ఉపాధి నిమిత్తం సొంతూళ్లను వదిలి పట్టణ ప్రాంతాలకు వెళ్లిన వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన వారు రేషన్ తీసుకునే విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వరుసగా కొన్ని నెలల పాటు రేషన్ తీసుకోకపోతే తెల్ల రేషన్ కార్డు రద్దవుతుంది. దీంతో అష్టకష్టాలు పడి కేవలం రేషన్ తీసుకునేందుకే సిటీ నుంచి మళ్లీ సొంతూరికి వెళ్లి తిరిగొస్తున్నారు. రేషన్ కార్డుకు ఆధార్ అనుసంధానం తర్వాత వలస జీవులు ఈ విషయంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయితే ఈ ఇబ్బందులను అధిగమించేందుకు గతంలోనే కేంద్ర ప్రభుత్వం ’వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్‘ స్కీమ్ ను తెరపైకి తీసుకువచ్చింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేశారు కూడా. తాజాగా ఈ విషయంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు.
దేశంలో ఉన్న 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 32 చోట్ల ఒకే దేశం - ఒకే రేషన్ కార్డు స్కీమ్ ను అమలు చేయబోతున్నామని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దీని కోసం అన్ని రాష్ట్రాల్లోనూ వలస వెళ్లిన వారి వివరాలను ఆరా తీస్తున్నామన్నారు. ఆయా రాష్ట్రాలకు వలస వచ్చిన వివరాలను కూడా అక్కడి ప్రభుత్వాలు సేకరించాల్సి ఉందన్నారు. త్వరలోనే ఈ ప్రక్రియను అమల్లోకి తీసుకువస్తామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దీంతో ఈ ప్రకటనపై వలస జీవులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూలీ నాలీ చేసుకుని బతికే తమకు రేషన్ కార్డు ద్వారా వచ్చే బియ్యమే దిక్కుగా ఉంటున్నాయనీ, ఈ స్కీమ్ అమల్లోకి వస్తే రేషన్ కార్డు విషయంలో ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు.
ఇదిలా ఉండగా.. పార్లమెంట్ లో బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వరుస పథకాలతో జెట్ స్పీడుతో ప్రసంగిస్తోంటే, మరో వైపు మార్కెట్లు కూడా ఫుల్ జోష్ మీదున్నాయి. నిర్మలమ్మ ప్రకటనలు భారత స్టాక్ మార్కెట్ కు కొత్త జోష్ ను తీసుకొచ్చాయి. మార్కెట్ బెంచ్ మార్క్ సూచీలు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హెల్త్ కేర్, ఆటోమొబైల్, బ్యాంకింగ్, ఐటీ వంటి వివిధ రంగాలకు సంబంధించి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనలతో సెన్సెక్స్ 900 పాయింట్లు లాభపడింది. దీంతో 47,263.30 వద్ద గరిష్ట స్థాయిని సూచీ చేరుకుంది. స్టాక్ మార్కెట్లో జోష్ పెరగడంతో ఇన్వెస్టర్లు ఊహించని రీతిలో లాభపడ్డారు. నిర్మలా సీతారామన్ ప్రసంగం మొదలు పెట్టిన గంటలోపే ఏకంగా 2.44 లక్షల కోట్లను ఇన్వెస్టర్లు ఆర్జించినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Budget 2021, Narendra modi, Nirmala sitharaman, Union Budget 2021