మన దేశంలో సంప్రదాయ పెట్టుబడి మార్గంగా ఫిక్స్డ్ డిపాజిట్లకు ఎంతో ప్రాధాన్యం ఉంది. పొదుపు, పెట్టుబడులు చేయాలనుకునేవారు ముందుగా ఎఫ్‌డీల గురించే ఆరా తీస్తారు. వీటిపై నిర్ణీత వడ్డీ హామీ ఉంటుంది. వడ్డీ రేట్లు తగ్గినప్పటికీ, నష్టభయం లేని పెట్టుబడిగా ఎఫ్డీలను ఎక్కువమంది ఎంచుకుంటున్నారు. సెక్షన్ 80 సి ప్రకారం ట్యాక్స్ మినహాయింపు ఉండటం కూడా కస్టమర్లకు కలిసివచ్చే అంశం. ట్యాక్స్ రూపంలో ఎంతోకొంత మొత్తం ఆదా చేయవచ్చనే ఉద్దేశంతో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, యులిప్, ఎన్‌పిఎస్ వంటి పెట్టుబడి మార్గాలను పక్కన పెట్టి ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీలను ఎక్కువమంది ఎంచుకుంటారు. ఒక ఆర్థిక సంవత్సరంలో ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీలపై రూ.1,50,000 వరకు ఆదా చేయవచ్చు. సాధారణ ఎఫ్డీలకు, ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీలకు కొన్ని తేడాలు ఉన్నాయి. కస్టమర్లు వీటిపై అవగాహన పెంచుకోవాలి.
సహకార బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు తప్ప ఇతర ప్రభుత్వ లేదా ప్రైవేట్ బ్యాంకుల్లో ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీలను తీసుకోవచ్చు. ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్లకు ఐదేళ్ల వరకు లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. గడువుకు ముందు దీని నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకునే అవకాశం లేదు. భారత పౌరులు, హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీలు మాత్రమే వీటిల్లో పెట్టుబడి పెట్టవచ్చు. ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీలను సింగిల్‌గా లేదా జాయింట్ అకౌంట్‌గా తీసుకోవచ్చు. జాయింట్ అకౌంట్ తీసిన వారిలో ఫస్ట్ హోల్డర్ మాత్రమే సెక్షన్ 80సి కింద ట్యాక్స్ మినహాయింపు పొందే అవకాశం ఉంది. కస్టమర్లు నెలవారీ, త్రైమాసిక, వార్షిక ప్రాతిపదికన వడ్డీ తీసుకునే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. వీటిపై వచ్చే వడ్డీని తిరిగి పెట్టుబడి పెట్టే కాంపౌండింగ్ ఆప్షన్‌ను కూడా వినియోగదారులు ఎంచుకోవచ్చు. వీటిపై లోన్ తీసుకునే అవకాశం లేదు.
ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్లపై సంపాదించిన వడ్డీ ట్యాక్స్ పరిధిలోకి వస్తుంది. ఈ డిపాజిట్ల నుంచి వచ్చే వడ్డీ మొత్తం వ్యక్తుల ఆదాయం కిందకు వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం దీనిపై ట్యాక్స్ విధిస్తారు. వీటి నుంచి వచ్చే వార్షిక వడ్డీపై బ్యాంకులు 10 శాతం చొప్పున TDS (ట్యాక్స్ డిడక్టబుల్ ఎట్ సోర్స్)ను తీసివేస్తాయి. ఒకవేళ కస్టమర్లు ట్యాక్స్ పరిధిలోకి రానివారైతే, ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ఫారం 15G/Hను సంబంధిత బ్యాంకులో సమర్పించాలి.
చిన్న బ్యాంకుల్లోనే ఎక్కువ వడ్డీ
ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీలపై వచ్చే వడ్డీ బ్యాంకులను బట్టి మారవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి పెద్ద బ్యాంకుల్లో ట్యాక్స్ సేవింగ్ డిపాజిట్లపై అతి తక్కువ వడ్డీ రేట్లు ఉన్నాయి. వీటిపై చిన్న ప్రైవేటు బ్యాంకులు ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఈ విభాగంలో డిసిబి (DCB) బ్యాంక్, యెస్ బ్యాంక్ (Yes Bank), ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (Equitas Small Finance Bank)లు అత్యధికంగా 6.75 శాతం వడ్డీని అందిస్తున్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు 6.5 శాతం వడ్డీతో ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ డిపాజిట్లపై ఆర్బిఎల్ (RBL) బ్యాంక్ 6.40 శాతం వడ్డీ అందిస్తోంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.