పెరుగుతున్న ఇంధన ధరలు, పర్యావరణ పరిరక్షణ వంటి లక్ష్యాలతో ఎలక్ట్రిక్ వాహనాలవైపు(Electric Vehicles) ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి, వినియోగాన్ని ప్రోత్సహించేలా భారత ప్రభుత్వం(Indian Government) ప్రత్యేక రాయితీలను(Special Discounts) కూడా ప్రకటించింది. కొన్ని సంవత్సరాలుగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్(Demand) పెరిగింది. పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఈ రంగంలో అడుగు పెడుతున్నాయి. అయితే ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాలు (Electric Vehicles) తరచూ అగ్నిప్రమాదాలకు(Fire Accidents) గురవుతున్న ఘటనలు వినియోగదారుల్లో ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. దీనిపై ట్విట్టర్(Twitter) వేదికగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. జరుగుతున్న ప్రమాదాలు దురదృష్టకరమని చెప్పారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) ఎలక్ట్రిక్ వాహనాల గురించి, భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల(Electric Vehicles) వినియోగాన్ని పెంచడంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను ఇప్పటికే కొన్ని వేదికలపై వివరించారు. అయితే ఇటీవల దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలలో మంటలు చెలరేగడం వంటి ఘటనలు వరుసగా చోటు చేసుకొన్నాయి. దీనిపై గడ్కరీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మంటల్లో ఎలక్ట్రిక్ వాహనాలు దగ్ధమవుతున్న ఘటనలను దురదృష్టంగా పేర్కొన్నారు. ఇలాంటి ప్రమాదాలకు కారణం కంపెనీల నిర్లక్ష్యమని తేలితే భారీ జరిమానా విధిస్తామన్నారు. ఈ ప్రమాదాలపై విచారణ చేయడమే కాకుండా నివారణ చర్యలను సిఫార్సు చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. కమిటీ నివేదికల ఆధారంగా ఎలక్ట్రిక్ వాహనాల నాణ్యత ప్రమాణాలను, వాహన మార్గదర్శకాలు రూపొందిస్తామని స్పష్టం చేశారు. డిఫెక్టివ్ బ్యాచ్ వెహికల్స్ ఏవైనా ఉంటే కంపెనీలు ముందుగానే వెనక్కి తీసుకునే చర్యలు చేపట్టవచ్చని సూచించారు.
We have constituted an Expert Committee to enquire into these incidents and make recommendations on remedial steps.
Based on the reports, we will issue necessary orders on the defaulting companies. We will soon issue quality-centric guidelines for Electric Vehicles.
— Nitin Gadkari (@nitin_gadkari) April 21, 2022
ఇటీవల చోటుచేసుకొన్న ఎలక్ట్రిక్ వెహికల్ అగ్నిప్రమాదంలో.. జితేంద్ర ఈవీ అనే కంపెనీకి చెందిన 20 సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. స్కూటర్లను కంటైనర్‌లో తరలిస్తుండగా హఠాత్తుగా మంటలు వ్యాపించాయి. ఈ స్కూటర్లను నాసిక్‌లోని జితేంద్ర ఈవీ కంపెనీకి సంబంధించిన ఫ్యాక్టరీ నుంచి రవాణా చేస్తున్నట్లు తెలిసింది. కంటైనర్‌లో మొత్తం 40 జితేంద్ర ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉండగా.. పై డెక్‌లో ఉన్న 20 స్కూటర్లు మంటల్లో కాలిపోతున్నట్లు వీడియోలలో చూడవచ్చు. ఈ సంఘటన ఏప్రిల్ 9వ తేదీన జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
Attack On Jawans Bus : కశ్మీర్ లో మరో పుల్వామా తరహా దాడి..జవాన్ల బస్సుపై ఉగ్రదాడి
పూణెలోని లోహెగావ్ ప్రాంతంలో ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కూడా మంటలు చెలరేగాయి. దీనికి సంబంధించిన 31 సెకన్ల క్లిప్ కూడా వైరల్ అయింది. రద్దీగా ఉండే వాణిజ్య ప్రాంతంలో రోడ్డు పక్కన ఆపి ఉంచిన స్కూటర్ పూర్తిగా మంటల్లో చిక్కుకున్నట్లు వీడియోలో కనిపించింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. విచారణ కొనసాగుతోంది. థర్మల్ రన్ అవే(Thermal Runaway) కారణంగా మంటలు వ్యాపించి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఇందులో లిథియం- అయాన్ బ్యాటరీ దెబ్బతిన్నప్పుడు లేదా షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు దాని లోపల ఎక్సో థర్మిక్ రియాక్షన్ ఏర్పడుతుంది. మంటల్లో ఉన్న లిథియం అయాన్ బ్యాటరీని ఆర్పడం కష్టతరం. నీటిని వినియోగిస్తే ఇది వెంటనే హైడ్రోజన్ వాయువు, లిథియం-హైడ్రాక్సైడ్ ను ఉత్పత్తి చేస్తుంది. హైడ్రోజన్ వాయువుకు విపరీతమైన మండే గుణం ఉండటంతో సమస్య తీవ్రమవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.