ఇటీవల కాలంలో ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్న రుణాలు హోంలోన్లు. సొంత ఇల్లు నిర్మాణం లేదా కొనుగోలు కోసం బ్యాంకులు తక్కువ వడ్డీరేటుతో వీటిని మంజూరు చేస్తున్నాయి. ఈ రుణం తీసుకోవాలని ప్లాన్ చేసుకుంటుంటే తప్పనిసరిగా దీర్ఘకాలంపాటు ఆర్థిక నిబద్ధత ఉండాలి. అంటే కనీసం 15 సంవత్సరాల పాటు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. రుణదాతలు కూడా ఎన్నో విషయాలను పరిగణనలోకి తీసుకొని మీకు హోంలోన్లు మంజూరు చేస్తారు. ముఖ్యంగా వినియోగదారుని క్రెడిట్ వర్త్, క్రెడిట్ స్కోరు, క్రెడిట్ హిస్టరీ ఇలా పలు అంశాలను దృష్టిలో ఉంచుకొని లోన్ ఇస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుంటే రుణం మంజూరయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ముందు డౌన్ పేమెంట్ రెడీ చేసుకోండి..
చాలా మంది హోంలోన్ కు అప్లై చేసుకున్న తర్వాత డౌన్ పేమెంట్ కోసం పాకులాడుతుంటారు. అలా కాకుండా రుణానికి దరఖాస్తు చేసుకోవడానికంటే ముందే డౌన్ పేమెంట్ ను సిద్ధం చేసుకోండి. ప్రాపర్టీ కాస్ట్ లో 75 నుంచి 90 శాతం వరకు లోన్ ఇచ్చే అవకాశాన్ని ఆర్బీఐ రుణాదాతలకు అందించింది. దరఖాస్తుదారులు మిగిలిన మొత్తాన్ని డౌన్ పేమెంట్ లేదా మార్జిన్ కాంట్రిబ్యూషన్ ద్వారా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.
కాబట్టి హోంలోన్ కోసం అప్లై చేసుకునే ముందు ప్రాపర్టీ కాస్ట్ లో 10 నుంచి 25 శాతం నిధులు మీ వద్ద ఉంచుకునేలా ప్లాన్ చేసుకోండి. మీ డౌన్ పేమెంట్ వీలైనంత వరకు అధికంగా ఉండటం వల్ల వడ్డీ రేటు తగ్గే అవకాశం ఎక్కువ. అంతేకాకుండా అది మీ క్రెడిట్ రిస్క్ ను కూడా తగ్గిస్తుంది. సాధారణంగా అధిక డౌన్ పేమెంట్లు చెల్లించేవారికి తక్కువ వడ్డికే రుణాన్ని పొందే అవకాశం ఎక్కువ.
క్రెడిట్ స్కోర్ సమీక్షించండి..
రుణదాతలు వారి దరఖాస్తులను గణించేటప్పుడు క్రెడిట్ స్కోరును తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుంటారు. ఈ స్కోరు అధికంగా ఉండేవారు అంటే 750 కంటే అధికంగా ఉండేవారికి సాధారణంగానే లోన్ ఆమోదం పొందడానికి మెరుగైన అవకాశాలను కలిగి ఉంటారు. చాలావరకు రుణదాతలు మంచి క్రెడిట్ స్కోరు ఉన్నవారికి తక్కువ వడ్డీకే రుణాన్ని మంజూరు చేస్తారు. కాబట్టి హోంలోన్ కోసం ప్రయత్నించేవారు తప్పకుండా తమ క్రెడిట్ స్కోరును సమీక్షించుకోవాలి.
ఈఎంఐ చెల్లించే స్థోమత ఉందో లేదో చెక్ చేసుకోండి..
నెలవారీ ఆదాయంలో 50 నుంచి 60 శాతం హోంలోన్ ఈఎంఐ చెల్లించే దరఖాస్తుదారులకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ పరిమితిని మించినవారు తమ ప్రస్తుత రుణాల్లో కొంత భాగాన్ని ముందస్తుగా చెల్లించడం ద్వారా 50 శాతం పరిధిలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. రీపేమెంట్ బాధ్యతను తగ్గించుకోవడానికి సుదీర్ఘ కాలవ్యవధిని ఎంచుకోవచ్చు. ఇందుకోసం ఈఎంఐని అంచనావేయడానికి ఆన్ లైన్ హోం ఈఎంఐ క్యాలిక్యులేటర్స్ ఉపయోగించండి.
ఈఎంఐల కోసం అత్యవసర నిధి..
ఊహించని ఆర్థిక అత్యవసర పరిస్థితులు లేదా ఆదాయ నష్టం రుణం చెల్లించే సామర్థ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. గడువులోపు హోంలోన్ ఈఎంఐలను చెల్లించకపోతే భారీ జరిమానాలు ఉంటాయి. చివరకు క్రెడిట్ స్కోరుపై ప్రభావం పడుతుంది. అంతేకాకుండా ఇప్పటికే ఉన్న మీ పెట్టుబడులను లిక్విడేట్ చేయడం వల్ల మీ ఆర్థిక స్థితిపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. కాబట్టి అత్యవసర నిధులను పక్కన పెట్టడం వల్ల ఇలాంటి విపత్కర పరిస్థితులను నివారించవచ్చు. కనీసం ఆరు నెలల ఈఎంఐల మొత్తం ఈ నిధిలో ఉండాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.