ఓలా (Ola) ఎలక్ట్రిక్ కంపెనీ ఇండియాలో టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్ మ్యానుఫ్యాక్చరర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అత్యధిక సేల్స్ నమోదు చేసింది. అయితే తాజాగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఫ్రంట్ ఫోర్క్ (S1 Front Fork) ను రీప్లేస్ చేయడానికి S1 రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల కాలంలో, ఓలా S1 స్కూటర్ ఫ్రంట్ సస్పెన్షన్ విరిగిపోయిన ఘటనలు వరుసగా చోటు చేసుకున్నాయి. ఓలా ఎలక్ట్రిక్ లేటెస్ట్ అప్‌డేట్ పూర్తి వివరాలు ఇలా
* ఆరోపణలు కొట్టిపారేసిన ఓలా ఎలక్ట్రిక్
Ola S1 భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి. ఇది Ather 450X, Vida V1, బజాజ్ చేతక్, TVS iQube వంటి వాటికి గట్టి పోటీ ఇస్తోంది. Ola ఇప్పటి వరకు S1 రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు 200,000 యూనిట్లకు పైగా విక్రయించింది. ఓలా S1 స్కూటర్ ఫ్రంట్ ఫోర్క్ ఆర్మ్ సెక్యూరిటీపై ఇటీవల చాలా ఫిర్యాదులు, ఆరోపణలు విన్నట్లు కంపెనీ తన అధికారిక ప్రకటనలో తెలిపింది. అవన్నీ నిరాధారమైనవని హామీ ఇస్తున్నట్లు పేర్కొంది.
ఓలా ఎలక్ట్రిక్ ఓ ప్రకటనలో..‘ఓలాలో మా స్కూటర్లలోని అన్ని భాగాలు, ఫ్రంట్ ఫోర్క్ ఆర్మ్ సహా, ఎక్స్‌ట్రీమ్ కండిషన్స్‌లో టెస్ట్ చేస్తాం. వాహనాల ద్వారా ఎదురయ్యే లోడ్ కంటే మరింత ఎక్కువ లోడ్‌ను తట్టుకునేలా రూపొందిస్తాం. అయితే, మా నిరంతర ఇంజినీరింగ్, డిజైన్ మెరుగుదల ప్రక్రియలో భాగంగా, మన్నిక, బలాన్ని మరింత పెంచడానికి ఇటీవలే ఫ్రంట్ ఫోర్క్ డిజైన్‌ను అప్‌గ్రేడ్ చేశాం.’ అని పేర్కొంది.
* ఫ్రంట్ ఫోర్క్ అప్‌గ్రేడ్
కొత్త ఫ్రంట్ ఫోర్క్‌కు అప్‌గ్రేడ్ చేసుకునేందుకు తమ కస్టమర్లకు ఆప్షన్ ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది. పాత ఫ్రంట్ సస్పెన్షన్‌ను రీప్లేస్ చేయడం కోసం కస్టమర్‌లు తమ సమీపంలోని ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్ లేదా సర్వీస్ సెంటర్‌లో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు.
రీప్లేస్‌మెంట్‌కు ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. అపాయింట్‌మెంట్ విండో మార్చి 22 నుంచి ఓపెన్ అవుతుంది. అపాయింట్‌మెంట్ బుకింగ్ కోసం అవసరమైన పూర్తి సమాచారంతో కంపెనీ కస్టమర్‌లను సంప్రదిస్తుంది.
* Ola S1 రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఆరు వేరియంట్‌లు ఉన్నాయి. వాటి ధరలు (FAME II సబ్సిడీతో).
ఓలా S1 ప్రో వేరియంట్‌లో 4kWh బ్యాటరీ ఉంటుంది, ఇది 181km రేంజ్‌ను అందిస్తుంది. దీని ధర రూ 1.31 లక్షలుగా ఉంది. S1 వేరియంట్‌లో 2kWh బ్యాటరీతో 91km రేంజ్ అందించే స్కూటర్ రూ.లక్షకు లభిస్తుంది. ఓలా S1 వేరియంట్‌లో 3kWh బ్యాటరీతో వచ్చే స్కూటర్ 141km రేంజ్ అందిస్తుంది. దీని ధర రూ 1.10 లక్షలుగా ఉంది.
అదే విధంగా ఓలా S1 ఎయిర్ వేరియంట్ ధర రూ.85 వేలుగా ఉంది. ఇందులో 2kWh బ్యాటరీ ఉంటుంది, 85km రేంజ్ వస్తుంది. ఇందులోనే 3kWh బ్యాటరీతో వచ్చే స్కూటర్ ధర రూ.లక్షగా ఉంది. ఇది 125km రేంజ్ ఇస్తుంది. అలానే S1 Airలో 4kWh బ్యాటరీతో వచ్చే స్కూటర్ 165km రేంజ్ అందిస్తుంది. దీని ధర రూ 1.10 లక్షలుగా కంపెనీ పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Auto, Ola, Ola electric, Ola Electric Scooter