కరోనా ప్రభావం ఇంకా ముగియలేదు. థర్డ్ వేవ్ ముప్పు పొంచే ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటుచేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా కోవిడ్ నిర్ధారణకు కీలకంగా మారిన పరికరాల ధరలపై దృష్టిసారించింది. తాజాగా మార్కెట్లో ఇష్టారాజ్యంగా పెరిగిపోతున్న ఈ పరికరాల ధరలపై కొరడా ఝళిపించింది. ఇందులో భాగంగా ఆక్సిమీటర్లు, డిజిటల్ థర్మామీటర్లతో సహా ఐదు క్లిష్టమైన వైద్య పరికరాలపై.. తయారీ దారులు పొందే గరిష్ట లాభాలను (ట్రేడ్ మార్జిన్) 70 శాతానికి పరిమితం చేసింది. ఫలితంగా మార్కెట్లో ఈ వస్తువులు చౌకగా లభిస్తాయి.
పల్స్ ఆక్సీమీటర్, బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్ మెషిన్, నెబ్యూలైజర్, డిజిటల్ థర్మామీటర్, గ్లూకోమీటర్ పరికరాలపై ట్రేడ్ మార్జిన్‌ను.. జాతీయ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ 70 శాతానికి పరిమితం చేసింది. ఫలితంగా కోవిడ్ చికిత్సలో కీలక పాత్ర పోషించే ఈ పరికరాల ధరలు తగ్గనున్నాయి. జులై 20 నుంచి ఈ ధరలు అమల్లోకి రానున్నాయి. వచ్చే ఏడాది (2022) జనవరి 31వరకు గానీ లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు గానీ ఈ ధరలు అమలులో ఉంటాయి.
పల్స్ ఆక్సీమీటర్‌కు భారీ డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. కోవిడ్ బాధితులలో ఎక్కువ భాగం శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల రక్తంలో ఆక్సిజన్ స్థాయులు తెలుసుకోవడానికి పల్స్ ఆక్సీమీటర్ వాడకం తప్పనిసరైంది. దీన్ని ఆసరాగా తీసుకుని పల్స్ ఆక్సీమీటర్ రేటును ఇబ్బడిముబ్బడిగా పెంచివేశారు. సుమారు రెండువేల రూపాయలు పెట్టినా మంచి బ్రాండెడ్ ఆక్సీమీటర్ దొరకని పరిస్థితి తలెత్తింది. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్‌లో పల్స్ ఆక్సీమీటర్లకు డిమాండ్ భారీగా పెరిగింది.
ఇక కోవిడ్ నిర్ధారణ, చికిత్సలో కీలకపాత్ర పోషించే పరికరాలపై ఉత్పత్తిదారులు తమ మార్జిన్లను ఇష్టారాజ్యంగా నిర్ణయించుకుంటున్నారు. ఈ అంశాలను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం.. ఔషధ ధరల నియంత్రణల చట్టం- 2013 ప్రకారం ట్రేడ్ మార్జిన్లను నియంత్రించడానికి చర్యలు తీసుకుంది. ఇక జూలై 20 లోగా ఎంఆర్‌పిని మార్చని అమ్మకందారులు 15 శాతం వడ్డీతో పాటు 100 శాతం ఓవర్ ఛార్జ్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
మరోవైపు బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోతుండడంతో అందుకు సంబంధించిన మెడిసిన్ ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. కోవిడ్ టెస్ట్ కిట్ల తయారీకిఉపయోగించే ముడి పదార్థాలపై కస్టమ్స్ సుంకం మినహాయింపు 2021 సెప్టెంబర్ 30 వరకు ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ జూలై 12న విడుదల చేసిన నోటిఫికేషన్లో తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business, Covid care