పెట్రోల్, డీజిల్ ధరలు దేశ వ్యాప్తంగా వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. భారీగా పెరుగుతున్న ధరలతో ప్రజలు తమ వాహనాలను బయటకు తీయాలంటేనే భయ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెరిగిన ధరలతో ప్రజల్లో తీగ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు లీటరుకు రూ.100 చేరడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఇదిలా ఉంటే పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం ఏమీ పట్టనట్లుగా వ్యవహరించడంపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ప్రభుత్వ తీరుపై వారంతా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం పెరుగుతున్న పెట్రోల్ ధరపై కీలక వాఖ్యలు చేశారు.
శీతాకాలం పోతే పెట్రోల్ ధరలు తగ్గుతాయని ఆయన అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా పెట్రోలియం ధరలు పెరగడం వినియోగదారులపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. శీతాకాలం అనంతరం పెట్రోల్ ధరలు దిగి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సాధారణంగా డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ధరలు కూడా అధికంగా ఉంటాయన్నారు. శీతాకాలంలో పెట్రోల్, డీజిల్ కు డిమాండ్ అధికంగా ఉంటుందన్నారు.
ఇదిలా ఉంటే.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండడంపై.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్, డీజిల్ రేట్ల పెరుగుదల అనేది ద్రవ్యోల్బణం మీద ప్రభావం చూపుతుందన్నారు. కాబట్టి, కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకుని పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థికపరమైన ఒత్తిడులు చాలా ఉంటాయని.. కరోనా సమయంలో రాష్ట్రానికి, దేశానికి డబ్బులు చాలా అవసరమని... అయితే, రేట్ల పెరుగుదల ప్రభావం ద్రవ్యోల్బణం మీద పడుతుందన్నారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూల నిర్ణయం తీసుకుంటాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.