పింఛనుదారులు ప్రతి సంవత్సరం తాము బతికే ఉన్నామని తెలియజేస్తూ లైఫ్ సర్టిఫికెట్‌ను బ్యాంకులో లేదా పోస్టాఫీసులో సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది. లేని పక్షంలో పెన్షనర్లకు ప్రతినెలా పింఛను అందదు. సాధారణంగా వయోవృద్ధులు ప్రతి సంవత్సంర నవంబర్ 30లోగా జీవన్ ప్రమాణ్ పత్ర సమర్పించాలి. అయితే ఈసారి లైఫ్ సర్టిఫికెట్ సమర్పణకు గడువును పెంచింది కేంద్ర ప్రభుత్వం. డిసెంబర్ 31 వరకు జీవన ప్రమాణ పత్రాన్ని పింఛనుదారులు సబ్‌మిట్ చేసుకోవచ్చని కేంద్రం తాజాగా ప్రకటించింది. ఇప్పటివరకు ఇంకా లైఫ్ సర్టిఫికెట్‌ను సబ్‌మిట్ చేయని పెన్షనర్లకు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు.
కరోనా కేసులు మళ్లీ పెచ్చరిల్లుతున్న నేపథ్యంలో వృద్ధులు బయటికి వెళ్లాలంటేనే హడలిపోతున్నారు. గడువు పెంచకపోతే వందల మంది పింఛనుదారులు బ్యాంకులో క్యూ కట్టే అవకాశం ఉంది. దీని వల్ల కరోనా మరింత పెరిగే ప్రమాదముంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని 30 రోజుల పాటు లైఫ్ సర్టిఫికెట్ సబ్‌మిషన్ గడువును పెంచుతున్నట్లు కేంద్రం తెలిపింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్ & పెన్షనర్స్ వెల్ఫేర్ (DoPPW) తన ఆఫీస్ మెమోరాండమ్‌లో లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. పదవీ విరమణ చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జీవిత ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించడానికి భౌతికంగా బ్యాంకు శాఖలను సందర్శించవలసి ఉంటుందని డీఓపీపీడబ్ల్యూ (DoPPW) పేర్కొంది. పెన్షన్ కోసం వీరంతా కూడా ప్రస్తుతం పొడిగించిన గడువులోగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది.
ఈ వ్యవధిలో పింఛనుదారులందరూ పెన్షన్ డిస్బర్సింగ్ అథారిటీల (పీడీఏ) నుంచి నిరంతరాయంగా పెన్షన్ అందుకుంటారు. లైఫ్ సర్టిఫికేట్‌లను పొందుతున్నప్పుడు బ్యాంకు శాఖల వద్ద రద్దీ లేకుండా ఉండేలా చర్యలు తీసుకున్నట్లు పీడీఏ పేర్కొంది. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించేలా మాస్కులు ధరించేలా చర్యలు చేపట్టనున్నట్టు తెలిపింది.
80 ఏళ్లు పైబడిన పింఛనుదారులు ప్రతి సంవత్సరం అక్టోబరు 1 నుంచి లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించవచ్చు. ఇతర ప్రభుత్వ పెన్షనర్లు ప్రతి సంవత్సరం నవంబర్ 1 నుంచి ఈ పత్రాన్ని సమర్పించవచ్చు. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్, 1995 నుంచి పెన్షన్ పొందుతున్న వారు ఏడాది పొడవునా ఒక సంవత్సరం ముగిసేలోపు ఎప్పుడైనా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు. పింఛనుదారులు నేరుగా బ్యాంకు ద్వారా గానీ, జీవన్ ప్రమాణ్ వెబ్‌సైట్ (https://jeevanpramaan.gov.in/) లేదా యాప్ ద్వారా డిజిటల్ విధానంలో గానీ సర్టిఫికెట్లను సమర్పించవచ్చు.
డోర్‌స్టెప్ బ్యాంకింగ్ అనేది లైఫ్ సర్టిఫికేట్‌లను సమర్పించడానికి మరొక మార్గం. పెన్షనర్లు పోస్ట్‌మ్యాన్ లేదా సంబంధిత అధికారి ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. అంతేకాదు లైఫ్ సర్టిఫికెట్ల సమర్పణ ప్రక్రియను సులభతరం చేయడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్ల కోసం వీడియో కాలింగ్ సదుపాయాన్ని ప్రారంభించింది. ఈ వీడియో లైఫ్ సర్టిఫికేట్ సేవతో కస్టమర్‌లు ఎస్‌బీఐ సిబ్బందితో వీడియో కాల్‌ని షెడ్యూల్ చేసుకోవచ్చు. ఈ సర్వీస్ తో బ్యాంక్ బ్రాంచ్‌ను సందర్శించాకుండానే లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించే ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఈ ప్రక్రియలో వీడియో కాల్ సమయంలో పెన్షనర్లు ఎస్‌బీఐ ఏజెంట్‌కు కనిపిస్తే చాలు. అలాగే వారు పాన్ కార్డ్‌ని సిద్ధంగా ఉంచుకోవాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Life Insurance, Pensioners