పెట్రోల్, డీజిల్ జీఎస్టీ పరిధిలోకి ఎప్పుడు వస్తాయి?... బీజేపీ ఎంపీ సుశీల్ మోదీ కీలక వ్యాఖ్యలు

ప్రతీకాత్మక చిత్రం

ఇటీవల పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్ ను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని చాలా మంది డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పార్లమెంట్ సాక్షిగా బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు.

 • Share this:
  పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే డిమాండ్ చాలా కాలం నుంచి ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే అప్పుడు ధరలు తగ్గుతాయనే వాదన ఉంది. దీని కోసం చాలా మంది నిపుణులు కూడా డిమాండ్ చేస్తున్నారు. సామాన్య జనం కూడా దీనిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే, ఈ క్రమంలో బీజేపీ ఎంపీ, బీహార్ మాజీ ఆర్థిక శాఖ మంత్రి సుశీల్ కుమార్ మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ మరో పదేళ్ల వరకు జీఎస్టీ పరిధిలోకి వచ్చే అవకాశం లేదని కుండబద్దలు కొట్టారు. ఆర్థిక బిల్లు మీద ఆయన మాట్లాడుతూ దమ్ముంటే బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, ఆర్థిక మంత్రులు ఈ అంశాన్ని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు కలిపి పెట్రోల్, డీజిల్ మీద విధించే ట్యాక్స్ ల ఆధారంగా సుమారు రూ.5 లక్షల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయి. అందులో రాష్ట్రాల వాటా రూ.2 లక్షల కోట్లు.

  ఇటీవల పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్ ను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని చాలా మంది డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పార్లమెంట్ సాక్షిగా బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య కాలంలో పెట్రోల్ ధరలు రూ.100 వరకు చేరాయి. దీంతో ఈ డిమాండ్ మళ్లీ తెరపనైకి వచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం నాడు లోక్ సభలో మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అంశం మీద చర్చించేందుకు తాను ఆనందంగా ఉన్నానని చెప్పారు. వచ్చే సమావేశంలో ఈ అంశంపై చర్చిస్తామన్నారు.

  సుశీల్ మోదీ రాజ్యసభలో విపక్షాల మీద విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాలు బయట నుంచి విమర్శలు రాళ్లు వేయడం సహజమేనన్నారు. అయితే, జీఎస్టీ కౌన్సిల్లో ఈ అంశాన్ని లేవనెత్తాలన్నారు. ‘పదే పదే పెట్రోల్, జీడిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే డిమాండ్ తెరపైకి వస్తుంది. నేను జీఎస్టీ కౌన్సిల్ లో కొంతకాలం ఉన్నాను. నేను ఈ సభ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నా. ఒకవేళ పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే రాష్ట్రాలకు రూ.2 లక్షల కోట్ల వాటా ఎవరిస్తారు.’ అని సుశీల్ మోదీ ప్రశ్నించారు.

  ఇటీవల క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నాయి. గత 15 రోజుల క్రితంతో పోలిస్తే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గాయి. 15 రోజుల క్రితం 68 డాలర్లు ఉన్న బ్యారెల్ ధర ఇప్పుడు 64 డాలర్లకు తగ్గింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. కనీసం లీటర్ కు రూ.2 చొప్పున తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, దీనిపై పెట్రో కంపెనీలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండడంతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తారనే అంచనాలు సర్వత్రా ఉన్నాయి.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: