కరోనా తర్వాత పెరిగిన పర్సనల్ లోన్లు.. ఎక్కువగా వేటి కోసం తీసుకున్నారో తెలుసా?

(ప్రతీకాత్మక చిత్రం)

అప్పు లేనివాడే అధిక బలుడు అని పెద్దలు అంటారు.. కానీ మనం చేసే అప్పు మన ఆర్థిక స్థాయిని పెంచేందుకు ఉపయోగిస్తే మంచిదే అన్నది ఇప్పటి మ?

  • Share this:
అప్పు లేనివాడే అధిక బలుడు అని పెద్దలు అంటారు.. కానీ మనం చేసే అప్పు మన ఆర్థిక స్థాయిని పెంచేందుకు ఉపయోగిస్తే మంచిదే అన్నది ఇప్పటి మాట. అందుకే ఈ తరంలో రుణాలు తీసుకునే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. ముఖ్యంగా వ్యక్తిగత రుణాలు ఎక్కువ మంది తీసుకుంటున్నారట. సొంతంగా వ్యాపారం చేసేందుకుగాను గతేడాది దేశవ్యాప్తంగా 25 శాతం మంది వ్యక్తిగత రుణాలు తీసుకున్నట్లు ఇండియాలెండ్స్ రిపోర్టులో తేలింది. 18 శాతం మంది వైద్య ఖర్చుల నిమిత్తం, 17 శాతం మంది ద్విచక్రవాహనాలు లేదా కార్ల కొనుగోలు కోసం రుణం తీసుకున్నట్లు తెలిపింది. కోవిడ్ వల్ల ప్రజలపై సామాజిక, ఆర్థిక ప్రభావం భారీగా పడటంతో లోన్లు వైపు ఎక్కువగా మొగ్గు చూపారు.
ఏడాది క్రితం లాక్ డౌన్ ప్రకటించనప్పటి నుంచి రుణగ్రహీతల మనోభావాలను అర్థం చేసుకోవడానికి ఈ నూతన డిజిటల్ లెండింగ్ ప్లాట్ ఫాం రుణాలను అంచనా వేస్తోంది. 2020 మార్చి 25 నుంచి 2021 మార్చి 20 వరకు 20-55 ఏళ్ల మధ్య వయస్సున్న 1,50,000 మంది తీసుకున్న రుణాల ఆధారంగా డేటా సేకరించి దేశవ్యాప్త అధ్యయనాన్ని నిర్వహించింది. ఈ జాబితాను టైర్-1, టైర్-2 నగరాల నుంచి సేకరించింది.

దిల్లీ ప్రాంతం నుంచి అధికంగా లోన్ దరఖాస్తులు రాగా.. టైర్-2 నగరాల్లో 38 శాతం పెరుగుదల కనిపించింది. విలాసవంతమైన ఖర్చుల వల్ల టైర్-1 నగరాల నుంచి కూడా లోన్ డిమాండ్ పెరిగింది.

ఇండియా లెండ్స్ నివేదికలో ముఖ్యమైన విషయాలు..
-ముంబయిలో 27 శాతం మంది సొంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి వ్యక్తిగత రుణాలను తీసుకున్నారు. 15 శాతం మంది ల్యాప్ ట్యాప్స్, టాబ్లెట్స్ లాంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలను కొనుగోలు చేయడానికి లోన్ తీసుకున్నారు. వర్క్ ఫ్రమ్ హోం కల్చర్ కు మారడం వల్ల ఇవి పెరిగాయి.
- దిల్లీ 31 శాతం మంది వాషింగ్ మెషిన్, డిష్ వాషర్ లాంటి గృహోపకరణాల కొనుగోలు కోసం రుణాలకు దరఖాస్తులు చేసారు. మహమ్మారి కారణంగా 25 శాతం వైద్య ఖర్చు కోసం లోన్ కు అప్లయి చేశారు.
- బెంగళూరులో 28 శాతం ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, 12 శాతం అప్ స్కిల్లింగ్ కోర్సుల కోసం రుణాలకు దరఖాస్తు చేశారు. చాలామంది ప్రజలు తమ ఖాళీ సమయాన్ని తమను తాము మెరుగుపరచుకోవడానికి ఉపయోగించుకున్నారు.
- చెన్నైలో 19 శాతం మంది 2-వీలర్లు, కార్లు కొనుగోలు కోసం రుణాలకు దరఖాస్తు చేసుకున్నారు. 17 శాతం మంది స్మార్ట్ టీవీలు, ల్యాప్ టాప్స్ లాంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాల కోసం లోన్ ను ఎంచుకున్నారు.
-హైదరాబాద్ లో 20 శాతం మంది రుణగ్రహీతలు వారి వైద్య ఖర్చుల కోసం వ్యక్తిగత రుణాలను ఆశ్రయించారు. అయితే 15 శాతం మంది ఉన్నత స్థాయి కోర్సుల కోసం తీసుకున్నారు.
-టైర్-1 నగరాల నుంచి 46 శాతం మంది రుణాలు తీసుకోగా.. టైర్-2 నగరాల నుంచి 54 శాతం వ్యక్తిగత రుణాలను ఆశ్రయించడం ఆసక్తికరమైన విషయం. టైర్-2 నగరాలైన కోయంబత్తూర్, చండీఘడ్, లక్నో, ఇండోర్, కొచ్చి లాంటి నగరాల్లో ఎక్కువ మంది రుణాలు తీసుకున్నారు.
- ఈ సర్వే ఫలితాలను గమనిస్తే వివాహ, ప్రయాణ ఖర్చులు కొంత శాతం తగ్గింది. ప్రస్తుతం యువత కూడా నిరాండబర వివాహలకే మొగ్గు చూపుతున్నారు. బడ్జెట్-ఫ్రెండ్లీ ప్రయాణాలు చేసేందుకు ఇష్టపడుతున్నారు.-దాదాపు 52 శాతం మంది రుణగ్రహీతలు 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు వారే. దీన్నిబట్టి చూస్తే మిలినియల్సే ఎక్కువగా రుణాలు తీసుకుంటున్నట్లు అర్థమవుతుంది. ఈ రిపోర్టు ఆధారంగా మహిళలు, పురుషులు ఇద్దరూ 10 వేల నుంచి రూ.5 లక్షల లోపు రుణాలు తీసుకున్నట్లు తెలుస్తుంది.
Published by:Krishna Adithya
First published: