Nirav Modi: నీరవ్ మోడీ ఇక తప్పించుకోలేడు.. ఇండియాకు ఎప్పుడు అప్పగిస్తారు?

నీరవ్ మోదీ (File)

Nirav Modi: ఇంటర్ పోల్ కూడా నీరవ్ మోడీపై మనీ లాండరింగ్ కేసు దాఖలు చేసింది. మరోవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా మోడీని తీసుకొస్తే కేసు విచారణలో పురోగతి ఉంటుందని చెబుతోంది.

  • Share this:
బ్యాంకులను నిండా ముంచేసి బ్రిటన్ చెక్కేసిన నీరవ్ మోడీ ఇక తప్పించుకోలేడు. గీతాంజలితో పాటు వివిధ బ్రాండ్లతో వజ్రాలు,బంగారు వ్యాపారం చేసిన ప్రముఖ వ్యాపారవేత్త నీరవ్ మోడీని స్వదేశానికి పంపాల్సిందేనంటూ బ్రిటన్ కోర్టు తీర్పుచెప్పింది. మోడీని భారత్‌కు పంపితే అక్కడి కోర్టుల్లో ఆయన సమాధానం చెప్పాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది. బ్యాంకులను మోసం చేశారనే విషయంపై ప్రాథమిక ఆధారాలున్నాయని కోర్టు స్పష్టం చేసింది. ఆయన మానసిక స్థితిగతులు ఇందుకు ఏమాత్రం అవరోధం కాదని కూడా కోర్టు తేల్చిచెప్పడంతో ఇక నీరవ్ మోడీని భారత్‌కు తెచ్చేందుకు లైన్ క్లియర్ అయినట్టే. ఇండో-బ్రిటన్ దేశాల మధ్య ఉన్న నేరస్థుల అప్పగింత ఒప్పందం ప్రకారం మరో రెండు నెలల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకోవటం ఖాయంగా కనిపిస్తోంది.

నీరవ్ మోడీ వ్యవహారం అంతా డీఫాల్టర్లకు పెద్ద హెచ్చరికలా మారుతుందని సీబీఐ చెబుతోంది. ఈ కేసులో సాక్షులను నీరవ్ మోడీ బెదిరించి, ప్రలోభాలకు గురిచేస్తున్న విషయాన్ని వెస్ట్ మినిస్టర్ మాజిస్ట్రేట్ కోర్ట్ అంగీకరించింది. మోడీ కేసు కొలిక్కి తెచ్చేందుకు ఇది సానుకూల పరిణామం అయినప్పటికీ నీరవ్ మోడీని భారత్‌కు రప్పించేందుకు చాలా సమయం పట్టవచ్చు. గత రెండేళ్లుగా నీరవ్ మోడీ కేసు బ్రిటన్ కోర్టుల్లో నానుతుండగా..తాజాగా ఆయన అక్కడి పైకోర్టులను ఆశ్రయిస్తారనే సందేహాలకు దారితీస్తోంది.

కేసు పూర్వాపరాలు ఇవే:

2018, ఫిబ్రవరి 14న భారతీయ బ్యాంకులకు అతిపెద్ద షాక్ ఇచ్చిన నీరవ్ మోడీ.. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు ఏకంగా రూ.11,400కోట్ల రూపాయల కుచ్చుటోపీ పెట్టారు. ఫేక్ బ్యాంక్ గ్యారెంటీలతో నీరవ్ మోడీ భారీ కుట్ర పన్ని బ్యాంకును నిండా ముంచారు. బ్యాంకు వద్ద తీసుకున్న రుణాన్ని నీరవ్ మోడీ ఎగవేయడంతో PNB కుదేలైంది. దిక్కుతోచని స్థితిలో సీబీఐని ఆశ్రయించి.. ఆ సొమ్ము వసూలు చేయించాలని కోరింది. ముడి వజ్రాల దిగుమతి కోసం రుణం తీసుకున్న ఆయన ఇందుకు విదేశాల్లో చెల్లింపుల కోసం బ్యాంకుకు తప్పుడు లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్((LoU)లు సమర్పించారు. ఏళ్లు గడుస్తున్నా నీరవ్ మాత్రం రుణం చెల్లించలేదు..ఈ నేపథ్యంలోనే బ్యాంకుకు కొత్తగా వచ్చిన సిబ్బంది మొత్తం మోసాన్ని పసిగట్టింది. మొత్తం విషయాన్ని తవ్వగా 2011-2018 మధ్యకాలంలో కుంభకోణం జరిగినట్లు తేలింది.

ఇదే కేసులో మోడీ సమీప బంధువైన మేహుల్ చోక్సిపై కూడా కుంభకోణానికి సంబంధించిన కేసులు నమోదై, విచారణ సాగుతోంది. ఇంటర్ పోల్ కూడా నీరవ్ మోడీపై మనీ లాండరింగ్ కేసు దాఖలు చేసింది. మరోవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా మోడీని తీసుకొస్తే కేసు విచారణలో పురోగతి ఉంటుందని చెబుతోంది.

వజ్రాల వ్యాపారి అయిన నీరవ్ మోడీ ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు అభియోగాలు ఎదుర్కొంటూ, విదేశాలకు పారిపోయి రూ. 73కోట్ల ఖరీదైన భవంతిలో ఎంజాయ్ చేస్తున్నట్టు బ్రిటన్ మీడియా గుర్తించేవరకు ఆయన పరారీలో ఉన్నట్టు తెలియలేదు. అంతేకాదు అక్కడ కూడా వజ్రాల వ్యాపారాన్ని మళ్లీ ప్రారంభించినట్టు లండన్ మీడియా వెలువరించింది. ఎన్నో ఏళ్లుగా వజ్రాల వ్యాపారంలో ప్రీమియం బ్రాండ్‌గా ఉన్న తన సంస్థ కార్యకలాపాలను నీరవ్ మోడీ విస్తరిస్తున్నారు. అంతేకాదు సరికొత్తగా వజ్రాల వ్యాపారాన్ని మరింత భారీ స్థాయిలో సైలెంట్‌గా చేసుకుని పోతున్నట్టు బ్రిటన్ మీడియా పసిగట్టింది. బిలియనీర్‌గా భారీ సంపదను మూటగట్టుకున్న మోడీ మాత్రం పీఎన్బీకి చెల్లించేందుకు అవసరమైన మొత్తం తనవద్ద లేదని తెగేసి చెబుతున్నారు.

మనదేశంలో అతి పెద్ద జాతీయ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన సూత్రధారి అయిన నీరవ్ మోడీ బ్రిటన్‌లో విలాసవంతమైన జీవితం గడుపుతూ, తన గెటప్‌ను మార్చి హ్యాపీగా కొత్త జీవితం గడుపుతున్నట్టు బ్రిటన్ మీడియా బోలెడు సంచలన కథనాలు వెలువరించింది. ఇంత చేస్తూ కూడా తనకు బెయిల్ కావాలని 5సార్లు అక్కడి కోర్టును అభ్యర్థించిన ఆయన..తన మానసిక పరిస్థితి బాలేదనే నెపంతో స్వదేశంలో అడుగుపెట్టకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. కాగా అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, పీఎన్బీలోని ఉన్నత ఉద్యోగుల సహకారంతోనే నీరవ్ మోడీ ఇదంతా పకడ్బందీగా అమలు చేసినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Published by:Shiva Kumar Addula
First published: