దిగ్గజ ఆన్లైన్ పేమెంట్ ప్లాట్‌ఫామ్ ‘గూగుల్ పే(Google Pay)’ త్వరలోనే యూపీఐ పేమెంట్లను వేగవంతం చేసే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. యూపీఐ ట్రాన్సాక్షన్ల కోసం సరికొత్త ‘ట్యాప్ టు పే’ ఫీచర్‌ను ప్రారంభించేందుకు కంపెనీ పైన్ ల్యాబ్స్‌తో జతకట్టింది. ఈ కొత్త యూపీఐ ఫీచర్ ద్వారా ఇన్స్టంట్ డిజిటల్ పేమెంట్ సర్వీసులను అందించాలనే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం గూగుల్ పే పేమెంట్లకు ఎక్కువ స్టెప్స్ ఫాలో కావాల్సి వస్తుంది. దీనికి ఎక్కువ సమయం పడుతుంది. అయితే, ఈ స్టెప్స్‌ను తగ్గించడమే లక్ష్యంగా కొత్త ఫీచర్‌ను రూపొందిస్తుంది. ఒక్క ట్యాప్‌తోనే పేమెంట్ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటుంది. క్రెడిట్(Credit), డెబిట్ కార్డ్(Debit Card) పేమెంట్లకు ‘ట్యాప్ టు పే(Tap To Pay)’ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. సింగిల్ టచ్‌తో పేమెంట్ క్షణాల్లో పూర్తవుతుంది. ఏ యూపీఐ వినియోగదారులకైనా ఈ ఫీచర్(Feature) అందుబాటులో ఉంటుంది. గూగుల్ ఈ ఫీచర్ కోసం రిలయన్స్ రిటైల్‌తో ఒప్పందం చేసుకుంది. తొలుత ఈ విధానాన్ని ఫ్యూచర్ రిటైల్, స్టార్‌బక్స్ రిటైల్ స్టోర్లలో పేమెంట్లకు ఉపయోగించనుంది.
గూగుల్ ట్యాప్ టు పే ఎలా పని చేస్తుంది?
మీరు ఏ రిటైల్ స్టోర్‌లోనైనా చెల్లింపు చేయాల్సి వస్తే, POS టెర్మినల్‌లో ఫోన్‌ను ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత -మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో యూపీఐ పిన్ ఎంటర్ చేసి పేమెంట్‌ను కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. యూజర్ యూపీఐ పిన్‌ను ఎంటర్ చేసిన వెంటనే పేమెంట్ పూర్తవుతుంది. అయితే, క్యూఆర్ స్కానింగ్ పద్ధతి మాదిరిగానే దీనికి కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీ తప్పనిసరి.
మీ చెల్లింపు ప్రక్రియను ఎలా ప్రభావితం చేస్తుంది?
‘ట్యాప్ టు పే’ చెల్లింపు పద్ధతి తక్కువ స్టెప్స్‌లోనే యూపీఐ లావాదేవీలను పూర్తయ్యేలా చేస్తుంది. అంతేకాదు, ట్రాన్సాక్షన్ టైమ్‌ను గణనీయంగా తగ్గిస్తుంది. మీరు క్యూఆర్ కోడ్ కోసం యాప్‌లో కెమెరాను ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయవలసిన అవసరం ఉండదు. ప్రక్రియ ఆటోమేటిక్‌గా చాలా వేగంగా పూర్తవుతుంది. ఈ కొత్ ఫీచర్‌పై గూగుల్ పే, నెక్స్ట్ బిలియన్ యూజర్ ఇనిషియేటివ్స్ బిజినెస్ హెడ్ సజిత్ శివానందన్ మాట్లాడుతూ, ‘‘భారతదేశంలో ఫిన్‌టెక్ రంగం గణనీయంగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం యూపీఐతో రియల్‌టైమ్ పేమెంట్లు జరిపే క్రమంలో సమయం ఎక్కువగా తీసుకుంటుంది.
అందుకే, ట్రాన్సాక్షన్ టైమ్‌ను గణనీయంగా తగ్గించేందుకు కొత్త ఫీచర్‌పై పనిచేస్తుంది. సింగిల్ ట్యాప్‌లో యూపీఐ చెల్లింపులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం, రిటైల్ అవుట్‌లెట్లలో పేమెంట్ సెక్షన్ వద్ద క్యూ అధికంగా ఉంటోంది. దీంతో, కస్టమర్ల విలువైన సమయం వృధా అవుతుంది. ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే ఇబ్బందులు చాలా వరకు తగ్గుతాయి. కార్డ్‌ల ద్వారా కాకుండా POS మెషిన్ ద్వారా చేసే డిజిటల్ చెల్లింపులు మరింత సురక్షితం. ఈ కొత్త ఫీచర్‌ను రూపొందించడానికి పైన్ ల్యాబ్స్ సహకారం అందించడం చాలా సంతోషంగా ఉంది. భారతదేశానికి ఈ మొట్టమొదటి ఆవిష్కరణను తీసుకురావడం పట్ల గర్వపడుతున్నాం.”అని అన్నారు.
యూపీఐ ట్రాన్సాక్షన్లు మరింత బలోపేతం
ఇక, ఈ కొత్త ఫీచర్‌పై పైన్ ల్యాబ్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ కుష్ మెహ్రా మాట్లాడుతూ ‘‘డిసెంబర్ 2021లో కేవలం ఒక నెలలోనే రూ. 8.26 లక్షల కోట్ల విలువైన యూపీఐ ట్రాన్సాక్షన్లు జరిగాయి. ఈ ట్రాన్సాక్షన్లను మరింతగా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అందుకు అనుగుణంగా గూగుల్‌పే మాతో జతకట్టినందుకు సంతోషిస్తున్నాము. త్వరలోనే ప్రవేశపెట్టనున్న ‘ట్యాప్ టు పే’ యూపీఐ ట్రాన్సాక్షన్లను మరింత బలోపేతం చేస్తుందని ఆశిస్తున్నాం. కాంటాక్ట్‌లెస్, డిజిటల్ చెల్లింపులను ఇష్టపడే యువత దీన్ని బాగా ఉపయోగించుకుంటారని నమ్ముతున్నాము.’’ అని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.