ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ(Electric Vehicles Manufacturing) పరిశ్రమను స్థాపించాలని ఎలాన్ మస్క్‌ను(Elon Musk) కోరారు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్గరీ(Nitin Gadkari). భారతదేశంలో ఆటోమొబైల్(Auto Mobile) పరిశ్రమకు మంచి అవకాశాలు ఉన్నాయని గడ్గరీ చెప్పారు. ట్విట్టర్‌ను(Twitter) కొనుగోలు చేసి వార్తల్లో నిలుస్తున్న ఎలాన్ మస్క్ ఇప్పటికే టెస్లా కంపెనీతో ఇదే బిజినెస్‌లో(Business) ఉన్నారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఓ ప్రైవేట్(Private) కార్యక్రమంలో గడ్గరీ మాట్లాడుతూ.. ఎలాన్ మస్క్ భారతదేశంలో ఇ-వాహనాలను(Electric Vehicles) తయారు చేయడానికి స్వాగతం పలుకుతున్నామని, అయితే టెస్లా యజమాని చైనాలో(China) వాహనాలను తయారు చేసి ఇక్కడ అమ్మాలని చూస్తే మాత్రం.. అది మంచి ప్రతిపాదన కాదని చెప్పారు. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలపై పెద్ద మొత్తంలో ట్యాక్స్‌లు, ఛార్జీలు, హై డ్యూటీలపై టెస్లా ఆందోళన వ్యక్తం చేసిన విషయంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ గడ్గరీ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘భారతదేశంలో టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడానికి సిద్ధంగా ఉంటే, ఎటువంటి సమస్య లేదు. మన దేశంలో అన్ని సామర్థ్యాలు ఉన్నాయి. విక్రేతలు అందుబాటులో ఉన్నారు. అన్ని రకాల సాంకేతికతలు ఉన్నాయి. అందువల్ల ఎలాన్ మస్క్ దీనిపై దృష్టి సారించి ఖర్చు తగ్గించుకోవచ్చు’ అని గడ్గరీ తెలిపారు. భారతదేశంలో తయారీని ప్రారంభించాలని టెస్లాను ఆహ్వానించిన కేంద్ర మంత్రి, ఇండియా ఒక భారీ మార్కెట్ అని, ఎగుమతులకు వీలుగా పోర్టుల వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని హైలైట్ చేశారు.
‘ఎలాన్ మస్క్ భారత్‌లో పరిశ్రమలు స్థాపించవచ్చు. మాకు ఎటువంటి సమస్య లేదు. కానీ ఆయన తమ కంపెనీ వాహనాలను చైనాలో తయారు చేసి భారతదేశంలో విక్రయించాలనుకుంటున్నారు. దీన్ని మాత్రం మేం ఒప్పుకోం. ఈ ప్రతిపాదన దేశానికి మంచిది కాదు. భారత్‌లో తయారీ విధానానికి అనుకూలంగా మన దేశంలోనే వాహనాలను తయారు చేయవచ్చు. భారతదేశంలో మస్క్‌కు మంచి మార్కెట్ లభిస్తుంది. ఎందుకంటే ఇండియన్ మార్కెట్ చాలా పెద్దది. ఇది భారత్‌తో పాటు ఆయనకు కూడా ప్రయోజనకరం’ అని గడ్గరీ పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో ఇ-వాహనాల రంగంలో విపరీతమైన వృద్ధిని కూడా కేంద్రమంత్రి ప్రస్తావించారు.
చైనాలో అందుబాటులో ఉన్న క్వాలిటీ వెండార్స్, ఆటోమొబైల్ విడిభాగాలు భారతదేశంలో కూడా ఉన్నాయని గడ్గరీ చెప్పారు. భారతదేశంలో తయారు చేసి, దేశంలోనే వాహనాలను విక్రయించడం అనేది మస్క్‌కు మరింత సులభమని చెప్పారు. ఈ విధానంలో ఆయనకు మంచి లాభాలు వస్తాయన్నారు. ఇండియా ముడి చమురుపై ఆధారపడటం గురించి కూడా కేంద్ర మంత్రి మాట్లాడారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.
‘ముడి చమురు దిగుమతి కారణంగా కాలుష్య సమస్యలతో పాటు క్లిష్టమైన ఆర్థిక సవాళ్లను కూడా ఎదుర్కొంటున్నాం. భారత్ రూ.8 లక్షల కోట్ల పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుంది. వీటికి ఏదైనా ప్రత్యామ్నాయాన్ని కనుగొనాల్సి ఉంది. ప్రభుత్వం ఈ ఆప్షన్స్‌పై పని చేస్తోంది.’ అని గడ్గరీ చెప్పారు. బయోవేస్ట్, ఇతర పద్ధతుల నుంచి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిపై భారతదేశంలో కొనసాగుతున్న పరిశోధనల గురించి కూడా గడ్గరీ మాట్లాడారు. కొన్నేళ్లలో గ్రీన్ హైడ్రోజన్‌కు సంబంధించినంతవరకు భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంటుందని పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: E vehicles, Elon Musk, Nitin Gadkari, Tesla Motors