సాధారణ పొదుపుల వల్ల రాబడి చాలా తక్కువగా వస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక మంది ఆసక్తి చూపిస్తున్నారు. కానీ వీటిపై సాధారణ ప్రజలకు సరిగా అవగాహన ఉండట్లేదు. ఫండ్లలో పెట్టుబడులను ఎంచుకునేవారు వీటికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిల్లో సీఏఎన్ (CAN) ముఖ్యమైనది. దీన్ని కామన్ అకౌంట్ నంబర్ అంటారు. CAN ను అన్ని మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్‌ల కోసం మ్యూచువల్ ఫండ్ యుటిలిటీస్ ప్లాట్‌ఫాంలు (MFU) కేటాయిస్తాయి. CAN ద్వారా మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్‌ను ట్రాక్ చేయవచ్చు. దీంతో పాటు MFU ఆన్లైన్ ప్లాట్ఫారంలో లావాదేవీలు చేయవచ్చు. కస్టమర్లు దీన్ని వివిధ మార్గాల్లో సులభంగా పొందవచ్చు. ఆన్లైన్లో వెబ్సైట్ ద్వారా eCAN కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే నేరుగా అప్లికేషన్ పెట్టుకొని సులభంగా కామన్ అకౌంట్ నంబర్ పొందవచ్చు.
1. నేరుగా దరఖాస్తు చేసుకోవడం
పెట్టుబడిదారులకు CAN అప్లికేషన్ ఫారంలు ఆఫ్‌లైన్ విధానంలో అందుబాటులో ఉంటాయి. వీటిని నింపి, అవసరమైన ఐడీ ప్రూఫ్స్‌తో కలిపి సంబంధిత MFU సంస్థ లేదా MFU పాయింట్ ఆఫ్ సర్వీస్‌కు ఇవ్వాలి. వెరిఫికేషన్ తరువాత కామన్ అకౌంట్ నంబర్‌ను వారికి కేటాయిస్తారు. ఈ విధానంలో ఎవరైనా సులువుగా CANను పొందవచ్చు.
2. ఆన్లైన్ రిజిస్ట్రేషన్
కామన్ అకౌంట్ నంబర్ కోసం కస్టమర్లు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇందుకు
https://www.mfuindia.com/CANFormFill వెబ్సైట్లోకి వెళ్లి అప్లికేషన్ ఫారంను నింపాలి. దీన్ని ప్రింట్ తీసుకొని, సంతకాలు చేసి ఐడీ ప్రూఫ్స్‌తో కలిపి సంబంధిత MFU సంస్థ లేదా MFU పాయింట్ ఆఫ్ సర్వీస్‌కు పంపించాలి. వెరిఫికేషన్ తరువాత కస్టమర్లకు CANను కేటాయిస్తారు. ఈ సమాచారాన్ని వారికి తెలియజేస్తారు.
4. Partially electronic CAN
ఈ పద్ధతిలో పెట్టుబడిదారులు ఆన్లైన్లో ఇచ్చిన సమాచారం ఆధారంగా ముందు ఒక eCANను వారికి కేటాయిస్తారు. ఆ తరువాత దీన్ని ఇతర ఐడీ ప్రూఫ్స్‌తో కలిపి సంబంధిత మ్యూచువల్ ఫండ్ యుటిలిటీ ప్లాట్‌ఫాంలు లేదా MFU పాయింట్ ఆఫ్ సర్వీస్‌లకు నేరుగా దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం వారికి CANను కేటాయిస్తారు.
ఈ విషయాలు గుర్తుంచుకోవాలి
eCAN విధానాన్ని ఎంచుకున్నవారు సులభంగా, తక్షణమే CANను పొందవచ్చు. ఆఫ్‌లైన్ లేదా ఆన్లైన్ దరఖాస్తును ఎంచుకుంటే.. డాక్యుమెంట్లు అన్నీ అందించి, వెరిఫికేషన్ పూర్తయిన తరువాత CANను కేటాయిస్తారు. eCANకు అప్రూవల్ వచ్చిన తరువాతే దాని సహాయంతో చేసిన లావాదేవీలను అనుమతిస్తారు.