృఢమైన, సుస్థిరమైన భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టగలదు. గ్లోబల్ గ్రోత్ ఇంజిన్‌గా భారత్ మారడానికి మేం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం.మీ పెట్టుబడులకు నమ్మకమైన, స్థిరమైన రిటర్న్స్ రావాలంటే భారత్ సరైన స్థలం.
భారత్ మీకు విభిన్న పెట్టుబడులకు అవకాశాలను కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని అందిస్తుంది.
భారత్‌ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం.
ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ రౌండ్ టేబుల్ మీట్‌కు వ్యాపార, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఉన్నారు. అమెరికా, యూరప్, కెనడా, దక్షిణ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా, సింగపూర్ సహా పలు దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. కొందరు పెట్టుబడిదారులు మొట్టమొదటి సారి ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇక భారత్ నుంచి ముఖేష్ అంబానీ, దీపక్ పరేఖ్ (హెచ్డీఎఫ్సీ), దిలీప్ సంఘ్వీ (సన్ ఫార్మా), నందన్ నీలేకని (ఇన్ఫోసిస్), రతన్ టాటా (టాటా గ్రూప్), ఉదయ్ కోటక్ (కోటక్ మహీంద్రా బ్యాంక్) లాంటి వారు కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
కొన్ని ప్రఖ్యాత ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు కూడా ఈ వర్చువల్ మీట్‌కు హాజరయ్యాయి. టీమాసెక్, ఆస్ట్రేలియన్ సూపర్, సీడీపీక్యూ, సీపీపీ ఇన్వెస్ట్మెంట్స్, జీఐసీ, ఫ్యూచర్ గ్రూప్, జపాన్ పోస్ట్ బ్యాంక్, జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్, కొరియన్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, నిపాన్ లైఫ్, ముబదాలా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, ఓంటారియో టీచర్స్, టీచర్స్ రిటైర్మెంట్ టెక్సాస్, పెన్షన్ డెన్మార్క్ లాంటి సంస్థలు హాజరయ్యాయి.