Ola Electric Scooters: ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ ఏటా పెరుగుతోంది. టాప్ ఆటోమొబైల్ కంపెనీలతో పాటు స్టార్టప్స్ కూడా వీటి తయారీపై దృష్టి పెట్టాయి. ఈ క్రమంలో ఇప్పటికే మార్కెట్లోకి రిలీజ్ అయిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్స్(Ola Electric scooters) భారీగా పెరుగుతున్నాయి. అక్టోబర్ నెలలో 20 వేల ఈ-స్కూటర్లను అమ్మినట్లు కంపెనీ తాజాగా వెల్లడించింది. భవిష్ అగర్వాల్ నేతృత్వంలోని ఓలా ఎలక్ట్రిక్, గత నెల EVల అమ్మకాల్లో టాప్ ప్లేస్‌కు చేరింది. ‘అక్టోబర్‌లో 20వేల ఓలా ఈ-స్కూటర్లు అమ్ముడయ్యాయి. ఇండియన్ EV కంపెనీల విషయంలో ఇది ఒక రికార్డు. ఓలా ఎలక్ట్రిక్ సేల్స్ గత నెలలో 60% వృద్ధి చెందాయి.’ అని కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ పేర్కొన్నారు.
ఓలా ఎలక్ట్రిక్ నుంచి మార్కెట్లోకి వచ్చిన S1, S1 ప్రో మోడళ్లకు ఫెస్టివల్ సీజన్లో మంచి డిమాండ్ కనిపించింది. దీంతో అక్టోబర్‌లో విక్రయించిన ఈ-స్కూటర్లలో కంపెనీ ఏకంగా 60% వృద్ధిని నమోదు చేసింది. అక్టోబర్‌లో మొత్తం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల పరిశ్రమ అమ్మకాలు దాదాపు 30% పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. రోజువారీ అమ్మకాలతో పోలిస్తే.. నవరాత్రుల సమయంలో ఓలా ఈవీల సేల్స్ నాలుగు రెట్టు పెరిగాయని కంపెనీ వెల్లడించింది. అలాగే దసరా సమయంలో సేల్స్ 10 రెట్లు పెరిగాయని ఓలా ఒక ప్రకటనలో పేర్కొంది.
ఆ కంపెనీ సేల్స్ కూడా..
ఓలా ఎలక్ట్రిక్ తర్వాత భారతదేశంలో రెండో అతిపెద్ద EV తయారీదారు అయిన ఒకినావా ఆటోటెక్, అక్టోబర్‌లో 17,531 సేల్స్ నమోదు చేసింది. నెలవారీ ప్రాతిపదికన ఈ సంస్థ అమ్మకాల్లో ఏకంగా 111.8% వృద్ధిని సాధించింది. సెప్టెంబర్‌లో ఓలా ఎలక్ట్రిక్ 9,649 యూనిట్లను విక్రయించగా, ఒకినావా అదే నెలలో 8,277 యూనిట్లను విక్రయించింది.
Business Idea: కొత్తగా వ్యాపారం చేయాలనుకుంటున్నాారా? అయితే.. ఈ బెస్ట్ ఆప్షన్ పై ఓ లుక్కేయండి
లైట్ ఎడిషన్
ఓలా ఎలక్ట్రిక్ అక్టోబర్ 22న ఎస్1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. ఓలా ఎస్1, ఓలా ఎస్1 ప్రో మోడళ్లకు ఇది మిడిల్ వెర్షన్‌గా మార్కెట్లోకి వచ్చింది. ఈ స్కూటర్ ధర రూ.84,999. అయితే దీపావళికి ముందు లేదా దీపావళి రోజున బుక్ చేసుకున్న కస్టమర్లు దీన్ని రూ.79,999కి సొంతం చేసుకుంటారని కంపెనీ ప్రకటించింది. ఓలా ఎస్1 ఎయిర్ డెలివరీలు 2023 ఏప్రిల్‌లో ప్రారంభమవుతాయి. మరోవైపు, ఓలా ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రతిష్టాత్మకమైన ఫోర్ వీలర్ ప్రాజెక్ట్‌ను కూడా ఆవిష్కరించింది. అత్యుత్తమ టెక్నాలజీ, పనితీరు, డిజైన్‌తో ఎలక్ట్రిక్ కారును ఇండియాలో లాంచ్ చేసే ప్లాన్స్ కొనసాగుతున్నాయి.
ఇంటర్నేషనల్ మార్కెట్లోకి..
ఓలా ఎలక్ట్రిక్ గత నెలలో నేపాల్‌కు చెందిన సీజీ మోటార్స్‌తో (CG Motors) ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఎంఓయూతో ఇంటర్నేషనల్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నట్లు ప్రకటించింది. సీజీ మోటార్స్ నేపాల్‌లో ఓలా S1, S1 ప్రో స్కూటర్ల డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించనుంది. ఈ స్కూటర్లు వచ్చే త్రైమాసికంలో నేపాల్‌లో అందుబాటులో ఉంటాయి. ఓలా తర్వాతి దశలో లాటిన్ అమెరికా, ఆసియా, ఈయూ మార్కెట్లలోకి ప్రవేశించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. మొత్తం ఐదు ఇంటర్నేషనల్ మార్కెట్లలో సత్తా చాటాలని కంపెనీ ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.