టాప్ బిజినెస్‌మెన్స్, క్రీడాకారులు, సినీ హీరోలు, ఇతర ప్రముఖులు భారీ ఇళ్లు, కాస్ట్లీ కార్లు, వస్తువులు కొనుగోలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. కొన్నింటికి వారు చేసే ఖర్చు చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. తాజాగా భారీ ధరతో దేశంలోనే అత్యంత ఖరీదైన పెంట్‌హౌస్ కొనుగోలు చేసి వార్తల్లో నిలుస్తున్నారు బజాజ్ ఆటో ఛైర్మన్ నీరజ్ బజాజ్ (Niraj Bajaj). ముంబైలోని మలబార్ హిల్‌లో సముద్రానికి ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్‌ను నీరజ్ కొనుగోలు చేశారు. దీని ధర రూ.252.5 కోట్లు కావడం గమనార్హం.
ఈ ట్రాన్సాక్షన్ కంటే ముందు ఈ ఏడాదిలోనే మరో రెండు పెద్ద కొనుగోళ్లు జరిగాయి. అందులో ఒకటి వెల్‌స్పన్ గ్రూప్ ఛైర్మన్ BK గోయెంకాది కాగా, మరొకటి అవెన్యూ సూపర్‌మార్ట్స్‌కి చెందిన రాధాకృష్ణ దమానీ చేశారు.
* మొత్తం వైశాల్యం 18,008 చదరపు అడుగులు
2021 మే 1 నుంచి బజాజ్ ఆటో ఛైర్మన్‌గా పనిచేస్తున్న నీరజ్ బజాజ్, మాక్రోటెక్ డెవలపర్‌ల నుంచి లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. ఈ డీల్‌పై మార్చి 13న సోమవారం ఆయన సంతకం చేసినట్లు IndexTap.com షేర్ చేసిన డాక్యుమెంట్‌లను పేర్కొంటూ న్యూస్‌పోర్టల్ మనీకంట్రోల్ కథనాన్ని ప్రచురించింది.
నీరజ్ బజాజ్ కొనుగోలు చేసిన ట్రిప్లెక్స్ హౌస్‌లోని మూడు అపార్ట్‌మెంట్ల మొత్తం వైశాల్యం 18,008 చదరపు అడుగులు (కార్పెట్ ఏరియా 12624 చదరపు అడుగులు). ఎనిమిది కార్ పార్కింగ్ స్లాట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ అపార్ట్‌మెంట్‌లు లోధా మలబార్ ప్యాలెస్‌లో ఉన్నాయి, ఇందులో మొత్తం 31 అంతస్తులు ఉన్నాయి. ఈ డీల్ కోసం రూ.15.15 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించారు.
* గోయెంకా, దమానీ డీల్స్ వివరాలు
ఈ ఏడాది ఫిబ్రవరిలోనే DMartని నడుపుతున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ, భారతదేశపు అతిపెద్ద రియల్ ఎస్టేట్ డీల్‌ను పూర్తి చేశారు. సుమారు రూ.1,238 కోట్లకు 28 లగ్జరీ అపార్ట్‌మెంట్‌లను కొనుగోలు చేశారు. ముంబైలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం కార్పెట్ ఏరియా 1,82,084 చదరపు అడుగులకు సంబంధించిన లావాదేవీలు ఫిబ్రవరి 3న జరిగినట్లు మనీకంట్రోల్ పేర్కొంది.
ఇది కూడా చదవండి : జాబ్ వదిలేసి పుట్టగొడుగుల ఉత్పత్తి .. ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తున్న ఇంజనీర్
ఫిబ్రవరిలోనే వెల్‌స్పన్ గ్రూప్ ఛైర్మన్ BK గోయెంకా రూ.230 కోట్లతో ఒబెరాయ్ రియల్టీకి చెందిన లగ్జరీ ప్రాజెక్ట్ వోర్లి, త్రీ సిక్స్టీ వెస్ట్‌లో ఒక పెంట్‌హౌస్‌ను కొనుగోలు చేశారు. గోయెంకా పెంట్‌హౌస్ టవర్ Bలో 63వ అంతస్తులో ఉంది. హిందుస్థాన్ టైమ్స్ తెలిపిన వివరాల ప్రకారం.. 29,885 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాలో విస్తరించి ఉంది. అపార్ట్‌మెంట్‌లో 4,815 చదరపు అడుగుల టెర్రస్ ఏరియా, 411 చదరపు అడుగుల అడిషనల్ ఏరియా, 13,0951 చదరపు అడుగుల ఫ్రీ సేల్ ల్యాండ్ ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: National News, Trending news, VIRAL NEWS