Financial Year End: మార్చి 31లోపు అర్జెంటుగా పూర్తి చేయాల్సిన పనులు.. లేదంటే భారీ జరిమానా తప్పదు!

ప్రతీకాత్మక చిత్రం

మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి కరోనా ఆర్థిక రంగాన్ని అతలాకుతలం చేసింది. అందువల్ల, గతేడాది కరోనా సంక్షోభం కారణంగా కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలు, నిబంధనలకు గడువు పెంచిన విషయం తెలిసిందే.

  • Share this:
మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి కరోనా ఆర్థిక రంగాన్ని అతలాకుతలం చేసింది. అందువల్ల, గతేడాది కరోనా సంక్షోభం కారణంగా కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలు, నిబంధనలకు గడువు పెంచిన విషయం తెలిసిందే. ఇందులో పాన్​ కార్డును ఆధార్​ కార్డుతో అనుసంధానం చేయడం, ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి గడువు పెంపు వంటి వెసులుబాట్లను కల్పించింది. వీటితో పాటు పన్ను చెల్లింపుదారులు మార్చి 31లోపు చేయాల్సిన కొన్ని కీలకమైన పనుల జాబితాను పేర్కొంది. మీరు ఇప్పటికీ, ఆయా పనులను పూర్తిచేసుకోకపోతే, వీటిని పరిశీలించి త్వరగా పూర్తిచేసుకోండి. లేదంటే, జరిమానా చెల్లించాల్సి వస్తుందని గుర్తించుకోండి.

పీపీఎఫ్ మినిమం కంట్రిబ్యూషన్​
ప్రతి ఆర్థిక సంవత్సరంలో మీ పీపీఎఫ్ ఖాతాను యాక్టివ్​గా ఉంచడానికి, మీరు మీ పీపీఎఫ్ (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్) ఖాతాలో కనీసం రూ .500 అయినా పెట్టుబడి పెట్టాలి. మీరు కనీస పెట్టుబడి కూడా పెట్టకపోతే మీ ఖాతా ఇనాక్టివ్​ అవుతుందని గుర్తించుకోండి. మీకు జరిమానా విధించి, కనీస డిపాజిట్ మొత్తాన్ని రికవరీ చేసిన తర్వాతే, మీ అకౌంట్​ యాక్టివ్​గా మారుతుంది.

ఎన్‌పిఎస్‌ మినిమం కంట్రిబ్యూషన్​
ఎన్‌పిఎస్ (నేషనల్ పెన్షన్ సిస్టమ్) టైర్ 1 ఖాతాలో, కనీస రూ .500 ఉండేలా చూసుకోండి. ఎన్‌పిఎస్ టైర్ 2 ఖాతాకు మినిమం కంట్రిబ్యూషన్​ రూ .250గా ఉంటుంది. మినిమం కంట్రిబ్యూషన్​ లేకపోతే మీ అకౌంట్​ ఇనాక్టివ్​ అవుతుంది. మీరు ఎప్పుడైతే రూ.250 చెల్లిస్తారో అప్పుడే మీ అకౌంట్​ తిరిగి యాక్టివ్​ అవుతుంది. దీని కోసం మీరు POPని సందర్శించి అవసరమైన మొత్తాన్ని జమ చేయాలి. eNPS పోర్టల్ ద్వారా కూడా చెల్లించవచ్చు.

పోస్ట్ ఆఫీస్ ఆర్డీ అకౌంట్​
నెల మొదటి పదిహేను రోజుల్లో తెరిచిన పోస్ట్​ ఆఫీస్​ ఆర్డీ అకౌంట్ల విషయంలో మీ నెలవారీ కంట్రిబ్యూషన్​ను నెల మొదటి రోజుల్లోనే జమ చేయాలి. అయితే, అకౌంట్​ మాత్రం పదహారో రోజున తెరవబడుతుంది. కాగా, ఏ నెలలోనైతే మీరు జమ చేయడంలో ఆలస్యం చేస్తారో అప్పుడు డిఫాల్ట్ అవుతుంది. డిఫాల్ట్ అయిన ప్రతి నెలా రూ .100 జమ చేయాలి. గరిష్టంగా నాలుగు డిఫాల్ట్‌ల వరకు మాత్రమే అనుమతించబడతాయి. కాబట్టి, మీరు మీ ఆర్డీ నెలవారీ కంట్రిబ్యూషన్​ను సకాలంలో చెల్లించండి.

