బ్యాంకులను నిలువునా మోసం చేసి ఎంచక్కా లండన్ చెక్కేసిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ లండన్ లో అరెస్టయ్యారు. దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలను తనకు అనుకూలంగా మార్చుకొని వేల కోట్ల రూపాయలను దండుకొని బ్యాంకులను కుదేలు చేసిన చరిత్ర నీరవ్ మోడీ సొంతం. సరిగ్గా ఏడాది క్రితం నీరవ్ మోడీ స్కామ్ బయట పడింది. బ్యాంకులు జారీ చేసే లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ (ఎల్వోయూ)లను అక్రమంగా సంపాదించి విదేశాల్లో బయ్యర్ క్రెడిట్స్ కింద ఏకంగా రూ.11,600 కోట్ల డ్రా చేసుకొని పంజాబ్ నేషనల్ బ్యాంకును నీరవ్ మోడీ కోలుకోలేని దెబ్బతీశాడు. పీఎన్బీ స్టాక్ ఎక్స్చేంజీలకు సమాచారం ఇచ్చే వరకూ ఈ స్థాయి భారీ అక్రమ వ్యవహారం బయటపడకపోవడం గమనార్హం.
నీరవ్ మోడీ
నిజానికి ముంబైలోని పీఎన్బీ బ్రాంచ్లో అక్కడ అవకతవకలకు పాల్పడే ఉద్యోగుల అండతో నీరవ్ ఈ భారీ కుంభకోణానికి తెర లేపారు. నీరవ్ మోడీ ఎప్పుడు వచ్చినా పీఎన్బీ ముంబైలోని బ్రాడీ హౌస్ బ్రాంచ్ నుంచి అక్రమంగా చాలా సులువుగా ఎల్వోయూలు పొందేవారు. ఇదే అదనుగా నీరవ్ మోడీ రెచ్చిపోయి వేలాది కోట్ల రూపాయాలను అక్రమంగా విదేశాల్లో బయ్యర్ క్రెడిట్స్ ద్వారా డ్రా చేసుకునేవారు. చివరికి బ్రాడీ హౌస్ బ్రాంచ్ లో జరుగుతున్న ఈ తతంగం ప్రధాన కార్యాలయానికి చేరడంతో పంజాబ్ నేషనల్ బ్యాంకు పునాదులే కదిలే స్థాయిలో భారీ కుంభకోణం బయటపడింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.13 వేల కోట్ల విలువైన ఎల్ వోయూలు నీరవ్ అప్పనంగా బ్యాంకునుంచి తీసుకెళ్లారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఒక దశలో పంజాబ్ నేషనల్ బ్యాంకు కోలుకోవడానికే మూడు క్వార్టర్లు నష్టాలను భరించాల్సి వచ్చింది. ప్రభుత్వ బ్యాంకింగ్ వ్యవస్థపైనే అనుమానాలకు తావిచ్చేలా పీఎన్బీ కుంభకోణం సాగింది. అంతే కాదు నీరవ్ మోడీకి ఎల్వోయూ జారీ చేసిన పాపానికి విదేశీ బ్యాంకులకు పీఎన్బీ రుణాలు చెల్లించాల్సి వచ్చింది.
ప్రతీకాత్మక చిత్రం
అసలు ఖాతాదారులు పూర్తి 100 శాతం క్యాష్ మార్జిన్ ఫిక్స్డ్ డిపాజిట్ గా చూపిస్తేనే ఎల్వోయూ జారీ చేయాలి. కానీ నిబంధనలను విరుద్ధంగా పీఎన్బీ ఉద్యోగులు నీరవ్ మోడీకి ఎల్వొయూలు జారీ చేశారు. అయితే ఒక దశలో నీరవ్ మోడీ ఎల్ వోయూలను ఫోర్జరీ చేసి మరీ డబ్బు తరలించారని ఇందుకు సంబంధించిన స్విఫ్ట్ మెసెజింగ్ సర్వీసును హ్యాకింగ్ చేసి మరీ నీరవ్ దుర్వినియోగం చేసినట్లు పీఎన్బీ అంతర్గత దర్యాప్తులో తేలింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.