ఇటీవల స్మార్ట్ ఫోన్లు పేలుతున్న ఘటనలు అడపాదడపా వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి వార్తల వల్ల సదరు సంస్థ కస్టమర్ల నుంచి వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సి వస్తోంది. నెలరోజుల క్రితం తన జేబులో ఉన్న వన్ప్లస్ నార్డ్ 2 5జీ స్మార్ట్ ఫోన్ పేలిందని ఢిల్లీకి చెందిన గౌరవ్ గులాటీ అనే న్యాయవాది ఒకరు చట్టపరమైన ఫిర్యాదు చేశారు. ఫోన్ పేలిన సమయంలో దాన్ని ఛార్జ్ చేయట్లేదని, డివైజ్ వినియోగంలో లేదని స్పష్టం చేశారు. పేలుడు కారణంగా తన పొట్ట ప్రాంతంలో కాలిన గాయాలు అయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే అప్పుడు తమపై ఆరోపణలు చేసిన న్యాయవాదికి తాజాగా వన్ప్లస్ సంస్థ లీగల్ నోటీస్ జారీ చేసింది.
ఈ మేరకు ఢిల్లీ న్యాయవాది గౌరవ్ గులాటీ తనకు వన్ప్లస్ సంస్థ జారీ చేసిన లీగల్ నోటీసును ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. న్యాయం చేయాలని కోరినందుకు నేను చెల్లించాల్సిన మూల్యం ఇదే అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే తమ సంస్థకు, తమ ఉత్పత్తులకు వ్యతిరేకంగా చేసే ఆరోపణలపై వన్ప్లస్ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. అటువంటి పరువునష్టం కలిగించే ప్రకటనలు లేదా వీడియోలు ప్రచురించడం సబబు కాదని అభిప్రాయపడింది. తక్షణమే అలాంటి ప్రకటనలు నిలిపివేయాలని, గతంలో తమ ఉత్పత్తులకు సంబంధించి దెబ్బతీసేలా చేసిన ట్వీట్లను తొలగించాలని డిమాండ్ చేసింది.
వన్ప్లస్ జారీ చేసిన ప్రకటనలో.. తమ కంపెనీపై తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తికి తాము చట్టపరమైన నోటీస్ పంపినట్లు పేర్కొంది. ఫిర్యాదుదారుడు లేవనెత్తిన సమస్యను పరిష్కరించడానికి చట్టపరంగా ముందుకెళ్తామని తెలిపింది. గులాటీ తన ట్విట్టర్లో లీగల్ కాపీని పంచుకున్నారని... ఈ కాపీ వన్ప్లస్ మొబిటెక్ క్రియేషన్స్, వన్ప్లస్ ఇండియా అనుబంధ సంస్థ లీగల్ భాగస్వామి ద్వారా నోటీసు పంపినట్లు చూపుతోందని వివరించింది.
వన్ప్లస్ నార్డ్ 2 5జీ స్మార్ట్ ఫోన్ పేలుడుకు సంబంధించి వినియోగదారుడు మీడియాకు తప్పుడు ప్రకటనలు ఇచ్చారని వన్ప్లస్ ఆరోపించింది. ఈ ప్రకటనలు తమ కంపెనీ ప్రతిష్టకు హాని కలిగించే విధంగా ఉన్నాయని, తమను కించపరిచేలా ఉన్న కంటెంట్ వల్ల తమ వినియోగదారులు తమను అపార్థం చేసుకునే అవకాశం ఉందని వన్ప్లస్ అభిప్రాయపడింది.
అంతేకాకుండా తమ ఉత్పత్తుల గురించి చేసిన ట్వీట్లను తొలగించాలని న్యాయవాదికి వన్ప్లస్ సంస్థ స్పష్టం చేసింది. తన వైఖరిని స్పష్టం చేస్తూ మీడియా సంస్థలకు రాతపూర్వకంగా కమ్యూనికేషన్ నోటీస్ జారీ చేయాలని న్యాయవాదికి సూచించింది. తమ సంస్థను అగౌరవపరిచేలా కంటెంట్ వ్యాప్తి చేసినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. తమ వినియోగదారుడు గులాటీని సంప్రదించడానికి ప్రయత్నించగా అనివార్య కారణాల వల్ల అతడిని చేరుకోలేకపోయామని వన్ప్లస్ తెలిపింది. అయితే తమ బృందం న్యాయవాది గులాటీని సంప్రదించగా ఆయన తమ స్మార్ట్ ఫోన్ వినియోగంపై అసంతృప్తిగా ఉన్నట్లు కనుగొన్నట్లు వన్ప్లస్ పేర్కొంది.
సాక్ష్యం కోసం ఆయన పేలుడుకు సంభవించిన స్మార్ట్ ఫోన్ను తమ బృందానికి ఇచ్చేందుకు నిరాకరించినట్లు ప్రకటనలో వన్ప్లస్ తెలిపింది. కాగా గతంలోనూ బెంగళూరుకు చెందిన ఓ మహిళ హ్యాండ్ బ్యాగ్లో వన్ప్లస్ ఫోన్ పేలగా.. అది తయారీ లేదా డిజైన్ లోపం వల్ల సంభవించలేదని వన్ప్లస్ సంస్థ వివరణ ఇచ్చింది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.