ఆలస్యమైన ఐటి రిటర్న్
మీరు ఇప్పటికీ ఆదాయపు పన్ను రిటర్న్​ దాఖలు చేయకపోతే.. మార్చి 31లోపు పూర్తి చేయండి. ఒకవేళ గడువులోగా దాఖలు చేయకపోతే మీరు రూ .10,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అదే, రూ.5 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు రూ.1000 వరకు ఆలస్య రుసుం చెల్లించాలి. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున త్వరగా ఆదాయపు పన్ను రిటర్న్​ను దాఖలు చేయాలని కేంద్రం చెబుతోంది.

వివాద్​ సే విశ్వాస్ స్కీం
సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ డైరెక్ట్​ టాక్సెస్​ (సీబీడీటీ) 2020 మార్చి 17న వివాద్​ సే విశ్వాస్​ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. దీని కింద డిక్లరేషన్​ దాఖలు చేయడానికి మార్చి 31 వరకు గడువు విధించింది. పెండింగ్​లో ఉన్న ఆదాయపు పన్ను వ్యాజ్యాన్ని తగ్గిచడం, ప్రభుత్వానికి సకాలంలో ఆదాయాన్ని సంపాదించడంతో పాటు పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూర్చడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మార్చి 31లోగా మీ ఐటీఆర్​ను సమర్పించేలా చూసుకోండి. తద్వారా అటు మీకు, ప్రభుత్వానికి లాభం చేకూరుతుంది.

పాన్ ఆధార్ లింకింగ్
ఏప్రిల్ 1లోపు మీ పాన్​ నంబర్​తో ఆధార్ తప్పనిసరిగా అనుసంధానించాలి. పాన్​ ఆధార్​ లింక్​ కోసం ప్రభుత్వం ఇప్పటికే చాలా సార్లు గడువు ఇచ్చింది. ఇది చివరిగా 2020 జూన్​ 30 నుంచి 2021 మార్చి 31 వరకు పొడిగించింది. గడువులోగా లింక్​ చేయకపోతే మీ పాన్​ కార్డు పనిచేయదని కేంద్రం తెలిపింది. మీ పాన్ ఆధార్‌ లింక్​ చేయకపోతే పెద్దమొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరపడం కుదరదని, యాక్టివ్​లో లేని పాన్​ కార్డులను వినియోగిస్తే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 272 బి కింద రూ .10,000 జరిమానా విధిస్తామని కేంద్రం హెచ్చరించింది.

ఎల్​టీసి క్యాష్​ వోచర్ పథకం
ఎల్​టీసి క్యాష్ వోచర్ పథకం కింద బిల్లులను సమర్పించడం, మార్చి 31వ తేదీలోపు బిల్లులను సరైన ఫార్మాట్​లో చెల్లించడం తప్పనిసరి. జీఎస్టీ మొత్తం, వోచర్​ నంబర్​ కలిగి ఉండాలి. కాగా, ఈ పథకాన్ని 2020 అక్టోబర్​ నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని లక్ష్యం డిమాండ్​ పెరుగుదలను ఉత్తేజపర్చడం, ఎల్​టీఏ మొత్తాన్ని క్లెయిమ్​ చేసుకోవడానికి అవకాశం కల్పించడం.

శాలరీ వివరాల సమర్పణ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఒక ఉద్యోగి కంపెనీ మారితే.. మాజీ కంపెనీలో అందుకున్న జీతం వివరాలను ప్రస్తుత కంపెనీకి అందించాలి. పన్ను మినహాయింపు కోరడానికి ఇది సహాయపడుతుంది. ఇది కూడా మార్చి 31 లోపు పూర్తి చేయాలి.

వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి...

లాంగ్​ టర్మ్​ క్యాపిటల్​ గెయిన్స్​
లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనగా లిస్టెడ్ ఈక్విటీ స్టాక్స్, ఈక్విటీ స్కీంలపై వచ్చిన లాభాలపై రూ. 1 లక్ష వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. కాబట్టి, మీరు స్టాక్స్​, ఈక్విటీల్లో వచ్చిన లాభాలకు సంబంధించిన వివరాలను మార్చి 31 వరకు దాఖలు చేయాలి.
First published: