ఇండియాలో ట్రైన్ నెట్‌వర్క్ (Train Network) చాలా పెద్దది. వివిధ ప్రాంతాల్లో కొండలు, నదులు, మంచు ప్రాంతాలు, ఎడారులు, అడవులు దాటి రైళ్లు ప్రయాణిస్తుంటాయి. ట్రాక్ లపై రైళ్లు శరవేగంగా దూసుకెళ్తున్నప్పుడు వన్యప్రాణులు అనుకోకుండా ఎదురొచ్చి ప్రాణాలు కోల్పోతున్నాయి. మరికొన్ని తీవ్ర గాయాలపాలై నరకయాతన అనుభవిస్తున్నాయి. ఏనుగులు (Elephants) కూడా రైల్వే ట్రాక్‌లు దాటుతూ మృత్యువాత పడుతున్నాయి. అయితే ఏనుగులను ప్రమాదాల నుంచి రక్షించడానికి ఈశాన్య సరిహద్దు రైల్వే (NFR) నడుం బిగించింది. ఈ రైల్వే (NFR) విభాగం రైలు-ఏనుగు ఢీకొనడాన్ని నివారించడానికి రైల్వే ట్రాక్‌ల వెంట AI-ఆధారిత ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్ (IDS)ని ఇన్‌స్టాల్ చేయడానికి RailTel కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
* ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది
ఎన్‌ఎఫ్‌ఆర్ CPRO సబ్యసాచి దే ప్రకారం.. ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్ అనేది ట్రాక్‌ల దగ్గర వన్యప్రాణులు, ముఖ్యంగా ఏనుగుల సంచారాన్ని సమర్థవంతంగా గుర్తిస్తుంది. సాధారణంగా IDS రైల్వే ట్రాక్‌ల దగ్గర ఏనుగుల వంటి వన్యప్రాణుల కదలికలను గుర్తించడానికి ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్లు, కెమెరాలు, ఇతర సెన్సార్‌ల వంటి వివిధ టెక్నాలజీలను ఉపయోగిస్తుంది.
అయితే NFR ఇన్‌స్టాల్ చేయనున్న AI-బేస్డ్ IDS అడవి జంతువుల కదలికలను గుర్తించడానికి ఇప్పటికే ఉన్న ఆప్టికల్ ఫైబర్లను సెన్సార్‌లుగా ఉపయోగిస్తుంది. రైల్వే ట్రాక్‌లపై ఏనుగుల ఉనికిని గుర్తించి, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడానికి రైల్వే అధికారులను అప్రమత్తం చేస్తుంది. రైల్వే ట్రాక్‌పై ఏనుగుల రియల్ టైమ్ ఉనికిని గ్రహించే ఫైబర్ ఆప్టిక్ ఆధారిత ధ్వని వ్యవస్థను ఉపయోగించడం ద్వారా ఈ IDS టెక్నాలజీ పని చేస్తుంది.
ఈ సిస్టమ్ ట్రాక్ సమీపంలో జంతువును గుర్తించినప్పుడు, రైల్వే అధికారులను అప్రమత్తం చేస్తుంది. ట్రాక్‌ల వెంట IDS ఇన్‌స్టాలేషన్ కోసం ఎన్‌ఎఫ్‌ఆర్ జనరల్ మేనేజర్ అన్షుల్ గుప్తా, ఇతర అధికారుల సమక్షంలో ఇరు సంస్థల అధికారులు అవగాహన ఒప్పందం (MoU)పై సోమవారం గౌహతిలో అధికారులు సంతకాలు చేశారు. రైల్వే ట్రాక్‌ల దగ్గర వన్యప్రాణుల సంచారాన్ని నిరోధించడానికి, గుర్తించడానికి NFR చేస్తున్న ప్రయత్నాలలో ఈ ప్రోగ్రామ్ ఒక భాగం.
* ఏనుగులను కాపాడటంలో IDS ఆల్రెడీ సక్సెస్
పశ్చిమ బెంగాల్‌లోని డోయర్స్ ప్రాంతంలోని చల్సా-హసిమారా విభాగంతోపాటు అస్సాంలోని లుమ్‌డింగ్ డివిజన్‌లో ఉన్న లంకా-హవాయిపూర్ సెక్షన్‌లో ఈ కొత్త వ్యవస్థను (IDS) పైలట్ ప్రాజెక్ట్‌గా రైల్వే అధికారులు ఇన్‌స్టాల్ చేశారు. ఈ పైలట్ ప్రాజెక్ట్‌లో చాలా ఏనుగులను విజయవంతంగా కాపాడారు. మరిన్ని ఏనుగులను కాపాడేందుకు త్వరలోనే ఈ వ్యవస్థను NF రైల్వే నెట్‌వర్క్‌లో విస్తరించి ఉన్న అన్ని ఇతర ఏనుగు కారిడార్‌లలో క్రమంగా అమర్చనున్నట్లు ఒక రైల్వే అధికారి ప్రకటించారు. దీనివల్ల ఎన్నో ఏనుగుల ప్రాణాలను రక్షించవచ్చని అధికారులు ఆశిస్తున్నారు.
అఫీషియల్ రైల్వే స్టేట్‌మెంట్ ప్రకారం, IDS 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న అసాధారణ కదలికలను సైతం గుర్తించగలదు. అంతేకాదు, ఇది విరిగిన ట్రాక్‌లు, ట్రాక్‌ల మీద ప్రజలు నడవడం, ట్రాక్‌ల సమీపంలో త్రవ్వడం లేదా కొండచరియలు విరిగిపడటం వల్ల సంభవించే విపత్తుల వంటి వాటిని గుర్తించడం లో రైల్వే అధికారులకు ఉపయోగపడుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Auto, Elephant, Indian Railways